Cyber Crime: రూ.లక్షలు పెట్టండి.. రూ.కోట్లు పొందండి!
పాతబస్తీ వ్యాపారికి రూ.36.05 లక్షలు టోకరా
ఈనాడు, హైదరాబాద్: సైబర్ నేరస్థులు పంథా మార్చారు. దిల్లీ కేంద్రంగా డిజిటల్ మోసాలు, పెట్టుబడి నేరాలు చేస్తున్న సైబర్ నేరస్థులు విదేశీ మార్కెట్ల పేరుతో మోసాలు చేసేందుకు పక్కా ప్రణాళికను రచించారు. సెల్‌ఫోన్ నెట్వర్క్ కంపెనీల పొరుగుసేవల విభాగాల నుంచి మెట్రో నగర వాసుల ఫోన్ నంబర్లను గంపగుత్తగా కొంటున్నారు. ఎఫ్‌క్యూ మార్కెట్స్ లిమిటెడ్, యాక్సన్, మాల్ 008 యాప్‌ల పేర్లతో వాట్సాప్ నంబర్లకు లింకులు పంపుతున్నారు. వాటికి క్లిక్ చేయగానే బాధితులతో ఛాటింగ్ ప్రారంభించి డీమ్యాట్ తరహాలో డిజిటల్ ఖాతా ఇచ్చి మోసం చేస్తున్నారు.
లింకు పంపి.. లాభాలు చూపి.. పాతబస్తీలోని మీర్‌చౌక్‌కు చెందిన వ్యాపారి చరవాణికి ఎఫ్‌క్యూ మార్కెట్స్ పేరుతో లింక్ వచ్చింది. తమ మార్కెట్లో మదుపు చేస్తే రూ.లక్షకు రోజుకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకూ లాభం వస్తుందని ఆ లింక్‌లో ఉంది. షేర్‌మార్కెట్ పెట్టుబడులపై అవగాహన ఉన్న ఆ వ్యాపారి క్లిక్ చేసి తన వివరాలను పంపించారు. వెంటనే స్పందించిన సైబర్ నేరస్థుడు ఆయన పేరుమీద డిజిటల్ ఖాతా ప్రారంభించి తొలుత రూ.1.50 లక్షలు మదుపు చేయమని కోరగా... వ్యాపారి అలాగే చేశారు. రెండు రోజుల తర్వాత మీకు రూ.15 వేల లాభం వచ్చిందంటూ తీసుకోండి అన్నాడు. డిజిటల్ ఖాతాలో ఆ మొత్తాన్ని చూసిన వ్యాపారి రూ.లక్షల్లో మదుపు చేస్తూ వెళ్లారు. రూ.36.05 లక్షలు నగదు బదిలీ చేశాక... ఆయన ఖాతాలో రూ.5 కోట్ల మొత్తం కనిపించింది. నాలుగు రోజుల క్రితం రూ.2 కోట్లు తీసుకొనేందుకు యత్నించగా.. యాప్ పనిచేయలేదు. బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.