logo

TS News: సీఐపై ఎస్సైకి కోపం

ఇన్‌స్పెక్టర్‌పై కోపంతో అదే స్టేషన్‌లో పనిచేసే ఓ ఎస్సై చేసిన పని ఇప్పుడు పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సదరు ఇన్‌స్పెక్టర్‌ ప్రతిష్ఠకు భంగం కలిగించాలనే

Updated : 08 Jul 2021 07:12 IST

మహిళా కానిస్టేబుళ్ల పేరిట లేఖ విడుదల
సామాజిక మాధ్యమాల్లో రచ్చ.. రచ్చ...

ఈనాడు, హైదరాబాద్‌: ఇన్‌స్పెక్టర్‌పై కోపంతో అదే స్టేషన్‌లో పనిచేసే ఓ ఎస్సై చేసిన పని ఇప్పుడు పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సదరు ఇన్‌స్పెక్టర్‌ ప్రతిష్ఠకు భంగం కలిగించాలనే తలంపుతో సామాజిక మాధ్యమాల్లో లేఖాస్త్రం ప్రయోగించాడు. చివరకు ఉన్నతాధికారులకు దొరికిపోయిన ఈ ఘటన సైబరాబాద్‌లో పరిధిలో చోటు చేసుకుంది.

అసలేం జరిగింది .. సైబరాబాద్‌ పరిధిలోని ఓ ఠాణాలో పనిచేసే మహిళా కానిస్టేబుళ్లు రాసినట్లు పేర్కొంటున్న ఓ లేఖ గత గురువారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇన్‌స్పెక్టర్‌ (ఎస్‌హెచ్‌వో) తమతో అసభ్యకరంగా ప్రవరిస్తున్నారంటూ లేఖలో వాపోయారు. తాము బట్టలు మార్చుకునే గదిలోకి వస్తున్నట్లు ఆరోపించారు. సూటిపోటి మాటలతో తమను వేధిస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. స్టేషన్‌కొచ్చే సందర్శకులు, బాధితులనూ అసభ్య పదజాలంతో దూషిస్తుంటాడని పేర్కొన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఠాణాలో జెండాను ఆవిష్కరించేందుకు కూడా రాలేదని అందులో ఉంది. ఎప్పుడూ మద్యం మత్తులోనే ఉంటాడని, భారీగా సివిల్‌ సెటిల్‌మెంట్లు చేస్తున్నట్లు లేఖలో వివరించారు.

ఎలా బయటపడిందంటే... ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ అప్రమత్తమై విచారణకు ఆదేశించారు. ముందు అది అసలుదా.. నకిలీదా..? అంటూ ఆరా తీశారు. అసలుదేనని తేలడంతో ఎవరు రాశారు..? అంటూ కూపీ లాగేందుకు రంగంలోకి దిగారు. ఆ లేఖతో తమకెలాంటి సంబంధం లేదని ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్న మహిళా కానిస్టేబుళ్లు తేల్చి చెప్పారు. గతంలో ఇక్కడ పనిచేసి బదిలీపై వెళ్లిన వారిని కూడా ప్రశ్నించారు. వారి నుంచీ అదే సమాధానం వచ్చింది. దీంతో సదరు సీఐ వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించాలనే ఉద్దేశంతోనే ఈ పని చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ కోణంలో ఆరా తీయగా ఇదంతా అదే ఠాణాలో పనిచేసే ఓ ఎస్సై పని అని తేలడంతో కంగుతిన్నారు. సీ.ఐ.పై కోపంతోనే ఈ లేఖ రాసినట్లు తేల్చారు. తాత్కాలికంగా ఎస్సైను అక్కడి నుంచి హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేశారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని సంబంధిత ఉన్నతాధికారులు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని