logo

కుంటలో గల్లంతైన ఇద్దరూ మృతి

చిలకలూరిపేట మండలం వేలూరు పరిధిలో పద్మనాభకుంటలో సోమవారం రాత్రి గల్లంతైన ముగ్గురు యువకులు మృతి చెందారు. సోమవారం రాత్రి ఒకరి మృతదేహాన్ని బయటకు తీశారు.

Published : 27 Sep 2023 05:33 IST

నిమజ్జన ఘటనలో మూడుకు చేరిన మృతుల సంఖ్య

ముఖేష్‌, వసంతకుమార్‌, ప్రవీణ్‌రాజ్‌ (పాత చిత్రాలు)

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే : చిలకలూరిపేట మండలం వేలూరు పరిధిలో పద్మనాభకుంటలో సోమవారం రాత్రి గల్లంతైన ముగ్గురు యువకులు మృతి చెందారు. సోమవారం రాత్రి ఒకరి మృతదేహాన్ని బయటకు తీశారు. మంగళవారం ఉదయం ముఖేష్‌ మృతదేహం, మధ్యాహ్నానికి వసంతకుమార్‌ మృతదేహం వెలికి తీశారు. గ్రామీణ ఎస్సై రాజేష్‌ కేసు నమోదు చేశారు.

నాన్న...  ఎప్పుడు వస్తాడు?

మహారాష్ట్రలోని గొండియా జిల్లా ఆదాసి పోస్ట్‌ గ్రామానికి చెందిన ముఖేష్‌ నాలుగు నెలల క్రితం గణపవరంలో స్పిన్నింగ్‌ మిల్లులో పనికి వచ్చాడు. అతనికి ఇద్దరు పాపలు, బాబు ఉన్నారు. బిట్టు (10), తన్వీ (7), నవ్యేష్‌ (3)ను ముఖేష్‌ జాగ్రత్తగా చూసుకునేవాడు. ఇతని భార్య షాలిని గతంలోనే వీరిని వదిలి వెళ్లిపోయింది. ప్రమాదంలో ముఖేష్‌ మృతి విషయం తెలియని చిన్నారులు తండ్రి వచ్చి అల్పాహారం తినిపిస్తాడని ఎదురు చూస్తున్నారు. అనాథలుగా మారిన వారిని చూసి తోటి కార్మికులు కన్నీటి పర్యంతమయ్యారు. కనీసం బంధువులు కూడా లేకపోవడంతో పక్కనున్న మహిళలే వారిని ఓదారుస్తున్నారు. కనిపించిన వారిని పిల్లలు మా నాన్న ఎప్పుడు వస్తాడంటూ అడుగుతున్న తీరు కంట తడిపెట్టించింది.

కుమారుడి మృతితో తండ్రి విలవిల..: శ్రీకాకుళం జిల్లా రూరల్‌ మండలం బమ్మిడివానిపేటకు చెందిన కూన రామారావు, హైమావతి దంపతులకు ఇద్దరు పిల్లలు. పదేళ్ల క్రితం గణపవరం వచ్చి స్పిన్నింగ్‌ మిల్లులో పని చేసుకుంటున్నారు. పాపకు వివాహం చేశారు. కుమారుడు వసంత్‌కుమార్‌ను ఐటీఐ వరకు చదివించాడు. అతను తండ్రితో పాటు అదే కంపెనీలో పని చేసేవాడు. అనుకోకుండా ముఖేష్‌తో కలిసి నిమజ్జనానికి వెళ్లి కుంటలో దిగి మునిగి మృతి చెందాడు. ఒక్కొగానొక్క కుమారుడి మృతితో తల్లిదండ్రులు విలపిస్తున్నారు. ముఖేష్‌తో కలిసి ప్రమాదంలో మృతి చెందిన మరో యువకుడు భాగ్యం ప్రవీణ్‌ తల్లిదండ్రులు పుల్లయ్య, విజయమ్మ. వారికి నలుగురు పిల్లలు. ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. చివరివాడు ప్రవీణ్‌. ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి వచ్చి పదేళ్ల క్రితం వచ్చి పనులు చేసుకంటూ బతుకుతున్నారు. కుమారుడి మృతితో ఆ కుటుంబం కూడా విషాదంలో మునిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని