logo

మృతులే ఓట్లు తొలగించమని దరఖాస్తు చేస్తారా?

బాపట్ల జిల్లా కారంచేడు మండలం దగ్గుబాడులో 26 మంది మృతుల ఓట్లు తొలగించాలని ఫారం-7లు అధికారులకు అందాయని, వీటిలో 24 దరఖాస్తులు..

Published : 24 Sep 2023 06:16 IST

మాట్లాడుతున్న సర్పంచి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌

కారంచేడు (పర్చూరు), న్యూస్‌టుడే: బాపట్ల జిల్లా కారంచేడు మండలం దగ్గుబాడులో 26 మంది మృతుల ఓట్లు తొలగించాలని ఫారం-7లు అధికారులకు అందాయని, వీటిలో 24 దరఖాస్తులు మృతిచెందిన వారే దాఖలు చేసినట్లు ఉన్నాయని గ్రామ సర్పంచి గేరా రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ తెలిపారు. తమ కుటుంబ సభ్యులలోనూ కొందరి ఓట్లు తొలగించాలని దరఖాస్తు చేసినట్లు చెప్పారు. శనివారం పంచాయతీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పోలింగ్‌ కేంద్రం 197లో 55 షిఫ్టింగ్‌, 5 మరణాలకు సంబంధించిన అర్జీలు వచ్చాయని, జీవనోపాధి కోసం ఇతర గ్రామాల్లో నివసిస్తున్న వారి ఓట్లు తొలగించేందుకు అక్రమంగా షిఫ్టింగ్‌ దరఖాస్తు చేశారన్నారు. హనీఫ్‌ అనే వ్యక్తి జీవనోపాధి కోసం అద్దంకిలో ఉంటున్నారని, అతని ఓటు తొలగించేందుకు అర్జీ సమర్పించారన్నారు. హనీఫ్‌ దరఖాస్తు చేసినట్లు గ్రామానికి చెందిన ఇతర వ్యక్తి అర్జీ చేశారని చెప్పారు. కారంచేడు మండలంలో మొత్తం 298 ఓట్లు తొలగించాలని అధికారులకు దరఖాస్తులు అందాయని, వీటిపై శనివారం విచారణ జరుగుతుందని అధికారులు సమాచారం ఇచ్చారన్నారు. తహసీల్దార్‌ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుందని చెప్పడంతో కొందరు స్థానికులు రాగా, దరఖాస్తు చేసినవారు మాత్రం రాలేదని సర్పంచి చెప్పారు. దీంతో కొందరికి ఫోన్‌ చేయగా పంచాయతీ కార్యాలయానికి వచ్చారన్నారు. ఈక్రమంలో వచ్చిన బీఎల్వోలను ఓట్ల తొలగింపు దరఖాస్తుపై స్థానికులు ప్రశ్నించగా గ్రామానికి చెందిన వ్యక్తులే దరఖాస్తు చేసినట్లు బీఎల్వోలు తెలిపారు. దీంతో ఓటర్లకు, దరఖాస్తు చేసినవారికి వాగ్వాదం జరిగి కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్రమంగా ఓట్లు తొలగించేందుకు వైకాపా నాయకులే ఇలాంటి ఎత్తుగడ వేసినట్లు సర్పంచి పేర్కొనడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని