Crime News: కమీషన్ ఇవ్వలేదని జూబ్లీహిల్స్‌లో వ్యక్తిపై దాడి.. పరిస్థితి విషమం
దాడిలో గాయపడిన రవీందర్‌రెడ్డి
జూబ్లీహిల్స్, న్యూస్‌టుడే: స్థిరాస్తి విక్రయానికి సంబంధించి రావాల్సిన కమీషన్ డబ్బుల కోసం వరుసకు మామయ్యే వ్యక్తిపై కత్తితో దాడి చేసిన ఘటన జూబ్లీహిల్స్ ఠాణా పరిధిలో బుధవారం జరిగింది. జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 78లోని ఒయాసిస్ అపార్టుమెంట్లో మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ రవీందర్‌రెడ్డి(44) ఉంటున్నారు. కోయిలకొండ మండలం సంగనోనిపల్లి ఈయన స్వస్థలం. రెండేళ్ల కిందట బేగంపేట ప్రాంతంలో దాదాపు 600 గజాల స్థలాన్ని కొన్నారు. నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం గోటూరుకు చెందిన, ప్రస్తుతం యూసుఫ్‌గూడ జవహర్‌నగర్‌లో ఉంటున్న గౌని మోహన్‌రెడ్డి(42) మధ్యవర్తి. ఈయన రవీందర్‌రెడ్డికి వరుసకు అల్లుడే. 2 నెలల కిందటే మోహన్‌రెడ్డికి తెలియకుండా రవీందర్‌రెడ్డి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. కమీషన్‌గా రూ.6 లక్షలు మోహన్‌రెడ్డికి ఇవ్వాలి. కానీ ఇవ్వలేదు. దీంతో మోహన్‌రెడ్డి ఓ కత్తిని కొని బుధవారం ఉదయం 7.15కు రవీందర్‌రెడ్డి అపార్టుమెంట్‌కు వెళ్లి అతను బయటకు రాగానే దాడి చేసి జూబ్లీహిల్స్ ఠాణాలో లొంగిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న రవీందర్‌రెడ్డిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. రవీందర్‌రెడ్డిపై గతంలోనూ 3 కేసులున్నట్లు గుర్తించారు. ఈ ఇద్దరి మధ్య భూముల విషయంలో పాతకక్షలు కూడా ఉన్నాయని తెలిసింది. ఈ నేపథ్యంలోనే తన అన్నయ్యపై దాడి చేశారని రవీందర్‌రెడ్డి తమ్ముడు సురేందర్‌రెడ్డి చెబుతున్నారు.
ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు/ సేవల గురించి ఈనాడు సంస్థకి ఎటువంటి అవగాహనా ఉండదు. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి, జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు.