logo
Published : 01/12/2021 02:15 IST

కోట్లు పోయినా దోమలు పోలె!

గ్రేటర్‌లో వెయ్యి దాటిన డెంగీ కేసులు
ఈనాడు, హైదరాబాద్‌

గ్రేటర్‌ హైదరాబాద్‌లో దోమల నివారణ చర్యలు ప్రహసనంగా మారాయి. దోమల కట్టడికి ఏటా రూ.20 కోట్లకుపైగా వెచ్చిస్తున్నా ఫలితం కనిపించట్లేదు. ఏటికేడు సమస్య పెరుగుతోంది. కాలనీవాసులు నరకం చూస్తున్నారు. వర్షాకాలం మొదలైతే చాలు దోమకాటుతో డెంగీ జ్వరాలు ప్రబలుతున్నాయి. చిన్నారులు, వృద్ధులు ప్రాణాపాయానికి గురవుతున్నారు. పెద్దల పరిస్థితీ ఆందోళనకరంగా తయారవుతోంది. అధికారులు దోమల నివారణకు ఉపయోగిస్తున్న మందులు, ఫాగింగ్‌ వంటి చర్యలు, డ్రోన్లతో చెరువుల్లో మందు చల్లడం, గుర్రపుడెక్క తొలగింపు వంటి కార్యక్రమాలు నిధుల మేతగా మారుతుండటమే దుస్థితికి కారణమన్న విమర్శలొస్తున్నాయి.

పనిచేయని ఫాగింగ్‌..
భారీగా పెట్రోలు, డీజిల్‌, రసాయనాలు కలిపి కాలనీల్లో చేపట్టే ఫాగింగ్‌తో.. ఒక్క దోమ కూడా చావట్లేదు. కనీసం.. వాటికి మత్తుగానూ ఉండట్లేదు. పొగ కారణంగా కాసేపు తిరగడం మానేస్తున్నాయి. పొగ వాతావరణం తొలగిపోగానే మళ్లీ జనావాసాల్లో విజృంభిస్తున్నాయి. జీహెచ్‌ఎంసీకి ఈ విషయం తెలిసినప్పటికీ.. పౌరుల తృప్తి కోసం కంటి తుడుపు చర్యగా ఫాగింగ్‌ చేపడుతున్నామని అధికారులే చెబుతున్నారు.

ఇంటింటి తనిఖీలు అంతంతే..
జీహెచ్‌ఎంసీ దోమల నివారణ విభాగం సిబ్బంది సేవలను ఉన్నతాధికారులు అనేక రకాలుగా ఉపయోగించుకుంటున్నారు. రెండేళ్లుగా చూస్తే.. సిబ్బంది దోమల నివారణ కార్యక్రమాలకన్నా.. కొవిడ్‌ కట్టడి చర్యల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇప్పుడూ అదే పరిస్థితి. సుమారు 40 శాతం మంది కార్మికులు ఇంటింటి తనిఖీల్లో కాకుండా, టీకా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఫలితంగా ఇంటింటికీ తిరిగి, ఇళ్లలోని దోమల ఆవాసాలను ధ్వంసం చేసే యాంటీ లార్వా ఆపరేషన్లు(ఏఎల్‌ఓ) తగ్గిపోయాయి. కాలనీల్లో, ఇళ్లలో డెంగీ కారక దోమలు ఉత్పత్తి అవుతున్నాయి.

వర్షాలు, చలి కారణంగా..
ఇటీవల కురిసిన వర్షాలతో కొన్ని ప్రాంతాల్లో నీరు నిలిచి, అక్కడ దోమలు పెరుగుతున్నాయి. మూసీ పరివాహక ప్రాంతాల్లో సమస్య తీవ్రంగా మారింది. సాయంత్రం కాగానే ఇళ్లలోకి దోమలు దండెత్తుతున్నాయి. మూసీలో నీటి ప్రవాహం తగ్గిపోయి, నీరు ఒకే చోట ఎక్కువ రోజులు నిలుస్తుండటంతో దోమ ఉత్పత్తి అవుతోంది. చెరువుల్లో గుర్రపు డెక్క తీయట్లేదు. డ్రోన్లతో పిచికారీ చేస్తోన్న మందుతో ప్రయోజనం ఉండట్లేదు. చలి కారణంగానూ దోమ సంతతి విపరీతంగా పెరుగుతోంది.

చిన్నారులే ఎక్కువ..
ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటివరకు నమోదైన కేసులు వేయికిపైగా పెరిగాయి. అధికారులు కొన్ని ఆస్పత్రుల్లో నమోదవుతున్న డెంగీ కేసులనే పరిగణనలోకి తీసుకుంటున్నా.. కేసుల సంఖ్య వెయ్యికి మించడం ఆందోళనకు తావిస్తోంది. నవంబరులోనే 48 మంది డెంగీ బారినపడ్డారు. అందులో చిన్నారులు ఎక్కువగా ఉండటం గమనార్హం.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని