ఉపకార వేతనాలకుఅర్జీల స్వీకరణ షురూ
గడువు తేదీ: డిసెంబరు 31
న్యూస్టుడే, వికారాబాద్ టౌన్: పేద విద్యార్థులు (ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర) చదువుకు దూరం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఉపకార వేతనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా ఎస్సీ విద్యార్థులకు తాజాగా ప్రి మెట్రిక్ ఉపకార వేతనాల మంజూరుకు దరఖాస్తులు కోరుతోంది. జిల్లాలో చాలామందికి వీటిపై సరైన అవగాహన లేకపోవడంతో గతంలో ఎక్కువమంది సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఈసారైనా అధికశాతం విద్యార్థులకు అందేలా చూడాలని ప్రభుత్వం కోరుతోంది. ప్రస్తుతం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతున్న నేపథ్యంలో ‘న్యూస్టుడే’ కథనం....
10 వేలకుపైనే ఉన్నారు: జిల్లాలో 566 గ్రామ పంచాయతీలు, పరిగి, తాండూరు, వికారాబాద్, కొడంగల్ నియోజకవర్గాలున్నాయి. మొత్తం పాఠశాలలు (ప్రభుత్వ, ప్రైవేటు కలిపి) 1,073కాగా వీటిలో 5-10 తరగతుల వరకు 1.22 లక్షల మంది విద్యార్థులున్నారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఎస్సీ విద్యార్థుల సంఖ్య 10 వేల పైమాటే. ప్రి మెట్రిక్ ఉపకార వేతనాలకు వీరందరూ అర్హులే.
అవగాహన లేక...: గత విద్యా సంవత్సరం ప్రి మెట్రిక్ ఉపకార వేతనం అందుకున్న ఎస్పీ విద్యార్థులు కేవలం 782 మంది మాత్రమే కావడం గమనార్హం. ఇందుకు ప్రధాన కారణం విద్యార్థులకు, తల్లిదండ్రులుకు ఇద్దరికీ అవగాహన లేకపోవడమేనని కొందరు ఉపాధ్యాయులు తెలిపారు. వీరికి సాయం అందించేందుకు ప్రభుత్వం రూ.16.45 లక్షలు విడుదల చేసింది. సంబంధిత శాఖ ఆధ్వర్యంలోనైనా ప్రచారం కల్పిస్తే అర్హులందరూ దరఖాస్తు చేసుకునేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉంటుందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.
అర్హతలు..: విద్యార్థి గ్రామీణ ప్రాంతానికి చెందిన వారైతే రూ.1.80లక్షలు, పట్టణ వాసులైతే రూ.2 లక్షలోపు వార్షికాదాయం ఉండాలి. వీరికి మాత్రమే ఉపకార వేతనం లభిస్తుంది. (5-8 తరగతుల బాలికలకు రూ.1,500, బాలురకు రూ.1000, తరువాత 9,10 తరగతుల విద్యార్థులకు రూ.3000 చొప్పున ఏడాదికి మంజూరు చేస్తారు). ఆదాయం, కుల ధ్రువీకరణ పత్రం, తల్లి లేదా తండ్రి బ్యాంకు ఖాతా పుస్తకాన్ని అనుసంధానం చేయాలి. ఆన్లైన్ దరఖాస్తుకు డిసెంబరు 31వరకు గడువు ఉంది.
ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే వర్తింపు
- మల్లేశం, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వారే దరఖాస్తుకు అర్హులు. ప్రి మెట్రిక్ ఉపకార వేతన పథకాన్ని ఎస్సీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ఈ విషయమై అవగాహన కల్పిస్తున్నాం.అర్హత ఉన్న విద్యార్థులు గడువులోగా మీసేవ కేంద్రానికి వెళ్లి ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. జిల్లాలో ప్రత్యేకంగా ప్రధానోపాధ్యాయుల ద్వారా అర్జీలు సమర్పించేలా చూస్తున్నాం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.