logo

TS News: విమానంలో వెళ్లి.. రైలులో పట్టుకొని

చరవాణులు చోరీ చేసి రైలులో పశ్చిమబెంగాల్‌కు పరారైన ముగ్గురు నిందితులను పట్టుకునేందుకు రాచకొండ పోలీసులు విమానంలో ఎదురెళ్లారు. కదిలే రైలులోనే చోరుల ఆటకట్టించారు. 24

Updated : 06 Jul 2021 06:45 IST

నాగోలు, న్యూస్‌టుడే : చరవాణులు చోరీ చేసి రైలులో పశ్చిమబెంగాల్‌కు పరారైన ముగ్గురు నిందితులను పట్టుకునేందుకు రాచకొండ పోలీసులు విమానంలో ఎదురెళ్లారు. కదిలే రైలులోనే చోరుల ఆటకట్టించారు. 24 గంటల్లోపే సినిమా ఫక్కీలో ఆ ముగ్గురిని అరెస్టుచేసి చోరీ సొత్తంతా స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఎల్బీనగర్‌లోని సీపీ క్యాంపు కార్యాలయంలో రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ వివరాలు వెల్లడించారు. పశ్చిమబెంగాల్‌లోని మాల్దా జిల్లాకు చెందిన మహ్మద్‌ ముస్లిం షేక్‌ అలియాస్‌ తస్లీమ్‌(23), మహ్మద్‌ జసీముద్దీన్‌ షేక్‌ అలియాస్‌ యూసుఫ్‌(19), రఫీఖ్‌ ఉల్‌ షేక్‌(19)లు రెండు నెలల క్రితం నగరంలోని బైరామల్‌గూడ వద్ద పైవంతెన నిర్మాణంలో కూలీలుగా పనికి కుదిరారు. అక్కడే గుడిసెల్లో ఉంటూ మద్యానికి అలవాటు పడ్డారు. జూన్‌ 30న అర్ధరాత్రి ఎల్బీనగర్‌ చౌరస్తాలోని ఓ మొబైల్‌ దుకాణం గోడకు తమ వద్దనున్న పనిముట్లతో రంధ్రం చేసి రూ.3 లక్షల విలువైన 26 సెల్‌ఫోన్లు మూటగట్టుకుని పరారయ్యారు. యజమాని ఫిర్యాదు చేయడంతో ఎల్బీనగర్‌ పోలీసులు సీసీఎస్‌, ఐటీసెల్‌ సిబ్బంది.. సీసీ ఫుటేజీలను పరిశీలించి సమీపంలోని గుడిసెల్లో పనిచేసే వారిని అనుమానించారు. ఆ ముగ్గురి గురించి ఆరా తీయగా విజయవాడ నుంచి పశ్చిమబెంగాల్‌కు వెళ్తున్న ఓ రైలులో వారు వెళ్తున్నట్లు గమనించి పోలీసులు ఓ బృందంగా విమానంలో వెళ్లి పశ్చిమబెంగాల్‌కు చేరుకున్నారు. వారి రైలు ఖరగ్‌పూర్‌ స్టేషన్‌కు చేరుకునేలోపే బృందంలోని పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఖరగ్‌పూర్‌ జీఆర్‌పీ ఎస్‌పీ పుష్ప సాయంతో స్థానిక పోలీసులు ప్లాట్‌ఫామ్‌పై ఓ నిందితుని అరెస్టుచేయగా.. మిగతా నిందితులు నడుస్తున్న రైలెక్కి పారిపోతుండగా వెంటాడి పట్టుకున్నారు. నగరానికి తీసుకొచ్చి కోర్టుముందు ప్రవేశపెట్టారు. నిందితులను పట్టుకోవడంలో కృషిచేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని సీపీ అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని