TS News: కట్టని బీమాకు నోట్ల కట్టలు ఇప్పిస్తా
రూ.కోట్లలో టోకరా వేసిన రాహుల్‌సింగ్ అరెస్టు
ఈనాడు, హైదరాబాద్: ప్రీమియంలు చెల్లించకుండా వదిలేసిన జీవిత బీమా పాలసీలకు రూ.కోట్లలో డబ్బులొస్తాయంటూ మోసాలకు పాల్పడుతున్న రాహుల్‌సింగ్ చందేల్‌ను సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాతబస్తీలోని కేశవ్బాగ్కు చెందిన వ్యాపారి రాజ్‌కుమార్ జైన్(73) నుంచి ఐదేళ్లలో రూ.కోటి కొల్లగొట్టాడు. హైదరాబాద్‌లో వ్యాపారాలు నిర్వహిస్తున్న రాజ్‌కుమార్ జైన్ ఆరేళ్ల కిందట గువహటికి వెళ్లారు. అక్కడే వ్యాపారం చేస్తున్నారు. ఐదేళ్ల క్రితం దిల్లీకి చెందిన కేపీ అహుజా పేరుతో రాహుల్‌సింగ్ ఆయనకు ఫోన్ చేశాడు. తాను ఓ జీవిత బీమా కంపెనీలో ఉన్నతోద్యోగినని నెలకు రూ.లక్ష చొప్పున మూడేళ్లు చెల్లిస్తే.. ఐదేళ్లలో రూ.80 లక్షలతో పాటు ప్రముఖ కంపెనీకి చెందిన 200 షేర్లు ఉచితంగా ఇస్తానని చెప్పాడు. జైన్.. వేర్వేరు సందర్భాల్లో అతనికి రూ.25 లక్షలు బదిలీ చేశారు. రసీదులను భద్రపరుచుకున్నాడు. జులై 2016 వరకు ప్రీమియంలు చెల్లించి నిలిపివేశారు. వ్యాపార పనుల్లో పడి పాలసీ సంగతి మర్చిపోయారు. మూడేళ్ల క్రితం అజయ్ అగర్వాల్ పేరుతో మళ్లీ రాహుల్ ఫోన్ చేశాడు. 18 నెలలు రూ.లక్ష చొప్పున ప్రీమియం చెల్లిస్తే రూ.5 కోట్లు వస్తుందన్నాడు పాలసీల పునరుద్ధరణకు మూడు నెలల్లో రూ.17.50 లక్షలు చెల్లించాలని సూచించాడు. జైన్ ఆ నగదు బదిలీ చేశారు. దశలవారీగా రాహుల్ అతడి స్నేహితులు మూడేళ్లలో జైన్ నుంచి రూ.75 లక్షలు బదిలీ చేయించుకున్నారు. ఇంకా చెల్లించాలంటూ బెదిరించడంతో వ్యాపారి పోలీసులను ఆశ్రయించారు. సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కృష్ణ బృందం ఘజియాబాద్ వెళ్లి రాహుల్‌ను అరెస్ట్ చేసింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.