logo
Published : 28/11/2021 03:52 IST

ఆ సంతకం ఎవరిది..!

రెవెన్యూలో పెరిగిపోతున్న ఫోర్జరీ

విచారణ చేపట్టని అధికారులు

ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌

మారు సంతకాలతో అమ్మకానికి యత్నించిన వేణుగోపాలస్వామి దేవాలయ భూములు

* వికారాబాద్‌ మండలం బూర్గుపల్లిలో 7 ఎకరాల భూమికి సంబంధించి అక్రమ రిజిస్ట్రేషన్‌ (ఫోర్జరీ) జరిగింది. ఈ వ్యవహారంలో కంప్యూటర్‌ ఆపరేటర్లను అరెస్టు చేయడంలో పోలీసులు ఎంతో ఉత్సాహం చూపారు. తదుపరి విచారణపై మాత్రం దృష్టి సారించడం లేదు. దీని వెనుక రాజకీయ నేతల హస్తం ఉండటంతోనే ఇలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. భూమిని అమ్మిన వ్యక్తి, కొనుగోలు చేసిన వ్యక్తి, మధ్యవర్తిత్వం చేసినవారు, చేతుల మారిన నగదు...ఇలా వివిధ కోణాల్లో విచారణ చేపట్టాల్సి ఉన్నా ఈ ప్రక్రియ అడుగు ముందుకు పడలేదు.  


* పరిగి పట్టణానికి చెందిన వేణుగోపాల స్వామి దేవాలయం తాలూకు 14 ఎకరాల భూములు పూడూరు మండలం చన్‌గోముల్‌లో ఉన్నాయి. వీటిపై కొందరు కన్నేశారు. నకిలీ సంతకంతో కాజేయాలని చూశారు. వారిపై నేటికీ ఎలాంటి చర్యలు కనిపించడం లేదు. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆరోపించారు. ఫోర్జరీ పత్రాలు చెల్లవని ఉన్నతాధికారులు ఈ భూముల ఒప్పందాన్ని రద్దు చేశారు. అక్కడితో కథ ముగిసినట్లైంది. విచారణకు ఆదేశించి చర్యలు తీసుకోవడంపై ధికారులు దృష్టిసారించలేదు.


* ఇటీవల పూడూరు మండలం చీలాపూర్‌ పంచాయతీ ఖాతా నుంచి రూ.57 వేలకుపైగా ప్రైవేటు ఖాతాలకు బదిలీ చేసుకున్నారు. ఇందులో ఫోర్జరీ విషయం  బయటకు రాకుండా అందరూ జాగ్రత్త పడుతున్నారు. చివరకు ఖాతాను మూసివేయడం ఆశ్చర్యానికి గురిచేసింది. పూర్తి విచారణ జరిపితేనే విషయాలు బయట కొస్తాయని స్థానికులు పేర్కొన్నారు.


ట్టణం, తండా అనే తేడా లేకుండా భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అలాగే ప్రభుత్వ ఖాతాల్లో వివిధ పనుల నిమిత్తం పెద్దమొత్తాల్లో సొమ్ము జమ అవుతోంది. వీటి విషయంలో తనిఖీలు సక్రమంగా ఉండటంలేదు. వీలు చూసి కొందరు అధికారులు అక్రమార్కులకు ఒత్తాసు పలుకుతుంటే, కొన్నిచోట్ల కిందిస్థాయి సిబ్బంది చేతులు కలుపుతున్నారు. వీటన్నింటి ఫలితం... రాత్రికి రాత్రి సంతకాలు ఫోర్జరీ అయిపోతున్నాయి. ప్రభుత్వ భూములు చేతులు మారుతున్నాయి. ఖాతాల్లో సొమ్ము దారి మళ్లుతోంది. ఫోర్జరీ చేశారనే వాస్తవం తేటతెల్లమైతే ‘కంప్యూటర్‌ ఆపరేటర్లు, కింది స్థాయి సిబ్బందిదే బాధ్యత’ అంటూ అక్రమార్కులు తప్పుకుంటున్నారు. పోలీసులు సైతం వారినే అరెస్టు చేసి, మమ అనిపిస్తున్నారు. దీని వెనుక ఎవరెవరున్నారనే విషయమై ఆరా తీయడంలేదు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఉన్నతాధికారులు వెనకడుగు వేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో జిల్లాలో పదేపదే ఇటువంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయి.

తవ్వేకొద్దీ...
ఇటీవల వికారాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో ఉన్నతాధికారుల కళ్లు కప్పి మూడు దఫాలు భూముల రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు తేలింది. ముగ్గురిని అరెస్టు చేశారు. తవ్వేకొద్దీ అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం బయటకు వస్తుండటం ఆందోళనకు గురిచేసింది. అయితే దీని వెనుక ప్రభుత్వ పెద్దలు, ప్రజా ప్రతినిధులు ఉండటంతో కేసులు నీరుగార్చేశారన్న విమర్శలు ఉన్నాయి.

* పరిగి మండలానికి చెందని ఓ వ్యక్తి తన పేరిట తహసీల్దార్‌ సాదాబైనామా చేశారంటూ ధ్రువీకరణ పత్రాలు తెచ్చాడు. భూమిని ఆన్‌లైన్‌లో ఎక్కించాలని రెవెన్యూ అధికారులను సంప్రదించాడు. అయితే 2018 తరువాత సాదాబైనామాలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, 2019లో తహసీల్దార్‌ ఎలా సంతకం చేస్తారని ఉన్నతాధికారులకు అనుమానం వచ్చింది. దీంతో పూర్వాపరాలు పరిశీలించి, అవి నకిలీ సంతకాలుగా అంచనాకు వచ్చారు. ఒక వేళ తహసీల్దార్‌ సంతకాలు చేసినట్లయితే చట్టపరంగా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుందని పేర్కొన్నారు. విషయం తెలిసినా ఈ సంఘటనపై ఎలాంటి విచారణ చేపట్టకపోవడం గమనార్హం. ఇలా జిల్లాలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఫోర్జరీల జాడ కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు మాత్రం తాము బాధ్యులం కామంటూ దాటవేయడం గమనార్హం.


వారే ఆధారం కావడంతో...

జిల్లాలో 19 మండలాలు, 571 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మండల తహసీల్దార్‌ కార్యాలయంలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు వచ్చిన తరువాత ఫోర్జరీల బెడద పెరుగుతోంది. ధరణిలో ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో సిబ్బందిని తీసుకుంటున్నారు. తహసీల్దార్లలో కొంత మందికి కంప్యూటర్‌ పరిజ్ఞానం తక్కువగా ఉండటంతో ప్రతి చిన్న విషయానికి ఆపరేటర్ల మీద ఆధారపడుతున్నారు. యూజర్‌ ఐడి, పాస్‌వర్డ్‌ అన్నీ వారి చేతికి అందిస్తున్నారు. దీంతో వీలు చిక్కినప్పుడల్లా కొందరు చేతివాటం చూపిస్తున్నారు. ప్రైవేటు వ్యక్తుల జోక్యం ఉందని తెలిసినా రెవెన్యూ సిబ్బంది కాసులకు ఆశపడి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. కేసులు పెట్టి మమ అనిపిస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని