logo
Published : 29/11/2021 02:56 IST

పదండి వ్యాయామం చేద్దాం!

 పైవంతెనల కింద ఉద్యానాలు, నడకదారులు

ముంబయిలో వంతెన కింద ఆహ్లాదంగా తీర్చిదిద్దారిలా..

ఈనాడు, హైదరాబాద్‌: పైవంతెనలు వాహనాలకే కాదు.. స్థానికులు సేదతీరేందుకూ వేదిక కాబోతున్నాయి. షేక్‌పేట రోడ్డులోని పొడవైన పైవంతెన మార్గంలో జీహెచ్‌ఎంసీ ఆ తరహా అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. పైవంతెన కిందనుండే ఖాళీ స్థలాన్ని నడక దారిగా తీర్చిదిద్దేందుకు నడుంబిగించింది. అధికారులు తాజాగా పనులు ప్రారంభించారు. పిల్లర్ల వెంట కాలిబాట, ఇరువైపులా పచ్చని మొక్కలు, వ్యాయామ పరికరాలు రాబోతున్నాయి. వృద్ధుల నుంచి చిన్నారుల వరకు అక్కడ చక్కగా సేదతీరేలా ఏర్పాట్లు చేయనున్నారు. భద్రత కోసం అడుగడుగునా విద్యుద్దీపాలు, నిఘా కోసం సీసీ కెమెరాలు, ఇతర ఏర్పాట్లు చేస్తామని జీహెచ్‌ఎంసీ స్పష్టం చేస్తోంది.

కొత్త వాతావరణం.. రాజధానిలో 30కి పైగా పైవంతెనలు ఉన్నాయి. మరో 20 వరకు కొత్తగా నిర్మాణమవుతున్నాయి. ముంబయి, చెన్నై వంటి మెట్రోనగరాలకు దీటుగా హైదరాబాద్‌లో పైవంతెనలు, అండర్‌పాస్‌ల నిర్మాణం జోరుగా సాగుతోంది. ఇప్పటికే వినియోగంలో ఉన్న పైవంతెనల కింద జీహెచ్‌ఎంసీ మొక్కలు పెంచుతోంది. అయినా పచ్చదనం ఆశించిన స్థాయిలో పెరగట్లేదు. కొన్ని ప్రాంతాల్లో చెత్త, చెదారం కనిపిస్తుంది. లేదంటే.. వ్యాపారాల కోసం, వాహనాల పార్కింగ్‌తో ఆక్రమణకు గురవుతున్న పరిస్థితి. వీటిని తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇటీవల జేఎన్‌టీయూ పైవంతెన కింద కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ మమత ఉద్యానాన్ని అభివృద్ధి చేశారు. స్మార్ట్‌ పార్కింగ్‌ కేంద్రాన్నీ అందుబాటులోకి తెచ్చారు. బల్దియా పార్కుల నిర్వహణ విభాగం మరో అడుగు ముందుకేసింది. పైవంతెనల కింద నిరుపయోగంగా మారే ప్రాంతాన్ని నడకకు ఉపయోగపడే కేంద్రంగా తీర్చిదిద్దుతోంది. షేక్‌పేట పైవంతెన కింద మొదటి ప్రాజెక్టు చేపడుతున్నారు.

ముంబయిలో సత్ఫలితాలు..

బృహన్‌ ముంబయి కార్పొరేషన్‌(బీఎంసీ) పరిధిలోని మతుంగ ప్రాంతంలో పైవంతెన ఉంది. దాని కింద భయానక వాతావరణం నెలకొనడంతో.. స్థానికులు 2011 నుంచి అక్కడ పార్కు ఏర్పాటు చేయాలని బీఎంసీ చుట్టూ తిరిగారు. 2015 నాటికి పార్కు అందుబాటులోకి వచ్చింది. వంతెన కింద పిల్లర్ల వెంట.. సుమారు 600మీటర్ల పొడవున నడక దారిని రంగురంగుల టైల్స్‌తో డిజైన్‌ చేశారు. ఇరువైపులా మొక్కలు, కుర్చీలు ఉంటాయి. 300 విద్యుద్దీపాలు, పెద్దఎత్తున సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అదే మాదిరి షేక్‌పేట పైవంతెన కింది భాగాన్ని మరింత ఉపయోగకరంగా అభివృద్ధి చేయనున్నట్లు బల్దియా అధికారులు వెల్లడించారు. అది విజయవంతమైతే ఇతర ప్రాంతాల్లోనూ పనులు ప్రారంభిస్తామన్నారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని