logo
Published : 02/12/2021 03:30 IST

వేగం పెరిగితేనే.. వేదన తీరేది

 ఊపందుకోని ధాన్యం కొనుగోళ్లు 

రక్షణకు అన్నదాతల అగచాట్లు 

చెంగోల్‌లో చెట్టు కింద నిల్వ ఉంచిన ధాన్యం బస్తాలు

జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఫలితంగా కేంద్రాల వద్ద రైతులకు నిరీక్షణ తప్పడంలేదు. అకాల వర్షాల నుంచి ధాన్యం కుప్పలు తడిసిపోకుండా ఉంచేందుకు ఆపసోపాలు పడాల్సి వస్తోంది. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తేనే తమకు ఊరట లభిస్తుందని అన్నదాతలు వేడుకొంటున్నారు. ఈ నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ కథనం.

న్యూస్‌టుడే, తాండూరుగ్రామీణ

జిల్లాలోని 19 మండలాల్లోని రైతులు ఖరీఫ్‌లో 1.15లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. అధికారులు మద్దతు ధరగా మొదటి రకం ధాన్యం క్వింటాలుకు రూ.1,960, సాధారణ రకానికి క్వింటాలుకు రూ.1,940గా ప్రకటించారు. ఈమేరకు జిల్లా వ్యాప్తంగా మహిళా సమాఖ్య (ఐకెపీ) ఆధ్వర్యంలో 28, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిధిలో 28, డీసీఎమ్మెస్‌ 35, ఎఫ్‌పీఓ 2, విపణి శాఖ ఆధ్వర్యంలో 13 చొప్పున కొనుగోలు కేంద్రాలను 3 రోజుల క్రితం ప్రారంభించారు. అయితే నేటికీ సగానికిపైగా కేంద్రాల్లో తూకాలే మొదలు కాలేదు. కేవలం టోకెన్ల జారీ, గోనె సంచుల పంపిణీతో సరిపెట్టారు.  
అకాల వర్షాలతో అవస్థలు
కొన్ని రోజులుగా వాతావరణ మార్పులతో అకాల వర్షాలు పడుతున్నాయి. ఈ సమయంలో ఆరు బయట నిల్వ చేసిన ధాన్యం తడిసిపోకుండా తాడిపత్రిలు కప్పుతూ రైతులు నానా పాట్లు పడుతున్నారు. కుటుంబ సభ్యులంతా కుప్పల వద్దే ఉంటున్నారు. తాండూరు మండలం చెంగోల్‌లో అధికారులు మూడు రోజులుగా 40మందికి టోకెన్లు జారీ చేశారు. తూకాలు చేయకపోవడంతో పదుల సంఖ్యలో రైతులు మహత్మాగాంధీ విగ్రహ ప్రాంగణంలో, బాహ్యవలయ రహదారి పరిసరాల్లో నిల్వ చేశారు. సాయంత్రం సన్నని జల్లులతో వర్షం ప్రారంభమవడంతో రైతులంతా కలవరపడ్డారు. తడిసిపోతే తేమ పేరిట అధికారులు కొనుగోలుకు నిరాకరిస్తారని, మళ్లీ ఆరబెట్టేందుకు వారం రోజులు పడుతుందని ఆందోళన చెందుతున్నారు. చింతామణిపట్నంలో ధాన్యాన్ని సిమెంటు రహదారులపై నిల్వ ఉంచారు. మల్‌రెడ్డిపల్లి, అంతారంతండా, గోనూరులోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
వివరాల నమోదులోనూ జాప్యం
కొనుగోలు ధాన్యం తాలూకూ నగదును నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో 48 గంటల్లోగా జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు చెల్లింపులు జరగాలంటే కొనుగోలు పూర్తయిన రైతుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తేనే సాధ్యపడుతుంది. క్షేత్రస్థాయిలో ఆలస్యమవుతోంది. మూడు రోజులుగా 366మంది రైతుల నుంచి ధాన్యం సేకరించగా ఇప్పటివరకు కేవలం పది మంది రైతుల వివరాలను మాత్రమే పొందుపరిచారు. మిగతా వారంతా వేచి చూడాల్సిందే.  
తూకాల్లో జాప్యం వద్దు  
- బంటు నర్సింహులు, రైతు, చెంగోల్‌.

గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో రెండు రోజులుగా రోజుకు 20మంది రైతులకు టోకెన్లు ఇచ్చారు. తూకాలు ప్రారంభించడం లేదు.  ధాన్యాన్ని నిల్వ ఉంచేందుకు ఇబ్బందులు పడుతున్నాం. వెంటనే తూకాలు వేసి ధాన్యాన్ని మిల్లులకు చేరవేస్తే మేలు.
డిపాజిట్‌ లేకుండా సంచులివ్వాలి
మైబు, రైతు, చెంగోల్‌

వడ్లను కొనుగోలు కేంద్రానికి తరలించేందుకు 150 గోనె సంచులు అవసరమయ్యాయి. కేంద్రం వద్ద సిబ్బంది రూ.3వేల నగదు డిపాజిట్‌గా పెట్టుకొని సంచులు ఇచ్చారు. తూకాలు పూర్తయ్యాక ఆ మొత్తాన్ని తిరిగి ఇస్తామన్నారు. డిపాజిట్‌ లేకుండా సంచులు ఇవ్వాలి.
ఎనిమిది రోజులుగా కాపలా
సురేష్‌గౌడ్‌, రైతు, చింతామణిపట్నం

కొనుగోలు కేంద్రం ప్రారంభించినా తూకాలు వేయడం లేదు. బైపాస్‌ రోడ్డు పక్కన వడ్లను కుప్పగా నిల్వ చేసి రాత్రీపగలూ నేను, నా భార్య కాపలా ఉండాల్సి వస్తోంది. వర్షం పడితే తడిసిపోకుండా తాడిపత్రిలు కప్పి ఇబ్బందులకు గురవుతున్నాం. తూకాలు వేసి తరలించాలి.


జిల్లాలో మొత్తం కొనుగోలు కేంద్రాలు: 127  
ప్రారంభించినవి: 126
లక్ష్యం: 2.50లక్షల మెట్రిక్‌ టన్నులు
సేకరించింది కేవలం: 2330  
మిల్లులకు తరలించింది: 1100
రైతుల సంఖయ: 366
మొత్తం మిల్లులు: 60
అందుబాట్లోకి వచ్చినవి: 39
కేవలం టోకెన్ల జారీ, గోనె సంచుల పంపిణీ

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని