logo

నిర్వహణ లేదు... నీరు పారదు..

గుంటూరు జిల్లాలో కొండవీటివాగు, కొటేళ్లవాగు నిర్వహణను ప్రభుత్వం పట్టించుకోకపోవడం పరివాహక ప్రాంతంలోని రైతులకు శాపంగా మారింది. వైకాపా ప్రభుత్వం రాజధాని అమరావతిపై కక్ష కట్టి అభివృద్ధి ఆపేయడంతో ఈ దుస్థితి ఏర్పడింది.

Updated : 27 Sep 2023 06:15 IST

పొలాలను ముంచెత్తిన నీరు
కొండవీటివాగు పరిధిలో ఇదీ పరిస్థితి

పెదపరిమి వద్ద కొండవీటి వాగు, కొటేళ్ల వాగు ఉద్ధృతితో నీట మునిగిన పొలాలు

ఈనాడు, అమరావతి: గుంటూరు జిల్లాలో కొండవీటివాగు, కొటేళ్లవాగు నిర్వహణను ప్రభుత్వం పట్టించుకోకపోవడం పరివాహక ప్రాంతంలోని రైతులకు శాపంగా మారింది. వైకాపా ప్రభుత్వం రాజధాని అమరావతిపై కక్ష కట్టి అభివృద్ధి ఆపేయడంతో ఈ దుస్థితి ఏర్పడింది. సీఆర్‌డీఏ చేపట్టిన వివిధ రోడ్ల పనులు అర్ధంతరంగా ఆపేయడంతో వాగుల నీరు ముందుకు వెళ్లే మార్గం లేక వెనక్కి వచ్చి పొలాలు నీట మునుగుతున్నాయి. కొండవీటివాగు ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చేయడానికి రూ.30లక్షల నిధులు ఇవ్వాలని జలవనరులశాఖ గతేడాది సీఆర్‌డీఏకి లేఖ రాసినా స్పందన లేదు. నాలుగేళ్లుగా కొండవీటివాగు నిర్వహణకు రూపాయి కూడా ఖర్చు పెట్టకపోవడంతో పెదపరిమి, నీరుకొండ, తాడికొండ గ్రామాలకు చెందిన పొలాలు ముంపునకు గురవుతున్నాయి.

అడ్డంకులు తొలగించనందునే...

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలోని కొండల్లో ప్రారంభమయ్యే కొండవీటివాగు తాడేపల్లి మండలంలోని ఉండవల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. లాం గ్రామం నుంచి వాగు ఉద్ధృతి మొదలై పెదపరిమి దాటిన తర్వాత కొటేళ్లవాగు, కృష్ణాయపాలెం వద్ద పాలవాగు కలయికతో మరింత ఉద్ధృతితో ప్రవహిస్తుంది. ప్రకాశం బ్యారేజీ వద్ద కొండవీటివాగు ఎత్తిపోతల పథకం నిర్మించిన గత ప్రభుత్వం తాడికొండ, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో పొలాలు నీటమునగకుండా నీటిని ప్రకాశం బ్యారేజీలోకి ఎత్తిపోసింది. ఈ ప్రాంతంలోనే రాజధాని అమరావతి నిర్మాణం చేపట్టడంతో కొండవీటివాగు అభివృద్ధి పనులు ప్రారంభించింది. వాగు ఉద్ధృతి ఎక్కువగా ఉన్నా రాజధానికి ఇబ్బంది లేకుండా వాగును విస్తరించడంతో పాటు ప్రవాహం సజావుగా వెళ్లేలా ప్రణాళికలు రూపొందించింది. అవసరమైనచోట వంతెనల నిర్మాణం ప్రారంభించారు. అయితే వైకాపా ప్రభుత్వం వచ్చాక ఎక్కడికక్కడ పనులు ఆగిపోయాయి. కనీసం వాగులో పిచ్చిమొక్కలు, తూటుకాడ కూడా తొలగించడం లేదు. పనులు అర్ధంతరంగా ఆగిపోవడంతో నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. వరద వచ్చినప్పుడు ప్రవాహాన్ని సజావుగా పంపే ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో వాగు నీరు వెనక్కి వచ్చి రాజధాని ప్రాంతానికి సమీపంలో ఉన్న పంట పొలాలను ముంచెత్తుతోంది. వేల ఎకరాల్లో రెండు వారాలుగా వర్షపు నీరు నిలిచిపోవడంతో పంటలు వేసుకోలేని పరిస్థితి. పెదపరిమి, తాడికొండ పొలాల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారు పంటలు సాగు చేయలేని దుస్థితి.

ఎత్తిపోతల పథకం వద్దకు చేరని నీరు...

కొండవీటివాగులో గరిష్ఠంగా 10వేల క్యూసెక్కుల వరకు వరద నీరు వస్తుంది. పొలాలు ముంచెత్తకుండా సజావుగా తరలించడానికి రూ.237కోట్లతో 2018లో గత ప్రభుత్వం కొండవీటివాగు ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ 5వేల క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజీలోకి ఎత్తిపోసే సౌకర్యం ఉంది. వాగు నీరు అక్కడికి వెళ్లడానికి దారిలో అనేక అడ్డంకులు ఉండడంతో ఎక్కడికక్కడ ఆగిపోతోంది. దీంతో పథకం నిర్మించినా నిరుపయోగంగా మారింది. పథకం వద్దకు వరద నీరు వస్తే ఎత్తిపోయడానికి తాము సిద్ధంగా ఉన్నామని జలవనరుల శాఖ చెబుతోంది. ఇటీవల కొంత వరద నీరు వస్తే వెంటనే ఎత్తిపోశామని గుర్తు చేస్తున్నారు.

ఎవరికివారే యమునాతీరే...

కొండవీటివాగు వరద సమస్య గతంలో కూడా ఉండేది. అయితే వాగుల నిర్వహణ గతంలో జలవనరులశాఖ అధికారులు చూసుకునేవారు. వరద ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చర్యలు చేపట్టేవారు. కొన్ని పనులు రైతులు చేసుకుని సహకరించేవారు. రాజధాని ఏర్పడ్డాక కొండవీటివాగులో ప్రాంతం సీఆర్‌డీఏ పరిధిలోకి వెళ్లిపోయింది. దీంతో తమ పరిధిలో లేదని జలవనరులశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. అమరావతి ప్రాంతంలో అభివృద్ధి పనులతో పాటు వాగు నిర్వహణ, వరదనీటి తరలింపును సీఆర్‌డీఏ సైతం విస్మరించింది. ఫలితంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జలవనరుల శాఖ అధికారులు గతేడాది రూ.30లక్షలతో సీఆర్‌డీఏకి ప్రతిపాదనలు పంపారు. నిధులు విడుదల చేస్తే జలవనరుల శాఖ తరఫున వాగులో పనులు చేస్తామని, లేదా సీఆర్‌డీఏ అయినా పనులు చేసి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చూడాలని కోరారు. సీఆర్‌డీఏ నుంచి స్పందన శూన్యం.

ఇబ్బంది పెట్టాలనే కుట్రతోనే...

కొండవీటివాగు ప్రాంతంలో ఎంత వరద వస్తుందో లెక్కించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం గాలికొదిలేసింది. రాజధాని గ్రామాల ప్రజలను ఇబ్బంది పెట్టాలనే కుట్రతోనే కొండవీటివాగు నిర్వహణ పట్టించుకోవడం లేదని నీరుకొండకు చెందిన గోవర్ధన్‌రావు నిలదీశారు. తూటుకాడ, గుర్రపుడెక్కతో నిండిపోయి వాగు ఆనవాళ్లు కనిపించకపోయినా పట్టించుకోరా? అని నిలదీస్తున్నారు. కొత్తవి ఎలాగూ నిర్మించరు. కనీసం ఉన్నవాటినైనా సక్రమంగా నిర్వహించడం, మరమ్మతులు చేయకపోతే ఎలా అని తాడికొండకు చెందిన ధనేకుల హరిబాబు ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని