logo
Published : 02/12/2021 03:30 IST

మూసీ కంపు తొలగేలా.. ఇంపు సాకారమయ్యేలా!

మూసీ సుందరీకరణ దిశగా తొలి అడుగు

అధికారులకు మంత్రి కేటీఆర్‌ దిశానిర్దేశం

 ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి, ఈనాడు, ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌

రాజధానిలో నార్సింగి నుంచి నాగోలు వరకు 25 కి.మీ. పొడవున ఉన్న మూసీ నది అభివృద్ధికి రూ.13,400 కోట్ల మేర వ్యయం అవుతుందని నిపుణులు అంచనా వేశారు. నదికి రెండువైపులా 3-4 లైన్ల రోడ్లను వేయడంతోపాటు చుక్క మురుగు నీరు చేరకుండా చూడాలని నిర్ణయించారు. 2022 జూన్‌ కల్లా పనులను మొదలుపెట్టి 2023 జూన్‌ నాటికి సగంమేర పూర్తి చేయాలని సర్కార్‌ ఆదేశించింది. తొలిదశలో రూ.1500 కోట్లను విడుదల చేయమని మంత్రి కేటీఆర్‌ ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. మూసీ సుందరీకరణపై బుధవారం మంత్రి అధికారులతో చర్చించారు.

చిక్కుముడులపై ముందుగా దృష్టి!

* మూసీకి ఇరువైపులా 25 కి.మీ. పొడవునా అనేక ఆక్రమణలున్నాయి. కొన్ని చోట్ల నదినీ ఆక్రమించారు. ఇప్పటికే పూర్తయిన 95 శాతం సర్వే ప్రకారం.. మొత్తమ్మీద 11 వేల ఆక్రమణలుంటాయని అంచనా వేస్తున్నారు. ఈ ఆక్రమణలపై ఏం చేయాలన్న దానిపై సర్కార్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నష్ట పరిహారం ఎంతివ్వాలన్న దానిపై దస్త్రాన్ని సీఎం కేసీఆర్‌కు పంపించాలని నిర్ణయించారు.

* మూసీ నదిలో 1952 నుంచి రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తే 970 ఎకరాలు పట్టా భూమిగా ఉందని తేల్చారు. నీటి ప్రవాహం మధ్యలోనే ఈ భూమి ఉంది కాబట్టి రికార్డులు మార్చాలా.. లేక యజమానులకు నష్టం పరిహారం ఇవ్వాలా అనే దానిపై నివేదిక రూపొందించి సీఎంకు పంపించనున్నారు. 

* ప్రస్తుతానికి నదిపై ఎటువంటి మాస్టర్‌ ప్లాన్‌ లేకపోవడంతో కొత్తగా తయారుచేసి అభివృద్ధి ప్రణాళికను రూపొందించాల్సి ఉంది. సలహాదారుల కంపెనీకి ఆ బాధ్యతను అప్పగిస్తున్నారు. సమగ్ర అభివృద్ధి ప్రణాళిక నివేదికను మూడు నెలల్లో ఇవ్వాలని సలహాదారు సంస్థను కోరనున్నారు.

నిధుల సమీకరణ ఎలా.. 

మూసీ అభివృద్ధిపై బుధవారం మంత్రి కేటీఆర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావుతోపాటు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, మూసీ అభివద్ధి సంస్థ ఛైర్మన్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎండీ విశ్వజిత్‌, హైదరాబాద్‌ మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. రెండు గంటల సేపు చర్చించారు. ఎట్టిపరిస్థితుల్లో 2023 జూన్‌ నాటికి 50 శాతం మేర పనులు పూర్తి చేసి ఒక రూపు తేవాలని నిర్ణయించారు.

* మూసీ నది పరివాహక ప్రాంతంలో వెయ్యి ఎకరాలకు పైగా భూమి ఉంది. సీఎం ఆదేశాలకు అనుగుణంగా దీన్ని విక్రయించి కొంత మొత్తాన్ని సేకరించాలన్న ఆలోచనలో ఉన్నారు. అవసరమైతే బ్యాంకు రుణాలను తీసుకోవాలనుకుంటున్నారు. 

* తొలి దశలో ఆక్రమణల తొలగింపుపై దృష్టిపెట్టాలని నిర్ణయించారు. నదిపై 14 చోట్ల వంతెనల నిర్మాణాలను చేపట్టాలని కేటీఆర్‌ ఆదేశించారు. మూసీ అభివృద్ధి ప్రణాళికకు రూ.25 కోట్ల వరకు వ్యయం అవుతుందని ఈ నిధులను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.

* నగరంలో నదికి రెండువైపులా మైసూర్‌ బృందావన్‌ గార్డెన్‌ తరహాలో పది పన్నెండు చోట్ల పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 

* మురుగునీరు నదిలోకి రాకుండా పది చోట్ల మురుగుశుద్ధి కేంద్రాల ఏర్పాటు పనులను వేగవంతం చేయనున్నారు. గతంలో సీఎం ప్రకటించిన విధంగా అవసరమైనప్పుడు జంటజలాశయాల నుంచి మూసీ నదిలోకి నీటిని వదిలేలా ప్రణాళికను రూపొందిస్తున్నారు.


తక్షణం పనులు మొదలుపెడతాం
దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మూసీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌

మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు మూసీ సుందరీకరణ పనులు వేగవంతం చేయబోతున్నాం. వారం రోజుల్లో ఆక్రమణల గుర్తింపును పూర్తి చేస్తాం. మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించి అభివృద్ధి ప్రణాళికను రూపొందించే పని ప్రారంభిస్తాం. 2022 జూన్‌ నుంచి పెద్దఎత్తున పనులను మొదలుపెట్టి 2023 జూన్‌ నాటికి సగం మేర పనులను పూర్తి చేసేలా ప్రణాళికను రూపొందించుకున్నాం.


సుందరీకరణ ప్రణాళిక, లక్ష్యం

* 2023 జూన్‌ నాటికి 50 శాతం పూర్తి లక్ష్యం

* 2022 జూన్‌ నుంచి పూర్తిస్థాయిలో పనులు

* మొత్తం వ్యయం రూ. 13,400 కోట్ల వ్యయం

* తొలిదశ కింద రూ.1500 కోట్లు

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని