TS News: ధాన్యం కొనలేకపోతే రూ.వేల కోట్ల ప్రాజెక్టులు, రైతుబంధు ఎందుకు?: రేవంత్

ధాన్యం కొనుగోలుపై తెరాస, భాజపా కలిసి నాటాకాలు ఆడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

Updated : 30 Nov 2021 13:43 IST

దిల్లీ: ధాన్యం కొనుగోలుపై తెరాస, భాజపా కలిసి నాటాకాలు ఆడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేంద్రం తన రైతు వ్యతిరేక బుద్ధిని మరోసారి చాటుకుందన్నారు. రైతుల సంక్షేమం గురించి కేసీఆర్‌ ఎందుకు ఆలోచించడం లేదని రేవంత్‌ మండిపడ్డారు. ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనకపోతే రాష్ట్రం కొనకూడదా అని రేవంత్‌ ప్రశ్నించారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల సందర్భంగా దిల్లీ వెళ్లిన ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు.

‘‘750 మంది రైతుల చావుకు కారణం మోదీ. భాజపాతో కుమ్మక్కై తెరాస నాటకాలు ఆడుతోంది. తెరాస ఎంపీలు కొందరు సభకు రాకపోవడంలో ఆంతర్యమేంటి? రైతుల కోసం రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్న ప్రభుత్వం ధాన్యం కొనలేదా? ధాన్యం కొనలేకపోతే వేల కోట్ల ప్రాజెక్టులెందుకు, రైతుబంధు ఎందుకు? వ్యవసాయంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పాలసీ అంటూ లేదు.

పసుపు బోర్డుపై నిజామాబాద్‌ రైతులను భాజపా మోసం చేసింది. కేసీఆర్‌ చక్కెర పరిశ్రమలను మూసివేసి రైతులకు నష్టం చేశారు. రైతులకు రాయితీపై విత్తనాలు, వ్యవసాయ పరికరాలు అందట్లేదు. కేసీఆర్‌ నిర్లక్ష్యం వల్లే తోటలు, మెట్ట పంటలు లేకుండా పోయాయి. ఏ పంటను కొనకపోతే ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు?’’ అని రేవంత్‌ ప్రశ్నించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని