logo

బడిఈడు పిల్లలెక్కడ?

బడి-ఈడు విద్యార్థులందరినీ బడిలో ఉండేలా చేయడంలో గుంటూరు జిల్లా విద్యా శాఖ వెనుకబడింది. పల్నాడు, బాపట్ల జిల్లాలతో పోలిస్తే గుంటూరులోనే చాలా మంది పిల్లలు బడి బయట ఉన్నట్లు గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో (జీఈఆర్‌) సర్వేలో వెల్లడైంది.

Updated : 27 Sep 2023 06:43 IST

7561 మందిని గుర్తించడంలో విద్యా శాఖ వైఫల్యం

గుంటూరు మండల విద్యా శాఖ కార్యాలయం

ఈనాడు, అమరావతి: బడి-ఈడు విద్యార్థులందరినీ బడిలో ఉండేలా చేయడంలో గుంటూరు జిల్లా విద్యా శాఖ వెనుకబడింది. పల్నాడు, బాపట్ల జిల్లాలతో పోలిస్తే గుంటూరులోనే చాలా మంది పిల్లలు బడి బయట ఉన్నట్లు గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో (జీఈఆర్‌) సర్వేలో వెల్లడైంది. ఆయా పాఠశాలల్లో పేరు నమోదు చేసుకున్న విద్యార్థులందరినీ తిరిగి బడికి వెళ్లేలా చేయడంలో గుంటూరు జిల్లా విద్యా శాఖ చతికిలబడింది.

జిల్లాలో 5-18 ఏళ్లలోపు వయస్సు పిల్లలు 2,56,544 మంది ఉన్నారు. వీరంతా ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎయిడెడ్‌, మదర్సా పాఠశాలల్లో  నమోదయ్యారు. అయితే క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఈ నెల 25కు 2,48,983 మంది విద్యార్థులే ఉన్నారు. మిగిలిన 7561 మంది విద్యార్థులు ఎక్కడ ఉన్నారో అధికారులకే తెలియాలి. వారు బడి బయట ఉంటే ఏదైనా పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో పని చేస్తున్నారా అనేది కూడా యంత్రాంగం తేల్చలేకపోయింది.
నిర్దేశిత బడి-ఈడు పిల్లలు పాఠశాలల్లో తప్ప మరెక్కడా ఉండరాదని, బయట ఉంటే తన పదవికి రాజీనామా చేస్తానని ఆ మధ్య పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు బీరాలు పలికారు. కేవలం ఒక్క గుంటూరు జిల్లాలోనే ఇప్పటికీ 7561 మంది విద్యార్థులు స్కూళ్లల్లో కనిపించడం లేదు. దీనికి విద్యాశాఖ ఏం సమాధానం చెబుతుందో చూడాలి మరి! జీఈఆర్‌ సర్వే పేరుతో గత కొద్ది రోజులుగా విద్యాశాఖ యంత్రాంగం బడి ఈడు పిల్లల్ని గుర్తించి వారు బడికి వెళ్లేలా చేయాలని కార్యాచరణ తీసుకుంది. సాక్షాత్తు ఆ సర్వేలోనే బడిబయట 7500 మందికి పైగా పిల్లలు ఉన్నారని వెల్లడైంది. ప్రతి హెచ్‌ఎం, ఎంఈఓ జీఈఆర్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. అయినా కొందరు ఎంఈఓలు దీన్ని తేలిగ్గా తీసుకోవడంతో పిల్లలు ఏ ఒక్క చోట కూడా నూరు శాతం బడిలో లేరు.

గుంటూరులోనే అధికంగా...

గుంటూరు నగరంలోనే జీఈఆర్‌ సర్వే ప్రకారం బడి-ఈడు పిల్లలు అందరినీ బడికి పంపడంలో మండల విద్యాశాఖ యంత్రాంగం వైఫల్యం చెందింది. ఏకంగా నలుగురు ఎంఈఓలు ఉన్నా గుంటూరు మండలంలో పిల్లల్ని బడికి పంపేలా చేయడంలో విఫలమయ్యారు. పొన్నూరు, ప్రత్తిపాడు, ఫిరంగిపురం, కాకుమాను మండలాల్లో ఎక్కడ చూసినా బడి బయట ఉన్న పిల్లలు 10 మంది లోపు ఉన్నారు. జిల్లా మొత్తంగా బడి బయట 

ఉన్న పిల్లల సంఖ్య 7561 కాగా అందులో ఒక్క గుంటూరు మండలంలోనే అత్యధికంగా 4370 మంది ఉన్నారు. వీరిని సచివాలయాల వారీగా ఉండే వాలంటీర్లు, సచివాలయ కార్యదర్శి, వార్డు ఎడ్యుకేషన్‌ సెక్రటరీ, వెల్ఫేర్‌ సెక్రటరీల సహాయంతో గుర్తించి బడికి పంపాల్సి ఉంది. నగరంలో 207 సచివాలయాలు ఉంటే వాటిల్లో 45 సచివాలయాల పరిధిలో ఇప్పటికీ పిల్లల గుర్తింపు ప్రక్రియ నూరు శాతం చేపట్టలేదు. ఆర్జేడీ, డీఈఓ తదితర ఉన్నతాధికారులు అందరూ ఉండే గుంటూరులో జీఈఆర్‌ సర్వేలో వెనకబడడం గమనార్హం. గతంలో గుంటూరు మండలం మొత్తానికి కలిపి ఒకే ఒక్క ఎంఈఓ ఉండేవారు. అప్పట్లోనే మండలంలో విద్యాశాఖ కార్యకలాపాలు బాగా జరిగేవని, ప్రస్తుతం నలుగురు ఎంఈఓలు ఉన్నా ప్రయోజనం లేకుండా పోయిందని ఉపాధ్యాయవర్గం అంటోంది.

  • ఇంకా ఆగస్టు నెలకు సంబంధించి 40 మంది ఉపాధ్యాయులకు మండలంలో జీతాలు జమ కాలేదు. సెప్టెంబరు జీతాల బిల్లుల్ని ఇప్పటి వరకు వెస్ట్‌ మండల పరిధిలో ఇంకా తయారు చేసి పంపలేదు. మండలంలో పనిచేసే ఉపాధ్యాయులకు సకాలంలో జీతాల బిల్లులు చేయడానికి వీలుగా ఉన్నతాధికారులతో సంప్రదించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జీతాల బిల్లుల నుంచి నాడు-నేడు పనుల దాకా ప్రతిదీ మండలంలో సమస్యగానే ఉంది. చాలా స్కూళ్లకు రివాల్వింగ్‌ ఫండ్‌ రాక పనులు జాప్యమవుతున్నాయి. సెంట్రల్‌ ప్రొక్యూర్‌మెంట్‌ కింద సామగ్రి రప్పించుకోవడానికి ఇన్వాయిస్‌లు జనరేట్‌ చేయలేదు. ఇలా మండలంలో విద్యాశాఖ కార్యకలాపాలు కుంటుపడుతున్నాయి. నలుగురిని సమన్వయపరిచి సమస్యలు లేకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపై ఉంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని