Jamtara Gang: సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు తెలియని విషయాలూ వీరికి తెలుసు

చేతిలో స్మార్ట్‌ఫోన్‌.. హైస్కూల్‌ దాటని చదువు...  నలుగురైదుగురు కలిసి చాయ్‌ దుకాణం.. చెట్ల కింద ముచ్చట్లు..  ఝార్ఖండ్‌ రాష్ట్రంలోని జాంతారా తాలూకా

Updated : 30 Aug 2021 07:26 IST

బాధితుల సొమ్ముతో విందులు.. వినోదాలు
జాంతారా నేరస్థుల జీవనశైలి..

ఈనాడు, హైదరాబాద్‌: చేతిలో స్మార్ట్‌ఫోన్‌.. హైస్కూల్‌ దాటని చదువు...  నలుగురైదుగురు కలిసి చాయ్‌ దుకాణం.. చెట్ల కింద ముచ్చట్లు..  ఝార్ఖండ్‌ రాష్ట్రంలోని జాంతారా తాలూకా తారట్‌, ధన్‌బాద్‌, దేవ్‌గడ్‌ గ్రామాల్లో కనిపించే దృశ్యాలివి.. చూడగానే అమాయకుల్లా కనిపించే వీరు 14 రాష్ట్రాల్లో సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు. ఝార్ఖండ్‌, పశ్చిమబంగా రాష్ట్రాల్లోని హిందీ యాసతో మాట్లాడుతున్న వీరు నిజానికి అసాధ్యులు... సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు తెలియని విషయాలూ వీరికి తెలుసు.. నిమిషాల వ్యవధిలో ఈ-వ్యాలెట్ల ద్వారా నగదు బదిలీ చేయడం మంచినీళ్లు తాగినంత సులువు.. జాంతారా తాలూకాల్లోని ఐదు గ్రామాల్లో నివసిస్తున్న యువకులంతా కలిసి 200 నుంచి 250 ముఠాలుగా ఏర్పడ్డారు. ఆరేడు ఏళ్ల నుంచి డెబిట్‌కార్టు, క్రెడిట్‌కార్టుల మోసాలతో నేరాల బాట పట్టారు.. కొద్దిరోజుల క్రితం అక్కడికి వెళ్లిన ఇన్‌స్పెక్టర్‌ ప్రశాంత్‌ బృందం వారిలో ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసి ఇక్కడి తీసుకువచ్చింది. 

పొరుగు రాష్ట్రం నుంచి సిమ్‌కార్టులు... 

పోలీసులు సిమ్‌కార్డుల ద్వారా తమను గుర్తిస్తున్నారని తెలుసుకున్న జాంతారా సైబర్‌ నేరస్థులు పంథా మార్చేశారు. సిమ్‌కార్డులు కొనేందుకు కోల్‌కతాకు వెళ్తున్నారు. లల్లా, కసాబా, ప్రాంతాలకు వెళ్లి వందల సంఖ్యలో సిమ్‌కార్డులు తీసుకువస్తున్నారు. తప్పుడు పేర్లతో నకిలీ ఆధార్‌కార్డులు  సృష్టించడం, ఫొటోలు  అప్పటికప్పుడు లేవంటూ చెప్పడంతో సిమ్‌కార్డులు అమ్ముతున్న వారు వీరికి అడిగినన్ని సిమ్‌లను ఇచ్చేస్తున్నారు. వాటితో బ్యాంక్‌ అధికారులు, పేటీఎం, ఫోన్‌పే ప్రతినిధులమంటూ ఫోన్లు చేస్తున్నారు. బాధితుల నుంచి నగదు బదిలీ చేసుకోగానే ఆ సిమ్‌కార్డులను పంటకాల్వలు, మురుగు కాల్వల్లో పారేస్తున్నారు. 


నిరుపేదలమంటూ నమ్మబలుకుతూ.. 

ఈ-వ్యాలెట్ల ద్వారా దోచుకున్న నగదుతో జాంతారా  సైబర్‌ నేరస్థులు విందులు, వినోదాలు చేసుకుంటున్నారు. పోలీసులు అరెస్ట్‌ చేసినా డబ్బులు స్వాధీనం చేసుకోని విధంగా జాగ్రత్త పడుతున్నారు. తాము నిరుపేదలమని,  అప్పు తీసుకున్నామంటూ పత్రాలు చూపిస్తున్నారు. వారు దొంగలు కాదు.. నిజంగా కష్టపడేవారేనంటూ స్థానికులు సైతం పోలీసులకు సాక్ష్యం చెబుతున్నారు. దీంతో వీరిని అరెస్ట్‌ చేసేందుకు వెళ్లిన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు పోలీసులు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. ఇటీవలే ఆ రాష్ట్రపోలీస్‌ ఉన్నతాధికారులు సహకారం అందిస్తున్నారు. ఇతర రాష్ట్రాల పోలీసులకు దర్యాప్తులో సహకరించాలంటూ జాంతారా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని