logo
Published : 30/11/2021 03:21 IST

క్రైం వార్తలు

ఈడీ కేసులో మహేష్‌ బ్యాంక్‌ ఎండీకి ఊరట

ఈనాడు, హైదరాబాద్‌: ఏపీ మహేష్‌ కోఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌తో పాటు దాని ఎండీ ఎ.ఉమేష్‌ చంద్‌కు సోమవారం హైకోర్టులో ఊరట లభించింది. బ్యాంకుతోపాటు ఎండీపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నమోదు చేసిన కేసు విచారణను నిలిపివేస్తూ జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. బంజారాహిల్స్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి విచారణకు హాజరు కావాలంటూ జారీ చేసిన సమన్లను సవాలు చేస్తూ బ్యాంక్‌ ఎండీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. బ్యాంకు ఎన్నికల వివాదాల నేపథ్యంలో దాఖలైన కేసులో ఈడీ దర్యాప్తు చట్టవిరుద్ధమన్నారు. ఈ పిటిషన్‌పై విచారించిన న్యాయమూర్తి ఈడీకి నోటీసులు జారీ చేస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు.


ఏకే రావు తప్పేమీ లేనట్లే?
నిందితులు ఇంటర్నెట్‌ కాల్స్‌లో బిజీ

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: గాయని హరిణీరావు తండ్రి.. అనుమానాస్పదంగా మరణించిన ఏకే రావు- ఓ వంచన కేసులో మోసపోయిన వ్యక్తిగానే పోలీసులు భావిస్తున్నారు. ఫైనాన్స్‌ కన్సల్టెంట్‌గానే ఆయన మధ్యవర్తిత్వం చేశారని బెంగళూరు ఆగ్నేయ డీసీపీ శ్రీనాథ్‌ జోషి చెప్పారు. హైదరాబాద్‌ నుంచి ఇటీవలే బెంగళూరు వచ్చిన ఆయన యలహంక సమీపాన రైలు పట్టాలపై విగతజీవిగా పడున్న విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. వారంతా ఇంటర్నెట్‌ ద్వారా పరస్పరం చర్చించుకుంటున్నట్లు తెలిసిందన్నారు. సైబర్‌ క్రైమ్‌ విభాగం సాయంతో వీరి ఇంటర్నెట్‌ కాల్స్‌పై నిఘా ఉంచినట్లు చెప్పారు. వీరిలో ఒకరు ఉత్తరాది వ్యక్తిగా, మిగిలిన వారు దక్షిణ భారత రాష్ట్రాలకు చెందినవారని తెలుస్తోందన్నారు. బాధితులతో నిందితులు మాట్లాడిన భాషా శైలి ప్రకారం తాము ఈ అంచనాకు వచ్చినట్లు చెప్పారు. బాధితులు చెల్లించిన సొమ్ము లావాదేవీలకు- ఏకే రావుకు సంబంధం లేదని ప్రాథమిక విచారణ ద్వారా తెలుస్తోందన్నారు. ఏకే రావుకు తాజా వంచనకు ముందే ఆ ముఠాతో సంబంధం ఉందో? లేదో అన్నది ఇంకా తెలియరాలేదన్నారు. ఆయన మృతదేహం పోస్టుమార్టం నివేదిక ఇంకా అందలేదని రైల్వే సీఐ శివకుమార్‌  తెలిపారు.


గంజాయి ఉందని వచ్చారు.. అడ్డంగా దొరికారు

కేపీహెచ్‌బీకాలనీ, న్యూస్‌టుడే: గంజాయి ఉంది.. తాగుదామని మిత్రులను పిలిచాడు. అందరూ ఒకచోట చేరి గంజాయి పీలుస్తూ పోలీసులకు చిక్కారు. కేపీహెచ్‌బీ సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఠాణా పరిధిలోని ప్రగతినగర్‌ చెరువు కట్టపై వాకింగ్‌ట్రాక్‌లో యువకులు గంజాయి తాగేందుకు వచ్చారని సోమవారం ఉదయం సమాచారం అందడంతో ఎస్సై రమేశ్‌ సిబ్బందితో కలిసి వెళ్లి అయిదుగురు యువకులను అదుపులోకి తీసుకొన్నారు. లేక్‌వ్యూ కాలనీకి చెందిన పసుపులేటి విజయ్‌కుమార్‌(21) గంజాయి తాగుదామని ఇంద్రాహిల్స్‌కు చెందిన కాసాని శివ(23), వడ్ల సుమంత్‌(23), నాగాటి విజయ్‌కుమార్‌(21), ఓ బాలుడి(17)కి ఫోన్‌ చేసి పిలిచాడు. గంజాయి ద్రావణాన్ని సిగరెట్లతో పీలుస్తుండగా పోలీసులు అందర్నీ అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 5 గ్రాముల మత్తుమందు స్వాధీనం చేసుకున్నారు.


ఆరోగ్యశ్రీ డబ్బులొచ్చాయని గాలం
ఇద్దరి ఖాతాల్లోంచి రూ.లక్ష చొప్పున స్వాహా

నారాయణగూడ, న్యూస్‌టుడే: ‘ఆరోగ్యశ్రీ’ డబ్బులు వచ్చాయంటూ సైబర్‌ దొంగలు అమాయక ప్రజలను దోచేస్తున్నారు. సోమవారం హైదరాబాద్‌ సైబర్‌ ఠాణాలో ఇలాంటి రెండు కేసులు నమోదయ్యాయి. ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ కథనం ప్రకారం.. నగరానికి చెందిన ఓ వ్యక్తికి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేశాడు. ‘తాము ఆరోగ్యశ్రీ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాం.. మీకు ఆరోగ్యశ్రీ పథకం కింద డబ్బులు వచ్చాయి’ అని చెప్పాడు. ఆరోగ్యశ్రీ డబ్బు తనకెందుకు వస్తాయని బాధితుడు కనీస ఆలోచన చేయకుండా అవతలి వ్యక్తి అడిగినట్లు ఫోన్‌ నంబర్‌, ఫోన్‌ పే వివరాలు చెప్పాడు. అవతలి నుంచి ఫోన్‌పేలో ఓ సందేశం వచ్చింది. దానిపై క్లిక్‌ చేయగానే బాధితుడి ఖాతాలోంచి రూ.లక్ష మాయమయ్యాయి. ఇలాగే మరో వ్యక్తి ఖాతాలోంచి రూ.లక్ష కాజేశారు. ఈ ఫోన్‌ కాల్స్‌ దిల్లీ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. మోసగాళ్లు తెలుగులోనే మాట్లాతున్నారు.  

ఉద్యోగమిస్తామని రూ.6.85 లక్షలు..: కాచిగూడకు చెందిన ఓ విద్యార్థి ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా వెబ్‌సైట్లలో దరఖాస్తులు పొందుపర్చాడు. ఓ వ్యక్తి ఫోన్‌ చేసి.. ‘మీ దరఖాస్తులు పరిశీలించాం. అర్హతకు తగిన ఉద్యోగం ఫలానా కార్పొరేట్‌ కంపెనీలో ఉంది. ప్రాసెసింగ్‌ ఫీజు కింద కొంత డబ్బులు చెల్లించాలి’ అన్నాడు. బాధితుడు కొంత డబ్బు చెల్లించాడు. ఆ తర్వాత ఇతరత్రా ఖర్చులంటూ విడతల వారీగా రూ.6.85 లక్షలు బదిలీ చేయించుకున్నాడు. కొద్దిరోజులకు ఫోన్‌ ఆపేశాడు. బాధితుడు సైబర్‌ పోలీసులను ఆశ్రయించాడు.


తీసుకున్నదెంత.. బాధితులెందరు!
శిల్పాచౌదరి దంపతుల మోసాలపై పోలీసుల ఆరా

ఈనాడు, హైదరాబాద్‌: స్థిరాస్తి వ్యాపారంలో లాభాలిస్తామంటూ రూ.కోట్లు అప్పుగా తీసుకొని మోసగించిన శిల్పాచౌదరి దంపతులను కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్‌ దాఖలు చేయగా, తమకు బెయిల్‌ ఇవ్వాలంటూ నిందితులు పిటిషన్‌ వేశారు. వాదనలు విన్న న్యాయస్థానం డిసెంబరు 1వ తేదీకి వాయిదా వేసింది. ఈ దంపతుల బారిన పడిన బాధితులు ఎంతమంది ఉన్నారు? ఎన్ని కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారనే అంశంపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. వీరి చేతిలో తామూ మోసపోయామంటూ మరో నలుగురు తాజాగా పోలీసులను ఆశ్రయించారు. నగరానికి చెందిన గృహిణి రూ.2 కోట్లు అప్పుగా ఇచ్చినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. బాధితుల్లో మణికొండ, నానక్‌రామ్‌గూడ, జూబ్లీహిల్స్‌కు చెందిన బుల్లితెర తారలు ఉన్నట్టు సమాచారం.


మందులకు నగరమొస్తే.. అర్ధరాత్రి దోచేశారు!

మెహిదీపట్నం, న్యూస్‌టుడే: తల్లికి మందులు కొనేందుకు నగరానికి వచ్చిన యువకుడు దోపిడీకి గురయ్యాడు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనపై బాధితుడు సోమవారం మధ్యాహ్నం లంగర్‌హౌస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ శ్రీనివాస్‌ కథనం ప్రకారం.. కోదాడకు చెందిన నాగరాజు(26) తన తల్లికి మందులు కొనేందుకు ఆదివారం నగరానికి వచ్చాడు. రాత్రి కావడంతో షేక్‌పేట ఓయూకాలనీలో ఉండే బంధువుల ఇంటికి వెళ్దామని.. మెహిదీపట్నంలో ఆటో ఎక్కాడు. అప్పటికే ఆ ఆటోలో ఇద్దరు వ్యక్తులున్నారు. నానల్‌నగర్‌ చౌరస్తాకు రాగానే.. డ్రైవర్‌ ఆటోను లంగర్‌హౌస్‌ వైపు తిప్పాడు. అదేమని నాగరాజు ప్రశ్నించగా.. వెనక సీటులో కూర్చున్న ఇద్దరు వ్యక్తులు అతని గొంతుపై కత్తిపెట్టారు. అరిస్తే చంపేస్తామంటూ బెదిరించారు. కొద్ది దూరం వెళ్లాక జేబులోని రూ.3వేలు, రూ.20వేల విలువైన చరవాణి తీసుకొని ఆటోలోంచి దింపి పారిపోయారు. ఈ విషయం సామాజిక మధ్యామాల్లో చక్కర్లు కొట్టింది. పలు ఠాణాల పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఎట్టకేలకు పోలీసులు నాగరాజు చరవాణి నెంబరు సంపాదించి, ఫోన్‌ చేశారు. మధ్యాహ్నం తర్వాత బాధితుడు లంగర్‌హౌస్‌ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

కాప్రా, న్యూస్‌టుడే: కాప్రాలోని కైలాసగిరిలో 2015 అక్టోబరులో జరిగిన హత్య కేసులో నిందితుడికి జీవితఖైదు విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. కుషాయిగూడ సీఐ ఎ.మన్‌మోహన్‌ కథనం ప్రకారం.. హెచ్‌బీకాలనీలోని కైలాసగిరి మురికివాడలో ఉంటున్న పొలెపాక శ్రీనివాస్‌(40) పెంటింగ్‌ పనుల గుత్తేదారుగా పనిచేస్తున్నాడు. అతని దగ్గరి బంధువైన మౌలాలీ.. ప్రశాంత్‌నగర్‌లోని రైల్వే క్వార్టర్స్‌కు చెందిన ఇప్పల శ్రీనివాస్‌ అలియాస్‌ గుడ్డిపోషగాల శ్రీనివాస్‌, అలియాస్‌ గణేష్‌, అలియాస్‌ ఘని(36) ప్రైవేటు ఉద్యోగి. అతనితో గొడవపడి భార్య రేణుక పుట్టింటికి వెళ్లింది. భార్యకు సర్దిచెప్పి కాపురానికి తీసుకురావాలని ఇప్పల శ్రీనివాస్‌.. తన బంధువైన పొలెపాక శ్రీనివాస్‌ను వేడుకున్నాడు. ఆ గొడవను పరిష్కరించక పోగా తీవ్రంగా వేధిండంతో కక్ష పెంచుకున్నాడు. అంతం చేయాలని పథకం వేశాడు. 2015 అక్టోబరు 16న రాత్రి ఇప్పల శ్రీనివాస్‌.. పొలెపాక శ్రీనివాస్‌ ఇంటికి వెళ్లి మద్యం తాగించాడు. 17వ తేదీ తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతంలో గొడ్డలితో పొలెపాక శ్రీనివాస్‌పై దాడి చేసి హత్య చేశాడు. నిందితుడిపై నేరం రుజువుకావడంతో జీవితఖైదుతో పాటు రూ.10వేలు జరిమానా విధిస్తూ మల్కాజిగిరి 16వ అడిషనల్‌ జిల్లా సెషన్స్‌ కోర్టు తీర్పు చెప్పింది.


పబ్జీతో పరిచయం.. పెళ్లి పేరిట మోసం

అమీర్‌పేట, న్యూస్‌టుడే: పబ్జీ గేమ్‌తో పరిచయమైన ఓ యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని మోసం చేయడంతో పాటు రూ.2.50 లక్షల నగదు స్వాహా చేశాడు. ఎస్సార్‌నగర్‌ సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండ సైట్‌-3కి చెందిన యువతి(25)కి చరవాణిలో పబ్జీ ఆట ద్వారా మహ్మద్‌ అబ్దుల్లా ఫైసల్‌ పరిచయమయ్యాడు. తనది కరీంనగర్‌ జిల్లా ఖానాపూర్‌గా చెప్పాడు. ఈ పరిచయం పెళ్లి చేసుకొనే వరకు వచ్చింది. ఆమె తల్లిదండ్రులనూ పరిచయం చేసుకున్నాడు. తనకు అవసరం ఉందని ఆమె వద్ద రూ.2.50 లక్షలు తీసుకున్నాడు. వివాహం చేసుకోమని ఆమె పలుమార్లు కోరినా కాలయాపన చేయసాగాడు. ఆ తర్వాత  వారి ఫోన్‌ నంబర్లను బ్లాక్‌ చేశాడు. ఈ నేపథ్యంలో మోసపోయానని గ్రహించిన బాధితురాలు ఎస్సార్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని