logo
Published : 29/11/2021 00:35 IST

చిన్నారులకు రక్షణ.. శిశుగృహ

న్యూస్‌టుడే,వికారాబాద్‌ మున్సిపాలిటీ: పిల్లలకు జన్మ ఇవ్వడం ద్వారా మహిళ తన జీవితాన్ని సార్థకత చేసుకుంటుంది. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు, ఇతర కారణాలు ప్రభావితం చేయడంతో.. చిన్నారులను పోషించలేకపోతున్నామని కొందరు తల్లులు పేగు బంధాన్ని తెంచుకుంటున్నారు. ఇటువంటి శిశువులకు శిశుగృహ రక్షగా నిలుస్తోంది. చిన్నారిని ఎక్కడో వదిలేయకుండా జిల్లాలోని ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ఊయల్లో వదిలిపేడితే చాలు.. ఆ తర్వాత వారి పోషణ బాధ్యతను నిర్వాహకులే చేపడుతూ వారి ఆలన, పాలన చూస్తారు. ఈ నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ అందిస్తున్న కథనం.
జిల్లాలో మహిళా, శిశు, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 2013లో తాండూరులో శిశుగృహాన్ని ప్రారంభించారు. అనంతరం 2018 డిసెంబర్‌ 11న వికారాబాద్‌కు తరలించారు. చెత్త కుండీలు, పొదల్లో పడేసిన వారిని, పోషణ భారంగా భావించే వారి పిల్లలను కేంద్రం చేరదీస్తోంది. అప్పుడే పుట్టిన శిశువును నుంచి ఆరేళ్ల వయసున్న వారిని తల్లిదండ్రులు శిశుగృహకు అప్పగించవచ్చు. వారికి అన్ని రకాలుగా తోడుగా ఉంటూ వారిని పెంచి పెద్ద చేస్తారు. ఆ తర్వాత వారిని చట్టపరంగా పిల్లలు లేని వారికి దత్తత ఇస్తారు. ఇప్పటి వరకు ఇక్కడి నుంచి 30 మంది చిన్నారులను దత్తత ఇచ్చారు. కేంద్రంలో మేనేజర్‌, ఆరుగురు ఆయాలు, ఏఎన్‌ఎం, కాపలాదారు, వైద్యుడు ఉన్నారు.

ఆధారాలతో వస్తే: తప్పిపోయిన శిశువులను పది రోజుల పాటు పరిశీలనలో ఉంచుతారు. ఎవరైనా ఆధారాలతో వస్తే వాటిని పరిశీలించి, ఆనవాళ్లు సరిపోల్చి దంపతులకు అప్పగిస్తారు. ఈనెల 18న వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద అశ్రిత్‌రెడ్డి (5) చేరదీశారు. బాబు చెప్పిన వివరాల ప్రకారం వెళ్లి వాకబు చేయగా ఆధారాలు లభించలేదు. ప్రస్తుతం ఆ చిన్నారి కేంద్రంలోనే ఉన్నాడు.

భవనం మరమ్మతుకు రూ.10 లక్షలు: భవనం మరమ్మతుకు రూ.10 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో ఆదర్శ శిశుగృహగా మార్చాలన్న ఆలోచనలో అధికారులున్నారు. భవనానికి రంగులు వేయించి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు, చిన్నారులకు మౌలిక వసతులను కల్పించనున్నారు.

ఊయలలో వదలండి

శిశువులను రోడ్డు పక్కన, రైల్వేస్టేషన్‌లో, బస్‌స్టాండ్‌లో వదిలిపెట్టకుండా తాండూరు జిల్లా ఆసుపత్రిలో, వికారాబాద్‌ సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ఊయల్లో వదిలిపెట్టాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ విషయమై అవగాహన సదస్సులు కూడా నిర్వహిస్తున్నారు. ఊయలలో వదిలేశాక, అక్కడే ఉన్న ఫోన్‌ నంబరుకు చెపితే చాలని వారు పేర్కొంటున్నారు. చెత్తబుట్టల్లో పారవేస్తే శిశువు గాయలపాలై చివరికి మృత్యువాత పడిన సందర్భాలున్నాయని వారు తెలిపారు. వారికి ఎటువంటి దెబ్బతగిలినా భవిష్యత్తులో ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుందని అంటున్నారు.

పద్ధతి ఇది

దత్తత ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే సాగుతుంది. కేంద్ర దత్తత ప్రాధారిక సంస్థ కారా (సీఏఆర్‌ఏ) వెబ్‌సైట్‌ను తెరిచి చూస్తే పూర్తి సమాచారం ఉంటుంది. శిశువు కావాలనుకునే వారు ముందుగా రూ.6 వేలు చెల్లించి పేరు నమోదు చేసుకోవాలి. భార్యభర్తల పరిస్థితి, వారి కుటుంబం గురించి అధికారులు దర్యాప్తు చేస్తారు. అన్నీ సక్రమంగా ఉన్నట్లయితే అంగీకరించి రాష్ట్ర శిశు గృహానికి వెళ్లి రూ.40 వేల డీడీ చెల్లించాలని కోరుతారు. అనంతరం ఆన్‌లైన్‌లో పాప, బాబునో ఎంపిక చేసుకున్నాక, రెండేళ్లవరకు స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. ఆరోగ్యాన్ని  సరిగా చూసుకుంటున్నారా లేదా పరిశీలిస్తారు. లోపం ఉంటే దత్తత రద్దు చేస్తారు. ఏ జిల్లాకు చెందిన వారు ఆ జిల్లాలోని కేంద్రం నుంచి తీసుకోవచ్చు.

అక్రమ దత్తత నేరం: లలితకుమారి, జిల్లా సంక్షేమాధికారిణి

అక్రమంగా దత్తత తీసుకోవడం నేరం. చట్టపరంగా తీసుకోవటం వల్ల శిశువు భద్రత, చట్టబద్ధత, సురక్షితంగా ఉంటుంది. పిల్లలు లేని వారు శిశువులను దత్తత తీసుకునేందుకు ఒక మంచి అవకాశం. పిల్లలు లేని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దత్తతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. 

కేంద్రంలో అప్పగించండి: శ్రీనివాస్‌, మేనేజర్‌

పిల్లలను పోషించలేని స్థితిలో ఉన్న వారు శిశువులను ఎక్కడో వదిలేయకుండా శిశుగృహకు అప్పగించండి. వారి బాగోగులు మేం చూసుకుంటాం. తరచుగా దత్తత తీసుకున్న వారితో సమావేశాలను ఏర్పాటు చేసి పిల్లల పరిస్థితి గురించి ఆరా తీస్తాం. ప్రస్తుతం శిశుగృహలో 14 మంది ఉన్నారు. వీరిలో 8 మంది దత్తతకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని