logo
Published : 03/12/2021 01:15 IST

ఎట్టకేలకు నర్సింలు మృతదేహం వెలికితీత

బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థుల ఆందోళన

చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, ఆందోళనకారులతో మాట్లాడుతున్న ఏసీపీ

దుబ్బాక, న్యూస్‌టుడే: మండలంలోని చిట్టాపూర్‌ గ్రామ శివారులో బుధవారం టైరు పేలి కారు బావిలోకి దూసుకెళ్లగా తల్లీకుమారుడు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. కారు, మృతదేహాలను వెలికితీసే సహాయక చర్యల్లో పాల్గొన్న ఎనగుర్తి గ్రామానికి బండకాడి నర్సింలు (45) విగతజీవిగా మారిన సంగతి విదితమే. కారుతో పాటు నర్సింలు మృతదేహం వెలికితీస్తుండగా జారిపోయి బావిలో పడిపోయింది. కుటుంబీకులు, గ్రామస్థులు ఘటనాస్థలిలో అదే రోజు రాత్రి 9 గంటలకు ఆందోళన చేపట్టగా, గురువారం తెల్లవారుజాము 3 వరకు కొనసాగింది. సిద్దిపేట ఆర్డీవో అనంతరెడ్డి ఘటనాస్థలికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడి ప్రభుత్వపరంగా బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో 6 గంటలపాటు సాగిన ధర్నాను విరమించారు.

నీటిని తోడించి..
మృతదేహాన్ని వెలికితీసేందుకు గురువారం ఉదయం గజ్వేల్‌ ఏసీపీ రమేశ్‌ ఆధ్వర్యంలో మల్లన్నసాగర్‌ ప్రాజెక్ట్‌కు చెందిన పెద్ద బోరుమోటారును తెప్పించారు. దాంతో పాటు మరో రెండింటి సాయంతో బావిలోని నీటిని తోడించారు. సిద్దిపేటకు చెందిన ఇద్దరు గజ ఈతగాళ్లు, క్రేన్‌ సాయంతో నర్సింలు మృతదేహాన్ని ఎట్టకేలకు బయటకు తీసుకొచ్చారు. శవ పరీక్షకు తరలిస్తుండగా కుటుంబీకులు, గ్రామస్థులు వాహనాన్ని చుట్టుముట్టి అక్కడే బైఠాయించారు. ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆదేశాలతో నర్సింలు బావిలోకి దిగి విగతజీవిగా మారారని వాపోయారు. కాంగ్రెస్‌ పార్టీ దుబ్బాక నియోజకవర్గ బాధ్యుడు చెరుకు శ్రీనివాస్‌రెడ్డి వారితో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు. ఏసీపీ రమేశ్‌ నచ్చజెప్పినా ఫలితం లేకపోయింది. ఎనగుర్తి సర్పంచి శంకరయ్యతో ఏసీపీ మాట్లాడారు. గ్రామస్థుల సమక్షంలో ఆర్డీవోతో చరవాణిలో మాట్లాడించారు. అంత్యక్రియల నిమిత్తం తక్షణ సాయంగా రూ.20 వేలు, వారం రోజుల్లో రూ.6 లక్షల పరిహారం, నెల రోజుల్లో మత్స్యశాఖ నుంచి బీమా రూ.5 లక్షలు, రెండు పడక గదుల ఇల్లు, మృతుడి భార్యకు అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగం ఇస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. మృతదేహానికి సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో శవపరీక్ష అనంతరం స్వగ్రామంలో పోలీసుల బందోబస్తు మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏసీపీ, ఇద్దరు అదనపు డీసీపీలు, సీఐలు, ఎస్‌ఐలు, ఇతర సిబ్బంది 100 మందితో బందోబస్తు చేపట్టారు. స్థానికులు పలువురు భాజపా గద్దెను కూల్చివేశారు.

అంతిమయాత్రలో గ్రామస్థులు
రామాయంపేట: నిన్నటి వరకు కలివిడిగా ఉండి.. అనుకోని ప్రమాదంతో విగతజీవులుగా మారిన సుదనం ప్రశాంత్‌, లక్ష్మి మృతదేహాలను సిద్దిపేటలో పంచనామా తర్వాత స్వగ్రామమైన నిజాంపేట మండలం నందిగామకు తీసుకొచ్చారు. వారి మృతదేహాలను చూసిన గ్రామస్థులు శోకసంద్రంలో మునిగిపోయారు. అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర నిర్వహించారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని