logo

TS News: 3 ఏళ్లు..3 సార్లు..రూ.3300 కోట్లు

భూముల విక్రయం హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ)కు కాసుల వర్షం కురిపిస్తోంది. సంస్థ ఖజానాను నింపుతోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మూడేళ్లల్లో

Updated : 17 Jul 2021 06:57 IST

హెచ్‌ఎండీఏకు కాసుల వర్షం కురిపిస్తున్న భూములు

కోకాపేట లేఅవుట్‌లోని స్థలం

ఈనాడు, హైదరాబాద్‌: భూముల విక్రయం హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ)కు కాసుల వర్షం కురిపిస్తోంది. సంస్థ ఖజానాను నింపుతోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మూడేళ్లల్లో మూడుసార్లు ఈ-వేలం నిర్వహించగా..రూ.3,300 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. అప్పుడు కోకాపేట్‌లో 163 ఎకరాలను విక్రయిస్తే రూ.1753 కోట్లు రాగా..ఇప్పుడు 49.94 ఎకరాలకే రూ.2వేలకోట్లకుపైగా రావడం గమనార్హం.

తొలిసారి రూ.300 కోట్లు...

విశ్వనగరమే లక్ష్యంగా హెచ్‌ఎండీఏ పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రణాళికలు రూపొందించింది. ఇందుకు సొంతంగానే నిధులు సమకూర్చుకోవాలని భావించింది. దీంతో అప్పట్లో హెచ్‌ఎండీఏ నగరంలోని వివిధ ప్రాంతాల్లో కొన్ని లేఅవుట్లను అభివృద్ధి చేసి విక్రయించింది. వీటిలో కొన్ని ప్లాట్లు అమ్ముడుకాక మిగిలిపోయాయి. క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి 210 ప్లాట్లను గుర్తించారు. 2018 ఏప్రిల్‌లో ఈ-వేలం నిర్వహించగా భారీ స్పందన వచ్చింది. రూ.350 కోట్లకు 189 ప్లాట్లు అమ్ముడుపోయాయి. కొందరు డబ్బులు చెల్లించేందుకు ముందుకు రాలేదు. ఫలితంగా రూ.350 కోట్లకు గాను రూ.300 కోట్లు ఖజానాకు చేరింది. ల్యాండ్‌ పూలింగ్‌ కింద హెచ్‌ఎండీఏ అప్పట్లో ఉప్పల్‌ భగాయత్‌లో 400 ఎకరాల్లో ఫేజ్‌-1 కింద భారీ లేఅవుట్‌ను అభివృద్ధి చేసింది.మరో 70 ఎకరాల్లో ఫేజ్‌-2 లేఅవుట్‌ను అభివృద్ధి చేశారు. రెండు దశల్లో నిర్వహించిన ఈ-వేలం ద్వారా హెచ్‌ఎండీఏకు రూ.1,050 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది.


అప్పుడు.. ఇప్పుడు..

కోకాపేట్‌లో మొత్తం 719 ఎకరాలను ప్రభుత్వం హెచ్‌ఎండీఏకు అప్పగించింది. ‘గోల్డ్‌ మైల్‌’ పేరిట లేఅవుట్‌ను అభివృద్ధి చేసి 163ఎకరాలను 2006లో విక్రయించింది. అప్పుడు రూ.1,753 కోట్ల ఆదాయం సమకూరింది. వివిధ సంస్థలు, మౌలిక సదుపాయాల కేటాయింపులకు పోనూ మిగిలిన 110 ఎకరాల్లో ‘నియో పొలిస్‌’ పేరిట మరో లేఅవుట్‌ను అభివృద్ధి చేసింది. గురువారం 49.94 ఎకరాలకు ఈ-వేలం నిర్వహించగా రూ.2వేల కోట్లకుపైగా ఆదాయం సమకూరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని