TS News: రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనకపోతే ఊరుకోం: బండి సంజయ్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌ భాష జుగుప్సాకరంగా ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల సందర్భంగా

Published : 30 Nov 2021 13:47 IST

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం కేసీఆర్‌ భాష జుగుప్సాకరంగా ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల సందర్భంగా దిల్లీ వెళ్లిన ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు. నిన్నటి కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌పై స్పందించారు.

‘‘ సీఎం వాడే భాష తెలంగాణలో ఎవరైనా మాట్లాడతారా? ఎవరిని ఎలా తిట్టాలనే విషయంపైనే మంత్రివర్గంలో చర్చించారా? కేంద్ర మంత్రి విషయంలో అలాంటి భాష వాడవచ్చా? మీకు భయపడే మీ మంత్రులు ఆ భాషను సమర్థిస్తున్నారేమో కానీ ప్రజలు సహించరు. భాజపా నేతల సహనాన్ని పరీక్షించవద్దు. కేంద్రం రా రైసు కొంటుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టంగా చెప్పారు. రా రైసు కూడా కొనేది లేదని సీఎం చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనకపోతే మేం ఊరుకునేది లేదు.

ధాన్యం మొత్తం తానే కొంటున్నట్లు ఇన్నాళ్లు కేసీఆర్‌ గొప్పగా చెప్పుకోలేదా? వానాకాలం ధాన్యం కొంటామంటున్న కేసీఆర్‌.. యాసంగిలో ఎందుకు కొనరు?ఇతర రాష్ట్రాల్లో లేని సమస్య తెలంగాణలో ఎందుకు వచ్చింది. రైస్‌ బ్రాన్ ఆయిల్‌ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ఏర్పాటు చేశారా? ధాన్యం సేకరణలో తెరాస నేతలు అక్రమాలకు పాల్పడ్డారు. పాతబియ్యా్న్ని రీ సైక్లింగ్‌ చేసి ఎఫ్‌సీఐకి ఇస్తున్నట్లు తనిఖీల్లో తేలింది.

రైతు మిల్లర్ల మోసాలు బయటపడుతున్నందుకే ధర్నాలు చేస్తున్నారు. రైతులకు అండగా ఉండాల్సిన సీఎం.. రైసు మిల్లర్లకు అండగా ఉంటున్నారు. సన్న వడ్లలోనూ 5రకాల విత్తనాలు ఉన్నాయి, వాటిని వేస్తే మంచి దిగుబడి వస్తుంది. మంచి విత్తనాలు అందిస్తే రైతులకు సమస్య ఉండదు. సీఎం కేసీఆర్‌కు పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌పై ప్రేమ పెరిగిపోయింది’’ అని బండి సంజయ్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని