షాడో సబ్‌ రిజిస్ట్రార్లుగా లేఖర్ల దందా

రాజేంద్రనగర్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో డాక్యుమెంట్‌ రద్దుకోసం ఓ వ్యక్తి నుంచి రూ.5లక్షలు లంచం తీసుకుంటూ సబ్‌రిజిస్ట్రార్‌ అర్షద్‌ అలీ, లేఖరి వాసు అనిశాకు పట్టుబడ్డారు. ఇదే కేంద్రంలో రోజూ డాక్యుమెంట్లలో దాదాపు 60శాతం ఒకే లేఖరి చేతి నుంచి సబ్‌రిజిస్ట్రార్‌కు వెళ్తాయి.

Updated : 28 Nov 2021 06:00 IST

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌, మూసాపేట, రాజేంద్రనగర్‌, శంషాబాద్‌, న్యూస్‌టుడే: రాజేంద్రనగర్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో డాక్యుమెంట్‌ రద్దుకోసం ఓ వ్యక్తి నుంచి రూ.5లక్షలు లంచం తీసుకుంటూ సబ్‌రిజిస్ట్రార్‌ అర్షద్‌ అలీ, లేఖరి వాసు అనిశాకు పట్టుబడ్డారు. ఇదే కేంద్రంలో రోజూ డాక్యుమెంట్లలో దాదాపు 60శాతం ఒకే లేఖరి చేతి నుంచి సబ్‌రిజిస్ట్రార్‌కు వెళ్తాయి. 15ఏళ్లుగా ఆయనదే దందా. ఐదేళ్ల క్రితం లంచం తీసుకుంటూ జైలుకెళ్లి వచ్చి మళ్లీ చక్రం తిప్పుతుండటం గమనార్హం.

నిషేధిత భూములు.. అక్రమ నిర్మాణాలు.. అంతా అవకతవకలే.. అయినా, రిజిస్ట్రేషన్‌ అవుతుంది. నంబర్లు మార్చేస్తారు, నిబంధనలు చెరిపేస్తారు.. ఎన్ని అడ్డొచ్చినా పని చేసి పెడతారు..కార్యాలయం ముగియగానే ముడుపులు పంచుకోవడం.. అధికారికి ముట్టాల్సింది అప్పజెప్పడం. ఇది ఒకటీ రెండూ కాదు హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని దాదాపు అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాయాల్లోనూ ఇదే దందా. ఎన్నిసార్లు అవినీతి నిరోధక శాఖ దాడుల్లో పట్టుబడినా.. జైలుకు అలా వెళ్లి ఇలా వచ్చి యథావిధిగా అవినీతి సామ్రాజ్యాలేలుతున్నారు. కొన్ని కేంద్రాల్లో అయితే డాక్యుమెంట్‌ రైటర్లే షాడో సబ్‌రిజిస్ట్రార్లుగా చక్రం తిప్పుతుండటం గమనార్హం.
అక్రమాలకు దారులు!.. అక్రమ రిజిస్ట్రేషన్లను సక్రమం చేసేందుకూ లేఖర్లే దారులు చెబుతున్నారు. కూకట్‌పల్లి ఎస్‌ఆర్‌ఓ పరిధిలో ఆస్‌బెస్టాస్‌ కాలనీ లేఅవుట్లలో 1-1074 ప్లాట్ల దాకానే అధికారిక లేఅవుట్‌ కాగా ఇక్కడ 1080, 90దాకా లంచం తీసుకొని అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారు. హైదర్‌నగర్‌లో 100, 114, 115, 81 సర్వే నంబర్లు వివాదంలో ఉండగా.. ఇక్కడ మూడు, ఐదు అంతస్తుల అక్రమ నిర్మాణాలకూ అనుమతిలిచ్చేశారు. రాజేంద్రనగర్‌ ఎస్‌ఆర్‌ఓ పరిధిలో టీఎన్‌జీఓస్‌ కాలనీలో ఓపెన్‌ ప్లాట్లకు రిజిస్ట్రేషన్‌ చేయకూడదని లోకాయుక్త ఆదేశాలిచ్చింది. వీటికి ఇంటి నంబర్లు సృష్టించి మరీ రిజిస్ట్రేషన్లు చేస్తుండగా.. కొన్ని నిషేధిత భూములకు బైనంబర్లు, పక్క సర్వే నంబర్లు వేసి రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని