logo

ఇంటింటికీ వెళ్దాం.. అరాచకంపై పోరాడదాం

‘అనేక కేసుల్లోని ముద్దాయి.. బెయిల్‌పై ఉన్న వ్యక్తి రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. తన అవినీతి బురదను అందరిపై చల్లాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడును నిరాధార ఆరోపణలతో అక్రమంగా అరెస్టు చేశారు.

Published : 24 Sep 2023 06:19 IST

మూడు జిల్లాల్లో 3 వేల మందిపై కేసులు
పోలీసు అధికారులపై న్యాయస్థానాల్లో దావాలు
తెదేపా ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకుల తీర్మానం

సమావేశంలో ఎమ్మెల్యేలు స్వామి, గొట్టిపాటి, ఏలూరి,మాజీ ఎమ్మెల్యేలు దామచర్ల, ఉగ్ర నరసింహారెడ్డి,నాయకులు ఎరిక్షన్‌బాబు, కొండయ్య, నూకసాని

ఈనాడు, ఒంగోలు- ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ‘అనేక కేసుల్లోని ముద్దాయి.. బెయిల్‌పై ఉన్న వ్యక్తి రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. తన అవినీతి బురదను అందరిపై చల్లాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడును నిరాధార ఆరోపణలతో అక్రమంగా అరెస్టు చేశారు. చట్టసభలు, ప్రజాప్రతినిధులను కూడా హేళన చేస్తూ అరాచక పాలన సాగిస్తున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో నేతలు, కార్యకర్తలు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఆ తర్వాత చేపట్టిన దీక్షల్లో భాగంగా పలుచోట్ల కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు బనాయించారు. సదరు పోలీసు అధికారులపై ప్రైవేట్‌ కేసులు వేద్దాం. చంద్రబాబు జైలు నుంచి విడుదలై వచ్చేవరకు ప్రజాక్షేత్రంలో ఉందాం. అన్ని నియోజకవర్గాల్లో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేద్దాం. ప్రతి ఇంటికీ వెళ్లి చంద్రబాబు అక్రమ అరెస్టుపై వివరిద్దాం. ప్రజా కంటక వైకాపా ప్రభుత్వాన్ని గద్దెదింపుదాం’..  అని తెదేపా ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు తీర్మానించారు. చంద్రబాబు అరెస్ట్‌, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై ఉమ్మడి ప్రకాశం ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల సమావేశం ఒంగోలులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో చర్చించిన పలు అంశాలను కొండపి ఎమ్మెల్యే డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి వెల్లడించారు. ఎన్నికలు ఎప్పుడైనా జరిగే అవకాశం ఉన్నందున అందరం ప్రజాక్షేత్రంలో ఉండాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రభుత్వ అరాచక విధానాలు, దుర్మార్గ వైఖరిని ప్రజలకు కార్యకర్తలు తెలియజేయాలని కోరారు. అసెంబ్లీలో సమస్యలపై చర్చించేందుకు స్వేచ్ఛ కూడా ఇవ్వడం లేదని.. పోలీసులు, మార్షల్స్‌ను అధిక సంఖ్యలో ఏర్పాటు చేసి అడ్డుకుంటున్నారని విమర్శించారు. సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి మెప్పు కోసం కొందరు స్కిల్‌ స్కాం రూ.3 వేల కోట్లు అంటారు.. మరికొందరు రూ.370 కోట్లు అంటారని ఎద్దేవా చేశారు. పార్టీ శ్రేణులపై పెట్టిన అక్రమ కేసులపై న్యాయస్థానాల్లో పోరాడతామని చెప్పారు. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. చంద్రబాబుపై తప్పుడు కేసుల పరంపర కొనసాగించాలని చూస్తున్నారన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ తర్వాత ప్రకాశం, బాపట్ల, నెల్లూరు ఎస్పీలు ఇప్పటివరకు 3 వేల మందికి పైగా తెదేపా శ్రేణులపై కేసులు పెట్టారని ఆరోపించారు. ఓట్ల తొలగింపు నిమిత్తం ప్రతి నియోజకవర్గంలోనూ 20 నుంచి 25 వేల వరకు ఫారం-7 దరఖాస్తు చేశారని, ఈ విషయమై ఇప్పటికే సీఈవోను కలిసినట్లు తెలిపారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ మాట్లాడుతూ.. నైపుణ్యాభివృద్ధి సంస్థ కింద రాష్ట్ర వ్యాప్తంగా 36 కేంద్రాల ద్వారా 2.30 లక్షల మందికి శిక్షణ ఇచ్చి అందులో 75 వేల మందికి ఉద్యోగాలిస్తే.. స్కాం అని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. సమావేశంలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌, మాజీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్‌, ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, నియోజకవర్గ బాధ్యులు గూడూరి ఎరిక్షన్‌బాబు, ఇంటూరి నాగేశ్వరరావు, ఎం.ఎం.కొండయ్య తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం, గిద్దలూరు, సంతనూతలపాడు బాధ్యులు కందుల నారాయణరెడ్డి, ముత్తుముల అశోక్‌రెడ్డి, బీఎన్‌.విజయ్‌కుమార్‌ ఫోన్‌లో తమ అభిప్రాయాలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని