logo

జగన్‌ మామయ్యా.. దాహమేస్తుందయ్యా!

‘నాడు-నేడు’ ద్వారా అన్ని ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయిలో అన్ని సౌకర్యాలు అందుతున్నాయని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది.

Published : 27 Sep 2023 05:33 IST

జిల్లాలోని పలు పాఠశాలల్లో పనిచేయని ఆర్వో ప్లాంట్లు
విద్యార్థులకు తప్పని పాట్లు

మాచవరంలో వినియోగంలోకి  రాని ప్లాంటు

ఈనాడు డిజిటల్‌, నరసరావుపేట, పెదకూరపాడు, మాచర్ల గ్రామీణ: ‘నాడు-నేడు’ ద్వారా అన్ని ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయిలో అన్ని సౌకర్యాలు అందుతున్నాయని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. రూ.లక్షలు పెట్టి ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసినా జిల్లాలో 80శాతం బడుల్లో మూలనపడ్డాయి. కొన్ని నెలలకే మరమ్మతులకు గురవడం, సరైన నిర్వహణ కొరవడడంతో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు దూరమైంది. దీంతో చేతిపంపు నీరే దిక్కవుతోంది. కొంతమంది ఇళ్లనుంచే నీటి సీసాలు తెచ్చుకుంటున్నారు. కొన్నిరోజులకే మరమ్మతులు జిల్లాలో కొన్నిచోట్ల దాతలు ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేయగా, మరికొన్ని బడుల్లో ప్రభుత్వమే రూ.లక్షలు పెట్టి ప్లాంట్లు ఏర్పాటు చేసింది. కొన్ని నెలలకే అవి మరమ్మతులకు గురయ్యాయి. ఫిల్టర్‌ క్యాండిల్స్‌ అరిగిపోయాయి. వాటిస్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. క్యాండిల్స్‌ మార్చాల్సి ఉందని యాప్‌లో అధికారుల దృష్టికి ఆయా ప్రధానోపాధ్యాయులు తీసుకెళ్తున్నా స్పందన ఉండడం లేదు.  ప్లాంటు మరమ్మతుకు గురైతే నిర్వహణ ఖర్చులు భరించడం ఉపాధ్యాయులకు భారమవుతోంది. జీతాలే సరిగా రాకపోవడం, సొంత నిధులు చెల్లిస్తే బిల్లులు వస్తాయో రావోనన్న భయంతో వాటిని అలానే వదిలేస్తున్నారు.

జిల్లా మొత్తం అదే తీరు:

  • నరసరావుపేటలో మున్సిపల్‌ గర్ల్స్‌ హైస్కూల్‌లో రెండేళ్లుగా ఆర్వోప్లాంటు పనిచేయడం లేదు. 900 మంది విద్యార్థినులకు మునిసిపల్‌ కుళాయి నీరే దిక్కు.
  • వినుకొండలో గిరిజన బాలికల సంక్షేమ గురుకుల పాఠశాలలో ‘నాడు-నేడు’ కింద ప్లాంటు నెలకోసారి మరమ్మతులకు గురవుతోంది. ఇక్కడ 250 మంది విద్యార్థినులున్నారు. హనుమాన్‌నగర్‌లో యూపీ స్కూల్‌లో ప్లాంటులో ఫిల్టర్‌ కావడం లేదు. కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యుత్తు కనెక్షన్‌ సమస్య ఉంది. నడిగడ్డ జడ్పీ పాఠశాలలో ప్లాంట్‌ మరమ్మతులకు గురైంది. 304 మందికి తాగునీరు లేదు.
  • పెదకూరపాడు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల దాతల సహకారంతో రూ.2లక్షలతో ప్లాంటు ఏర్పాటు చేశారు. పదిరోజుల క్రితం మరమ్మతులకు గురైంది. ఫిల్టర్‌కాకుండా తాగునీరు వస్తోంది. గ్రాంటు లేకపోవడంతో ఏం చేయాలో తెలియడం లేదని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ 430 మంది విద్యార్థులు చదువుతున్నారు.
  • యడ్లపాడు మండలం వంకాయలపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో ‘నాడు-నేడు’ తొలివిడతలో ఆర్వో మంజూరైంది. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి పనిచేయడం లేదు. మొత్తం 380 మంది విద్యార్థులు చదువుతున్నారు.
  • అమరావతి మండలం దిడుగు ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో మూడు నెలలుగా ఆర్వో ప్లాంటు పనిచేయడం లేదు. నీటి ప్లాంటు పనిచేయడం లేదని హెచ్‌ఎం యాప్‌లో నమోదు చేసినా స్పందన లేదు. ఇక్కడ 140 మంది చదువుతున్నారు.
  • * ఈపూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, ఇనుమెళ్ల జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలల్లో తొమ్మిది నెలల క్రితం దాతల సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్వోప్లాంట్లకు విద్యుత్తు కనెక్షన్‌ ఇంతవరకూ ఇవ్వలేదు. కొండ్రముట్ల జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, కొచ్చర్ల జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలల్లో ప్లాంట్లు నిర్వహణ లేక మూలనపడ్డాయి.
  • బెల్లంకొండ మండలంలో మొత్తం 16 ఆర్వో ప్లాంట్లు ఉండగా, అందులో 10 ప్లాంట్లు ఎనిమిది నెలలుగా పనిచేయడం లేదు. యాప్‌లో అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందన లేదని హెచ్‌ఎంలు చెబుతున్నారు.
  • మాచర్లలో క్లాక్‌టవర్‌ పాఠశాలలో ఆరు నెలలుగా ప్లాంటు పనిచేయడం లేదు. 250 మంది విద్యార్థులు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  
  • ఆర్వోప్లాంట్లు పనిచేయకపోవడం, విద్యార్థుల తాగునీటి సమస్యను జిల్లా విద్యాశాఖాధికారి శామ్యూల్‌ దృష్టికి తీసుకెళ్లగా అది తమ పరిధిలో లేదని, ఆంధ్రప్రదేశ్‌ ఎడ్యుకేషన్‌ వెల్ఫేర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవెలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ వాళ్లు చూస్తున్నారని చెప్పారు.
  • గురజాల మండలం మాడుగుల గురుకుల  పాఠశాలలో ఆర్వో ప్లాంటు పనిచేయడం లేదు. 406 మంది తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పల్లెగుంత ఆదర్శ పాఠశాలలో నిర్వహణ లేక ఆర్వో ప్లాంటు పనిచేయడం లేదు. 650 మంది విద్యార్థులకు తాగునీరు లేకుండా పోయింది.
  • మాచవరం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు ఆర్వో ప్లాంటు మంజూరై సంవత్సరం అవుతోంది. ఇంతవరకూ పరదా తీయలేదు. వృథానీరు పోవడానికి పైపులు రావాలని ఉపాధ్యాయులు చెబుతున్నారు. 650 మంది విద్యార్థులు స్వచ్ఛమైన తాగునీటికి నోచుకోవడం లేదు. ప్రాథమిక పాఠశాలలో 137 మంది బోరు నీరు   తాగుతున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని