logo
Updated : 29 Nov 2021 02:57 IST

 విష వాయువు.. తీస్తోంది ఆయువు  

భద్రత ప్రమాణాలు పాటించకుండా మ్యాన్‌హోళ్లు, సెప్టిక్‌ట్యాంక్‌లలో పనులు

మాదాపూర్‌, న్యూస్‌టుడే

* 2016లో మాదాపూర్‌ వంద అడుగుల రోడ్డులో మ్యాన్‌హోల్‌ శుభ్రం చేసేందుకు దాదాపు పది అడుగుల లోతులో ఉన్న మ్యాన్‌హోళ్ల లోపలికి దిగిన ముగ్గురు కూలీలతోపాటు వారిని కాపాడబోయిన మరో వ్యక్తి మృత్యువాతపడ్డారు.

* ఇటీవల బీఎన్‌రెడ్డినగర్‌ డివిజన్‌లో మ్యాన్‌హోల్‌ శుభ్రం చేసేందుకు దిగిన ఇద్దరు కూలీలు విగత జీవులయ్యారు.

భద్రత ప్రమాణాలు పాటించకుండా చేస్తున్న పనులు అమాయక కూలీల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. సరైన రక్షణ చర్యలు లేకుండా పనిచేస్తున్న కూలీల పాలిట సెప్టిక్‌ ట్యాంకులు, డ్రైనేజీ మ్యాన్‌హోళ్లు మృత్యుకుహరాల్లా మారాయి. ఆదివారం కొండాపూర్‌లోని ఓ అపార్టుమెంట్‌ సెప్టిక్‌ ట్యాంక్‌ శుభ్రం చేసేందుకు వచ్చిన కూలీల్లో ఇద్దరు విష వాయువుల ధాటికి శ్వాస విడిస్తే మరో ఇద్దరు ఆసుపత్రి పాలవడం కూలీల భద్రతను ఎవరూ పట్టించుకోలేదన్న విషయాన్ని ఎత్తిచూపింది.

పూట గడవని దయనీయ స్థితిలో..

రెక్కాడితేగానీ డొక్కాడని కూలీలే ఎక్కువగా పారిశుద్ధ్య పనులు చేస్తుంటారు. వీరంతా సుశిక్షుతులు కాకపోవడంతో ప్రమాదాల బారిన పడి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. విషవాయువులు ఉండే సెప్టిక్‌ ట్యాంక్‌ లోకి దిగుతున్న క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై వీరికి అవగాహన ఉండటం లేదు. గుత్తేదారు చెప్పిన పనిచేయడం తప్ప చేస్తున్న పని ఎంత ప్రమాదమో వారికి తెలియడం లేదు. ఫలితంగా ప్రాణాలు పోతుండటంతో వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. 

కనీస జాగ్రత్తలు తప్పనిసరి

* మ్యాన్‌హోల్‌, సెప్టిక్‌ ట్యాంక్‌ శుభ్రం చేసే ముందు వాటి మూతలను కొంత సమయం తెరిచి ఉంచాలి

* గాలి ప్రసరించేలా ఫ్యాన్లను లోపల కొద్ది సమయం ఉంచడంతో ఘాటైన వాయువులు బయటకు వెళ్తాయి.

* లోపలికి దిగే వ్యక్తి నడుముకు తాడు కట్టి పైన ఉన్న వ్యక్తులు సదరు తాడు పట్టుకోవాలి. ఏదైనా శ్వాస ఇబ్బంది వెంటనే అతన్ని పైకి లాగాలి.

* కచ్చితంగా ఆక్సిజన్‌ గ్యాస్‌తో కూడిన మాస్క్‌ ధరించి తరువాతే లోపలికి దిగాలి, ఆక్సిజన్‌ లేకుండా లోపలికి వెళ్లడం ప్రమాదకరం

* ట్యాంక్‌ లోపల ఆక్సిజన్‌ ఉందో లేదో తెలుసుకునేందుకు ముందుగా క్యాండిల్‌ను వెలిగించి దాన్ని లోపలికి దించాలి, ఆక్సిజన్‌ శాతం తక్కువగా ఉంటే క్యాండిల్‌ ఆరిపోతుంది.

అత్యంత ప్రమాదకరం

- గిరిధర్‌రెడ్డి అసిస్టెంట్‌ ఫైర్‌ ఆఫీసర్‌ రంగారెడ్డి జిల్లా

మ్యాన్‌హోళ్లు, ట్యాంకుల లోపల ఉండే వ్యర్థ జలాల రియాక్షన్‌ కావడంతో విషపూరితమైన గ్యాస్‌ లోపల తయారవుతుంది. దాన్ని అంచనా వేయకుండా లోపలికి దిగితే ఘాటైన వాసనతో క్షణాల్లో ప్రాణాలను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఈ పని చేసేప్పుడు అప్రమత్తంగా ఉండాలి. 


కొండాపూర్‌లో ఇద్దరు కూలీల మృతి

మృతదేహాల వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు

గచ్చిబౌలి, న్యూస్‌టుడే: సెప్టిక్‌ ట్యాంక్‌ శుభ్రం చేసేందుకు లోపలికి దిగిన ఇద్దరు కూలీలు విషవాయువుల ధాటికి ఊపిరాడక తుది శ్వాస విడిచారు. రెండు గంటల్లో తిరిగి వస్తామని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు అంతలోనే అనంత లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబసభ్యుల రోదనకు అంతులేకుండా పోయింది. ఘటన వివరాలు పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. కొండాపూర్‌ గౌతమి ఎన్‌క్లేవ్‌ కాలనీలో హేమదుర్గా ప్రెస్టీజ్‌ అపార్టుమెంట్‌ సెల్లార్‌లో సెప్టిక్‌ ట్యాంక్‌ ఉంది. డ్రైనేజీ పైపులైను జామ్‌ కావడంతో ఆన్‌లైన్‌లో డయల్‌ సెప్టిక్‌ ట్యాంక్‌ క్లీనర్‌ పేరిట ఉన్న నంబర్‌కు పోన్‌ చేశారు. సింగరేణి కాలనీ ఆదర్శ్‌ నగర్‌లో నివాసమంటున్న వాహన యజమాని, డ్రైవర్‌ స్వామినాయక్‌ అదే బస్తీలో నివాసముంటున్న కూలీలు నేనావత్‌ శ్రీను(38), ఉల్లగొండ అంజయ్య(32), జాను(28)లతో కలిసి ఆదివారం వచ్చారు. ట్యాంక్‌పై కప్పును తీసి మురుగు నీటిని యంత్రంతో తోడేశారు. పూడిక తీసేందుకు నిచ్చెన వేసి శ్రీను, ఆంజయ్యలు ఒకరి తర్వాత మరొకరు లోపలికి దిగారు. విషవాయువుల ధాటికి ఊపిరాడక కొద్దిక్షణాలకే కుప్పకూలిపోయారు. ఎంత పిలిచినా ఉలుకూపలుకూ లేకపోవడంతో జాను, స్వామినాయక్‌ లోపలికి దిగే ప్రయత్నం చేయగా అస్వస్థతకు గురై బయటే పడిపోయారు. అపార్టుమెంట్‌ వాసులు పోలీసులకు, అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. వారు వచ్చి.. అస్వస్థతకు గురైన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆక్సిజన్‌ సిలిండర్‌ సహాయంతో సెప్టిక్‌ ట్యాంక్‌ లోపలికి దిగి విగతజీవులుగా పడి ఉన్న ఇద్దరికి తాడు కట్టి బయటకు తీశారు. 

శ్రీను                         అంజయ్య

మిన్నంటిన రోదనలు

నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన నేనావత్‌ శ్రీనుకు భార్య సుజాత, కుమార్తె మౌనిక(21), కుమారుడు సిద్దూ(18) ఉన్నారు.నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మండలానికి చెందిన అంజయ్యకు భార్య పద్మ, ఐదేళ్ల కుమారుడు అభిరామ్‌ ఉన్నాడు. కూలి పనిచేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న ఇద్దరి మృత్యువాతతో కుటుంబ సభ్యుల రోదనకు అంతులేకుండా పోయింది. వాహన యజమానిపై కేసు నమోదు చేస్తామని గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌ తెలిపారు.


కార్మికుల్ని మురుగుశుద్ధికి దించితే ఏడేళ్లు జైలే!

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: మ్యాన్యువల్‌ స్కావెంజర్స్‌ ఉపాధి, పునరావాస చట్టం-2013 ప్రకారం మురుగు శుద్ధికి కార్మికుల్ని దించడం నేరం. శిక్షణ లేని కార్మికులతో పనిచేయించినా, జాగ్రత్తల్లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినా నిర్వాహకులకు ఏడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.10 లక్షల దాకా జరిమానా విధించే అవకాశముందని చట్టాలు చెబుతున్నాయి. ఇంకా ప్రైవేటు సెప్టిక్‌ ట్యాంక్‌ నిర్వాహకులు ఎలాంటి శిక్షణ లేని కార్మికులనే నేరుగా దించి వారి ప్రాణాలు పోయేందుకు కారణమవుతున్నారు. దీనికి పరిష్కారంగానే నగరవ్యాప్తంగా 155313, 14420 టోల్‌ఫ్రీ నంబర్లలో జలమండలి ఆధ్వర్యంలో సెప్టిక్‌ ట్యాంకులు అందుబాటులో ఉన్నాయని.. అందులో పనిచేస్తున్న కార్మికులందరికీ శిక్షణతోపాటు అధునాతన రక్షణ పరికరాలూ అందించినట్లు గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్‌ స్టాఫ్‌ కాలేజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని