నకిలీ ఆర్‌సీలతో యాజమాన్య హక్కుల మార్పిడి

వాహనాలకు నకిలీ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్స్‌ (ఆర్‌సీ) సృష్టించి యాజమాన్య హక్కులు మార్చుతున్న ముఠాను సైబరాబాద్‌ ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్ట్‌ చేసింది. మంగళవారం సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌...

Updated : 01 Dec 2021 04:56 IST

భద్రాద్రి-కొత్తగూడెం కేంద్రంగా దందా 

ఆరుగురి అరెస్ట్‌   

ఈనాడు, హైదరాబాద్‌, శంషాబాద్‌, న్యూస్‌టుడే: వాహనాలకు నకిలీ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్స్‌ (ఆర్‌సీ) సృష్టించి యాజమాన్య హక్కులు మార్చుతున్న ముఠాను సైబరాబాద్‌ ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్ట్‌ చేసింది. మంగళవారం సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర ఈ వివరాలు వెల్లడించారు.  అడ్డదారిలో సొమ్ము సంపాదించేందుకు చమన్‌ సతీష్‌, షేక్‌ జహంగీర్‌బాష, కె.చంద్రశేఖర్‌, ఎం.గణేశ్‌, సయ్యద్‌ హుస్సేన్‌, సీహెచ్‌.రమేశ్‌, సంపత్‌ ముఠాగా ఏర్పడి నకిలీ ఆధార్‌కార్డులు, రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్లను తయారు చేసి వాహన యజమానులకు 9 నెలలుగా విక్రయించేవారు. 

ఎక్కడెక్కడివారో కలిసి..

చమన్‌ సతీష్‌ శంషాబాద్‌లోని రాళ్లగూడ నివాసి. నకిలీ ఆధార్‌, ఆర్‌సీ కార్డుల సృష్టికర్త. రాజేంద్రనగర్‌కు చెందిన ఎం.గణేశ్‌ అతడికి సహాయం చేసేవాడు. యూసుఫ్‌గూడకు చెందిన ఆర్టీఏ ఏజెంట్‌ జహంగీర్‌ బాషాకు పలు రవాణాశాఖ కార్యాలయాల్లో కొందరు అధికారులతో పరిచయాలున్నాయి. వాహన రిజిస్ట్రేషన్‌ లొసుగులపై అవగాహన ఉంది. సరైన పత్రాల్లేని వాహనాలకు అనుమతి పత్రాలు ఇప్పించటంలో సిద్ధహస్తుడు. కొత్తగూడెంలోని ఆర్టీఏ ఏజెంట్‌ సంపత్‌ ఇతడికి అవసరమైన ఆర్‌సీ కార్డులను సమకూర్చేవాడు. వివిధ కారణాల వల్ల యజమానులకు చేరని కార్డులు రవాణా శాఖ కార్యాలయానికి వెనక్కు వస్తాయి. సంపత్‌ కొత్తగూడెం, భద్రాద్రిలోని రవాణాశాఖ కార్యాలయాల నుంచి రోజూ 2-3 ఆర్‌సీ కార్డులను దొంగిలించి, ఒక్కోదాన్ని బాషాకు రూ.200-300కు విక్రయించేవాడు. సతీష్‌కు అమ్మేవాడు. కిషన్‌బాగ్‌కు చెందిన ఆర్‌టీఏ సయ్యద్‌ హుస్సేన్‌ కూడా రవాణాశాఖ కార్యాలయానికి తిరిగి వచ్చిన ఆర్‌సీ కార్డులను చోరీ చేసేవాడు. వీటిని వేలంలో వాహనాలను కొనే మియాపూర్‌కు చెందిన సీహెచ్‌.రమేష్‌కు విక్రయించేవాడు. 

పాత పేర్లు చెరిపేసి..

డీటీపీ ఆపరేటర్లుగా అనుభవం ఉన్న ఎం.గణేశ్‌ ఆర్‌సీ కార్డులపై ఉన్న పేర్లు, నంబర్లు, చిరునామాను చెరిపేసి కొత్త పేర్లను రాసేవాడు. వాటితోపాటు యాజమాన్య బదిలీకి అవసరమైన ఆధార్‌కార్డులను తయారు చేసి.. రూ.1000-1200 వరకూ విక్రయించేవారు. 9 నెలల వ్యవధిలో 1000 నకిలీ ఆర్‌సీ కార్డుల ద్వారా వాహనాల యాజమాన్య బదిలీ చేయించినట్టు గుర్తించామని ఎస్‌వోటీ డీసీపీ సుదీప్‌ తెలిపారు. ముఠా వద్ద నుంచి 900 నకిలీ ఆర్సీలు, ఖాళీ ఆర్‌సీ కార్డులు 3000 స్వాధీనం చేసుకున్నారు. వీరిని రిమాండ్‌కు తరలించారు. సంపత్‌ పరారీలో ఉన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని