గ్రాసం గోస
యంత్రాలతో పనికిరాకుండా పోతున్న వైనం
న్యూస్టుడే, వికారాబాద్: వ్యవసాయ రంగానికి అనుబంధమైన పశుపోషణ రైతులకు అదనపు ఆదాయాన్ని ఇచ్చే కల్పతరువు లాంటిది. అయితే ఆధునికత, యాంత్రీకరణ తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. జిల్లాలో దాదాపు రూ.25 కోట్ల విలువైన గ్రాసం ఎందుకూ పనికిరాకుండా పోవడమే దీనికి కారణం. దీంతో పశుసంపద గణనీయంగా తగ్గిపోతోంది. దీనికి తోడు పోషక లోపాలు తలెత్తుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.
సేద్యంలో యంత్ర వినియోగాన్ని పెంచడంతో ఏటా గడ్డికి కొరత ఎదురవుతోంది. దీనికి తోడు ప్రభుత్వం వరి సాగును నిషేధించడంతో మరింత ఇబ్బందులు ఎదురవ్వనున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. దశాబ్ధంన్నర కిందట పశువైద్యశాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో తెల్లజాతి, నల్లజాతి పశువులు సుమారు 5 లక్షలు ఉండేవి. తాజా గణన ప్రకారం ఆ సంఖ్య 2,56,502కు తగ్గింది. వ్యవసాయరంగంలో కీలక పాత్ర పోషించే వీటి సంఖ్య గత 15 ఏళ్లలో విపరీతంగా తగ్గిపోయాయి. ఏటా వేసవిలో గడ్డి కొరత ఏర్పడుతోంది. కూలీలు అందుబాటులో లేక, అధిక వ్యయంతో పంటను యంత్రాల సాయంతో నూర్పిళ్లు చేస్తుండటంతో 80 శాతం వృథా అవుతోంది. దీంతో మేత కొరత ఏర్పడి ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునే పశువులను కబేళాలకు తరలించడం, సంతలో అయినకాడికి విక్రయించుకునే దుస్థితి నెలకొంటోంది.
ఇదీ పరిస్థితి..
* గత వానాకాలం సీజన్లో అధికారుల గణాంకాల ప్రకారం.. 1.05 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు.
* జిల్లాలో తెల్లజాతి పశువులు 1,74,847, నల్లజాతివి 81,655
* 2.10 లక్షల టన్నుల పశుగ్రాసం వరిపంట సాగు ద్వారా ఉత్పత్తి కావాల్సి ఉండగా, యంత్ర వినియోగంతో 80 శాతం పశుగ్రాసం అంటే 1,68,000 టన్నుల వరకు వృథా అవుతోంది.
* ఒక పశువుకు రోజుకు సగటున 35 నుంచి 40 కిలోల గ్రాసం అవసరం.
* ప్రస్తుతం 90 శాతం మంది రైతులు ఎద్దుల సాయం లేకుండానే సేద్యం చేస్తున్నారు. గతంలో ప్రతి ఇంటి ముందు పాడి గేదెలు, ఆవులు ఉండేవి. 80 శాతం మంది రైతులు పశుపోషణకు దూరమయ్యారు.
20 శాతమే వినియోగం..: జిల్లాలో వానాకాలం సీజన్లో 1.05 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేయగా, ఇందులో 80 శాతం విస్తీర్ణంలో అంటే 84 వేల ఎకరాల్లో పంటను యంత్రాల సాయంతో నూర్పిడి చేశారు. దీంతో సుమారు 1.68 లక్షల టన్నుల గ్రాసం పనికి రాకుండా పోతోంది. విపణిలో ఒక్క టన్ను గడ్డి ధర రూ.1,500. దీంతో ఒక్క వానాకాలం సీజన్లోనే సుమారు రూ.25.2 కోట్ల విలువైన గ్రాసం యంత్రాల వినియోగంతో వృథా అవుతోంది. వరి సాగుతో వచ్చే గ్రాసంలో రైతులకు 20 శాతం మాత్రమే దక్కుతోంది. పంటను కూలీలతో కలిసి నూర్పిళ్లు నిర్వహిస్తే ఒక్క గడ్డిపోచ కూడా వృథా కాకుండా మొత్తం వినియోగంలోకి వచ్చేది. పశువులు ఉన్న రైతులు వినియోగించుకుంటే లేని వారు అమ్ముకున్నా ఎకరానికి రూ.3 వేల వరకు అదనపు ఆదాయం వస్తుంది. యంత్రాలతో ఆ పరిస్థితి లేకుండా పోయింది.
శాస్త్రవేత్తలకు సూచించాం : గోపాల్, జిల్లా వ్యవసాయాధికారి
యంత్రాల సాయంతో వరిపంట నూర్పిళ్లు చేయడంతో ఏటా గ్రాసం కొరత ఏర్పడుతోంది. యంత్రాల్లో మార్పులు చేసి వృథాను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని శాస్త్రవేత్తలకు గతంలో జరిగిన సమావేశాల్లో సూచించాం. త్వరలోనే యంత్రాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.