logo

మాజీ ఎమ్మెల్యే ఇంటి వద్ద ఉద్రిక్తత

చేబ్రోలు మండల పరిధి వడ్లమూడి విజ్ఞాన్‌ యూనివర్సిటీలోని స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను మంగళవారం మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌, తెదేపా నాయకులు సందర్శిస్తారనే సమాచారం మేరకు.. దక్షిణ మండల డీఎస్పీ మహబూబ్‌బాషా ఆధ్వర్యంలో ధూళిపాళ్లను మంగళవారం తెల్లవారుజూమున చింతలపూడిలో స్వగృహంలో నిర్బంధించారు.

Published : 27 Sep 2023 05:33 IST

విజ్ఞాన్‌లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌కు వెళ్తారని గృహ నిర్బంధం

ధూళిపాళ్లను స్టేషన్‌కు తరలిస్తున్న డీఎస్పీ మహబూబ్‌ బాషా

పొన్నూరు, న్యూస్‌టుడే : చేబ్రోలు మండల పరిధి వడ్లమూడి విజ్ఞాన్‌ యూనివర్సిటీలోని స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను మంగళవారం మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌, తెదేపా నాయకులు సందర్శిస్తారనే సమాచారం మేరకు.. దక్షిణ మండల డీఎస్పీ మహబూబ్‌బాషా ఆధ్వర్యంలో ధూళిపాళ్లను మంగళవారం తెల్లవారుజూమున చింతలపూడిలో స్వగృహంలో నిర్బంధించారు. ఈ నేపథ్యంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు ఆయన ఇంటి వద్దకు తరలివచ్చారు. ధూళిపాళ్లతో డీఎస్పీ మహబూబ్‌బాషా, అర్బన్‌ సీఐ మహమ్మద్‌ ఖాజా అల్తాఫ్‌ హఫీజ్‌ సమావేశమయ్యారు. విజ్ఞాన్‌కు వెళ్లడానికి అనుమతులు లేవని పోలీసు అధికారులు చెప్పారు. విజ్ఞాన్‌ ప్రతినిధుల అనుమతులు లేకుండా కళాశాలలోకి ప్రవేశించమని, అనుమతి తీసుకున్న తర్వాతే వెళతామని నరేంద్ర పేర్కొన్నారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లడానికి అనుమతి లేదని సీఐ చెప్పడంతో.. మాజీ ఎమ్మెల్యే స్పందించారు. నా ఇంట్లో ఉండటానికి ఎవరి అనుమతులు అక్కరలేదని, నా ఇంట్లోకి రావడానికే పోలీసులే నా అనుమతులు తీసుకోవాలంటూ చమత్కరించారు. ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో.. తెదేపా నేతలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు చుట్టుముట్టి ధూళిపాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ని జీపులో తరలించే క్రమంలో.. తెదేపా నేతలు అడ్డంగా పడుకుని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తోపులాట మధ్య ఎట్టకేలకు ఆయన్ని పొన్నూరు అర్బన్‌ పోలీసు సేష్టన్‌కు తరలించారు. తెదేపా మండల అధ్యక్షుడు బండ్లమూడి బాబూరావును గ్రామీణ ఎస్సై భార్గవ్‌ వ్యక్తిగతంగా దూషించడంతోపాటు.. తనపై దాడి చేశాడని డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో ఆయన మనోవేదనకు గురయ్యారు. మాజీ ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు లేవని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పడం బాధాకరమన్నారు. ప్రభుత్వమే ఆయా కేంద్రాలకు సంబంధించిన పత్రాలను మాయం చేసిందని, దీనిపై విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. తెదేపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాజకీయాలకు అతీతంగా విజ్ఞాన్‌ యూనివర్సిటీలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారని చెప్పారు. విజ్ఞాన్‌లో 12,000 వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. సీఐడీ అధికారులు అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్నారు తప్ప.. ఆ నిధులు ఏ ఖాతాకు జమ చేశారో చెప్పలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని