TS News: ప్రగతి భవన్‌లో నాలుగు స్తంభాలాట ప్రారంభమైంది: బండి సంజయ్‌

సీఎం కేసీఆర్‌ దిల్లీ ఎందుకు వెళ్లారో అర్థం కాలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకే వెళ్లినట్లు ఆయన ఆరోపించారు.

Updated : 27 Nov 2021 12:53 IST

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ దిల్లీ ఎందుకు వెళ్లారో అర్థం కాలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకే వెళ్లినట్లు ఆయన ఆరోపించారు. సొంత పనుల కోసమే దిల్లీ వెళ్లారని.. భాజపాను అప్రతిష్ఠ పాలు చేసే కుట్రలు పన్నారని ఆయన విమర్శించారు. నగరంలో రెండో రోజు భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా బండి సంజయ్‌ పార్టీ జెండా ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా భాజపా వ్యవహారాల సంస్థాగత ఇన్‌ఛార్జి శివప్రకాశ్‌ హాజరయ్యారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఈటల, డీకే అరుణ, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ను కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ సన్మానించారు.

అనంతరం బండి సంజయ్‌ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయి. రక్తం ధార పోసేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి. ప్రగతిభవన్‌లో నాలుగు స్తంభాలాట ప్రారంభమైంది. తమను సీఎంను చేయాలని కుమారుడు, బిడ్డ, అల్లుడు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించే గొంతుకలను పార్టీ నుంచి బయటకు పంపిస్తున్నారు.

సీఎం పోకడలతో అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో విద్యావ్యవస్థ మొత్తం దెబ్బతింది. ఎంబీసీ పేరుతో బీసీ కులాల మధ్య కేసీఆర్‌ చిచ్చు పెట్టారు. ప్రజల ఆశీర్వాదంతో 2023లో భాజపా అధికారంలోకి వస్తుంది. డిసెంబరు 17నుంచి రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం అవుతుంది’’ అని అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని