పది అతిక్రమణలుంటే కేసు.. ఉల్లంఘనులు, ప్రమాదాల కట్టడికి పోలీసుల నిర్ణయం
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి
* ఖైరతాబాద్కు చెందిన ఓ వాహనదారుడు బైకుపై ముగ్గురిని ఎక్కించుకొని చరవాణిలో మాట్లాడుతూ నడుపుతున్నాడు. వెనక కూర్చున్న వ్యక్తి నంబరు ప్లేట్ కనిపించకుండా బూట్లు అడ్డుపెట్టాడు. ఇది సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కంటపడింది. వాహనదారులు గమ్యస్థానం చేరేలోపు నంబరు గుర్తించారు. వివిధ ఉల్లంఘనల కింద రూ.3200 జరిమానా విధించారు. చెల్లించాల్సిందేనని ఆదేశించారు.
మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఏటా 90 లక్షల ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదవుతున్నాయి. జరిమానాల రూపంలో రూ.100 కోట్లు వసూలవుతోంది. గ్రేటర్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 1400 మంది చనిపోతున్నారు. నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించి వాహనాలు నడపడమే ప్రధాన కారణమని పోలీసులు గుర్తించారు. చలానాలు రాస్తున్నా మార్పు రాకపోవడంతో అయిదారు చలానాలున్న వాహనదారుల ఇళ్లకు నోటీసులు పంపించనున్నారు. 15 రోజుల్లో స్పందించకపోతే వాహనాన్ని స్వాధీనం చేసుకోనున్నారు. ఏడాదిలో పదిసార్లు వాహన నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కన్నేసి ఉంచాలని నిర్ణయించారు. పదేపదే ఉల్లంఘిస్తే వ్యక్తి గతంగా కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చాలని నిర్ణయించారు.