logo

ముగ్గురూ దొంగలే.. పగతో మిత్రుడ్ని చంపేశారు

ముగ్గురు దొంగల మధ్య విభేదాలు ఒక మిత్రుడి హత్యకు కారణమైంది. ఇది మల్కాజిగిరి పోలీసుస్టేషన్‌ పరిధిలోని మౌలాలి రైల్వేస్టేషన్‌ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. సీఐ జగదీశ్వరరావు, ఎస్సై హరిప్రసాద్‌ కథనం ప్రకారం.. అభిలాష్‌, భరత్‌, రమేష్‌కుమార్‌ స్నేహితులు.

Updated : 15 Jul 2021 08:53 IST

నిందితుడు భరత్‌

మల్కాజిగిరి, న్యూస్‌టుడే: ముగ్గురు దొంగల మధ్య విభేదాలు ఒక మిత్రుడి హత్యకు కారణమైంది. ఇది మల్కాజిగిరి పోలీసుస్టేషన్‌ పరిధిలోని మౌలాలి రైల్వేస్టేషన్‌ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. సీఐ జగదీశ్వరరావు, ఎస్సై హరిప్రసాద్‌ కథనం ప్రకారం.. అభిలాష్‌, భరత్‌, రమేష్‌కుమార్‌ స్నేహితులు. కుషాయిగూడ పోలీసుస్టేషన్‌ పరిధిలోని మౌలాలి వెంకటేశ్వరనగర్‌లో నివసించే లింగంపల్లి అభిలాష్‌ అలియాస్‌ సోను (21) లేబర్‌ పనులు చేస్తూ ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తాడు. హుమాయూన్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ద్విచక్ర వాహన చోరీ కేసులో నిందితుడు. విజయ్‌నగర్‌ కాలనీలో నివసించే చక్కెరోళ్ల భరత్‌ అలియాస్‌ గుండు (21), లంగర్‌హౌజ్‌లో నివసించే రమేష్‌కుమార్‌ అలియాస్‌ రమ్మి (25)లపై కూడా ద్విచక్ర వాహనాల కేసులున్నాయి.

పథకం ప్రకారమే.. ఈ ముగ్గురు స్నేహితులు చోరీ చేసిన వాహనాలను విక్రయించి జల్సాలు చేసేవారు. గతంలో వీరి మధ్య మనస్పర్థలు రావడంతో అభిలాష్‌ స్నేహితులను కొట్టాడు. దాన్ని మనసులో పెట్టుకున్న ఆ ఇద్దరు అతనిపై పగ తీర్చుకోవాలనుకున్నారు. ఈనెల 6న రమేష్‌కుమార్‌, భరత్‌.. మౌలాలి డీజిల్‌ షెడ్‌ వద్దకు మద్యం సీసాలతో వచ్చి పార్టీ చేసుకుందామంటూ అభిలాష్‌ను ఆహ్వానించారు. ముగ్గురు కలిసి పీకల దాకా తాగారు. మత్తులో అభిలాష్‌ మళ్లీ వారిని దూషించడంతో అదే అదనుగా భావించిన భరత్‌ మద్యం సీసాను పగులకొట్టి అభిలాష్‌ను పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తరువాత వారిద్దరు వాహనాలపై పారిపోయారు.

వెలుగులోకి వచ్చిందిలా.. ద్విచక్ర వాహనంపై వెళ్లిన తన కుమారుడు కన్పించటం లేదంటూ అభిలాష్‌ తండ్రి ఈనెల 11న కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీజిల్‌ షెడ్‌ సమీపంలో హత్య విషయం వెలుగులోకి రావడంతో ఆ ఫొటోను చూపించగా అభిలాష్‌ తల్లి, బంధువులు గుర్తించారు. పోలీసులు అభిలాష్‌ ఫోన్‌ కాల్స్‌ వివరాలను పరిశీలించి భరత్‌ను అదుపులోకి తీసుకున్నారు. రమేష్‌కుమార్‌ పరారీలో ఉన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని