logo

‘రాష్ట్రం సీఎం జగన్‌ జాగీరు కాదు’

రాష్ట్రం సీఎం వైఎస్‌ జగన్‌ అబ్బ జాగీరా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రశ్నించారు. బాపట్ల తెదేపా కార్యాలయంలో చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా నిరాహారదీక్ష చేసిన పార్టీ నియోజకవర్గ బాధ్యుడు వేగేశన నరేంద్రవర్మను పార్టీ నేతలతో ఆయన మంగళవారం కలిసి మద్దతు, సంఘీభావం తెలిపారు.

Updated : 27 Sep 2023 06:20 IST

దీక్షలో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

బాపట్ల, న్యూస్‌టుడే : రాష్ట్రం సీఎం వైఎస్‌ జగన్‌ అబ్బ జాగీరా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రశ్నించారు. బాపట్ల తెదేపా కార్యాలయంలో చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా నిరాహారదీక్ష చేసిన పార్టీ నియోజకవర్గ బాధ్యుడు వేగేశన నరేంద్రవర్మను పార్టీ నేతలతో ఆయన మంగళవారం కలిసి మద్దతు, సంఘీభావం తెలిపారు. రామకృష్ణ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా ధర్నా, ప్రదర్శనల ద్వారా నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందని చెప్పారు. సమస్యల పరిష్కారానికి ధర్నా చేయటానికి వచ్చిన వామపక్షాలు, జనసేన నేతలు, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశాలు, అగ్రిగోల్డ్‌ బాధితులు, కార్మికులను పోలీసుల ద్వారా నిర్బంధించి అక్రమంగా కేసులు పెట్టి ముందస్తు అరెస్టులు చేయిస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు అరెస్టుపై నిరసన తెలుపుతున్న తెదేపా నేతలు, కార్యకర్తలపై వేలసంఖ్యలో కేసులు పెట్టి గృహ నిర్బంధాలు చేస్తున్నారన్నారు. ధర్నాలు, ఆందోళనలు అంటే సీఎం వైఎస్‌ జగన్‌కు భయం పట్టుకుందన్నారు. ప్రజా ఉద్యమాలను పోలీసులతో వైకాపా ప్రభుత్వం అణిచి వేయిస్తోందని ఆరోపించారు. చంద్రబాబు  అరెస్టు వెనక ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు. ముందస్తు ఎన్నికలకు పోతే జగన్‌ను ప్రజలు ముందుగానే ఇంటికి పంపిస్తారన్నారు. తన బినామీల కంపెనీల్లో తయారు చేయించిన నాసిరకం మద్యాన్ని ప్రజలకు అంటగట్టి ప్రతి మద్యం సీసాపై రూ.వంద చొప్పున రోజూ రూ.కోట్లను తాడేపల్లి ప్యాలెస్‌ ఖజానాలో దాస్తున్నట్లు ఆరోపించారు.  అందరూ కలిసికట్టుగా పోరాటం చేద్దామని ఆయన పిలుపు ఇచ్చారు.

నియంతకు ఓటమి తప్పదు

రాష్ట్రంలో  నియంత పాలన చేస్తున్న సీఎం జగన్‌కు ప్రజాక్షేత్రంలో ఘోర ఓటమి తప్పదని తెదేపా నియోజకవర్గ బాధ్యుడు వేగేశన నరేంద్రవర్మ అన్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ వేగేశన పార్టీ కార్యాలయంలో మంగళవారం నిరాహారదీక్ష చేపట్టారు. ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ అరాచక పాలనతో అన్ని వర్గాలు తీవ్రంగా నష్టపోయాయని, పాలనలో అన్ని విధాలుగా విఫలమైన జగన్‌ ఎన్నికలను ఎదుర్కోలేక చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించి అదే తన ఘనతగా భావించటం మూర్ఖత్వమే అవుతుందన్నారు.  తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాతా జయప్రకాష్‌ నారాయణ మాట్లాడుతూ  ఎన్ని కేసులు పెట్టి వేధించాలని చూసినా తెదేపాను అడ్డుకోలేరన్నారు. దళిత సంఘాల నేతలు శీలం రోజన్‌బాబు, దుడ్డు జాన్‌ ప్రసన్న బాబూరావు దీక్షా శిబిరానికి వచ్చి నరేంద్రవర్మకు మద్దతు తెలిపారు. సీపీఐ రాష్ర కార్యదర్శివర్గ సభ్యుడు జంగాల అజయ్‌కుమార్‌, జిల్లా కార్యదర్శి తన్నీరు  సింగరకొండ, జేబీ శ్రీధర్‌, తెదేపా నేతలు వెంకటేశ్వరరావు, దయాబాబు, వెంకటస్వామి, శివ, శ్రీనివాసరావు, మునీశ్వరరావు, సాంబశివరావు, శంకర్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని