TSRTC: అధిక ధరలు.. నకిలీలపై ఆర్టీ‘సీ’!
సంస్థ ఎండీకి ప్రయాణికుడు చేసిన ఫిర్యాదు
ఈనాడు, హైదరాబాద్: ప్రయాణికులు ఇక ఊపిరి పీల్చుకోవచ్చు. ఎందుకంటే ఆర్టీసీ బస్టేషన్లలో అధిక ధరలపై ఎట్టకేలకు ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు. తనిఖీలు చేయడమనేది పక్కన పెడితే ఫిర్యాదు చేసినా అంతగా పట్టించుకోని అధికారులు ఇటీవల ఏకంగా కేసు నమోదు చేసేశారు. రూ.వెయ్యి జరిమానా కూడా విధించారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఆ వంకన దుకాణదారుడి దగ్గరకు వెళ్లి బెదిరించడం తప్ప జరిమానాలు వేయడం ఎరగని అధికారులు.. ఎండీ సజ్జనార్ ఆదేశాలతో కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఓ ఫిర్యాదు అందగానే నేరుగా ఎంజీబీఎస్‌లో ఓ దుకాణానికి వెళ్లి రూ.వెయ్యి రసీదు చేతిలో పెట్టి హెచ్చరించడంతో దుకాణదారులు కంగు తింటున్నారు. అయితే నకిలీ వస్తువుల అమ్మకాలపైనా దృష్టి పెట్టాలని కోరుతున్నారు. తాగునీటి నుంచి బిస్కట్ల వరకూ కవర్ అలాగే ఉండేలా అక్షరాలు అమర్చి అమ్మేస్తున్న వైనంపై కూడా దృష్టి పెట్టాల్సి ఉంది.
అన్నిచోట్ల దోపిడీ..
ఒక్క ఎంజీబీఎస్‌లోనే కాదు.. దిల్సుఖ్నగర్ బస్టేషన్లలోనూ తాగునీటి సీసా రూ.5 ఎక్కువ తీసుకున్నందుకు ఓ ప్రయాణికుడు ఏకంగా ఆర్టీసీ ఎండీకి ట్వీట్ చేశారు. దీంతో యంత్రాంగం కదిలింది. రాష్ట్రవ్యాప్తంగా దాడులు మొదలయ్యాయి.
అదే వారికి వరం..
ఎంజీబీఎస్, జేబీఎస్‌లలో జరిమానాలు విధించడం సాధారణమేనని దుకాణదారులు భావిస్తున్నారు. అయితే ఒక దుకాణానికి 3 జరిమానాలు విధించిన తర్వాత నోటీసులు జారీ చేస్తారు. 1, 2 నోటీసుల వరకూ దుకాణదారులను తప్పించే అధికారాలు ఉండకపోవడం కూడా వారికి వరంలా మారింది. ముద్రిత ధరలకంటే ఎక్కువ అమ్మినట్టు రుజువైతే ఒక్కసారికే దుకాణ ఒప్పందాన్ని రద్దు చేస్తే నకిలీలకు, అధిక ధరలకు కళ్లెం వేయడానికి వీలుంటుందని ఆర్టీసీ అధికారి చెప్పారు. ఆ దిశగా కూడా ఆలోచిస్తున్నారు. మరుగుదొడ్ల నిర్వాహకుల దోపిడీ కూడా ఇలాగే ఉందని ఫిర్యాదులందుతున్నాయి. ప్రయాణికుల ఫిర్యాదులే కాకుండా.. తాము సాధారణ ప్రయాణికుల్లా వెళ్లి పరిశీలిస్తామని రంగారెడ్డి ఆర్ఎం వరప్రసాద్ చెప్పారు. ముద్రిత బిల్లుల వ్యవస్థను తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
మాకు ఫిర్యాదు చేయండి
ఎంజీబీఎస్‌లో ఫోను నంబర్లు
ఆర్టీసీ బస్టాండ్లలో అధిక ధరలకు తినుబండారాలను విక్రయిస్తే ఇక నేరుగా బస్ స్టేషన్ మేనేజర్, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. ఈ మేరకు ఎంజీబీఎస్ ప్రాంగణంలో 28 చోట్ల బ్యానర్లు, గోడ పత్రికలను ఏర్పాటు చేసి అధిక ధరకు అమ్మితే తమకు ఫిర్యాదు చేయాలని స్టేషన్ మేనేజర్ 9959224911, అసిస్టెంట్ మేనేజర్ 9959224910, కస్టమర్ రిలేషన్స్ మేనేజర్ 9959226245 ఫోను నంబర్లను అందుబాటులోకి తెచ్చారు. మరుగుదొడ్ల వద్ద కూడా అధిక ధరలు వసూలు చేస్తే ఫిర్యాదు చేయడానికి నంబర్లను ఉంచారు. ఎవరైనా అక్కడ పేర్కొన్న ధరల కంటే ఎక్కువ వసూలు చేస్తే ప్రయాణికులు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదు అందిన వెంటనే వారిపై చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.