అనుమానించాడు.. అంతమొందించాడు
భార్య మెడకు ఉరి బిగించిన భర్త
ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం
మృతురాలి మెడపై గాయాలు
మహేశ్వరం, న్యూస్‌టుడే: వారిద్దరికీ సుమారు 16 ఏళ్ల క్రితం వివాహమైంది.. 14 ఏళ్లు, 12 ఏళ్ల కుమారులు ఉన్నారు. ఇటీవల భార్య ఫోన్‌కు వచ్చిన మిస్డ్ కాల్‌ను గుర్తించిన భర్త ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో వారి మధ్య రోజురోజుకూ అగాథం పెరిగింది. చివరకు ఆమెను హత్య చేసి.. బలవన్మరణంగా చిత్రీకరించేందుకు యత్నించగా, పోలీసుల రంగప్రవేశంతో విషయం వెలుగులోకి వచ్చింది. మహేశ్వరం మండలం మాణిక్యమ్మగూడలో చోటుచేసుకున్న దారుణమిదీ.. మాణిక్యమ్మగూడ గ్రామానికి చెందిన అల్వాల నర్సింహ, లక్ష్మమ్మ(30) దంపతులు కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. నాలుగైదు రోజుల క్రితం లక్ష్మమ్మ ఫోన్‌కు మిస్డ్ కాల్ రాగా.. భర్త గమనించాడు. శుక్రవారం రాత్రి కూడా మరోసారి ఆమె ఫోన్‌కు మిస్డ్‌కాల్ రావడంతో అతడిలో అనుమానం మరింత పెరిగింది. ఈ విషయమై ఆదివారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు భార్యభర్తల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన నర్సింహ.. డ్రిల్లింగ్ మిషన్‌కు ఉన్న తాడుతో భార్యకు ఉరిబిగించాడు. ఊపిరాడక లక్ష్మమ్మ అక్కడిక్కడే మరణించింది. భార్యను హత్య చేశాక.. ఆత్మహత్యాయత్నంగా చిత్రీకరించాలని అతడు నిర్ణయించుకున్నాడు. దీంతో ఆమె మెడకు చీర బిగించి ఫ్యానుకు వేలాడదీశాడు. కొంతసేపటి తర్వాత తిరిగి తానే కిందికి దించి.. తన భార్య బలవన్మరణానికి పాల్పడిందంటూ స్థానికులను నమ్మించే ప్రయత్నం చేశాడు. లక్ష్మమ్మ మెడపై గాయాలు ఉండటంతో అనుమానించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న మహేశ్వరం సీఐ మధుసూదన్.. నర్సింహను తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజం బయటపడింది. దీంతో విచారణ నిమిత్తం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం లక్ష్మమ్మ మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.