logo
Published : 03/12/2021 02:47 IST

అప్పులిస్తామంటూ జేబు ఖాళీ!

నోయిడా కేంద్రంగా నకిలీ రుణ కాల్‌సెంటర్‌
ముఠాలో 12 మంది అరెస్టు.. పరారీలో ఇద్దరు

ఈనాడు, హైదరాబాద్‌ : అక్షరాలను అటు ఇటుగా మార్చి అసలు వెబ్‌సైట్‌లను పోలిన నకిలీ వెబ్‌సైట్‌లు సృష్టించారు. వాటి ద్వారా వ్యక్తిగత రుణం కోసం ప్రయత్నిస్తున్న వారిని మోసం చేస్తున్న సైబర్‌ నేరస్తుల ముఠా గుట్టు సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు రట్టు చేశారు. 14 మంది ముఠాలో 12 మందిని అరెస్టు చేశారు. గురువారం సైబరాబాద్‌ కార్యాలయంలో సీపీ స్టీఫెన్‌ రవీంద్ర వివరాలను వెల్లడించారు.

ఈ వ్యవహారంలో కీలక సూత్రధారి అభిషేక్‌ మిశ్రా. నోయిడా సెక్టార్‌-63లో అద్దెకు ఇల్లు తీసుకుని రాజేంద్ర కుమార్‌, బ్రిజేష్‌కుమార్‌తో కలసి నకిలీ కాల్‌ సెంటర్‌ ప్రారంభించాడు. టెలీకాలర్లను నియమించారు. దిలీప్‌కుమార్‌ అనే వ్యక్తి రుణ దరఖాస్తులను స్వీకరించేందుకు వెబ్‌సైట్లను రూపొందించాడు. టీమ్‌ లీడర్‌గా పనిచేసే హేమలత టెలీకాలర్లకు శిక్షణనిస్తుంది. వ్యక్తిగత రుణాల కోసం అంతర్జాలంలో వెతికే వారు వివిధ వెబ్‌సైట్లలో తమ వివరాలను నమోదు చేసుకుంటారు. సైబర్‌ ముఠా రూపొందించిన ధని లోన్‌బజార్‌, ది లోన్‌ ఇండియా, పైసా లోన్‌ హబ్‌, ముద్ర లోన్‌ ఫైనాన్స్‌ వెబ్‌సైట్లనూ ఆశ్రయించేవారు. ఆయా వెబ్‌సైట్ల ద్వారా దరఖాస్తుదారుల వివరాలు సేకరించి వారి ఫోన్‌నెంబర్లకు వాట్సాప్‌తో లావాదేవీలు నిర్వహించేవారు. రుణం కావాల్సిన వారి నుంచి ఆధార్‌, పాన్‌కార్డులు, పే స్లిప్‌ తదితర వివరాలు సేకరించేవారు. కొద్దిరోజులకు రూ.5లక్షల రుణం ఇచ్చేందుకు అర్హత సాధించినట్టు సంబధితుల ఈ-మెయిల్‌కు లోన్‌ అప్రూవల్‌ లెటర్‌ పంపేవారు. అవతలివారికి పూర్తిగా నమ్మకం కలిగినట్టు నిర్దారించుకున్నాక టెలీకాలర్లను రంగంలోకి దింపేవారు. రూ.5లక్షల నుంచి రూ.10లక్షలకు రుణ స్థాయి పెంచుతామంటూ ఊరించేవారు. దరఖాస్తులు, జీఎస్‌టీ, ప్రాసెసింగ్‌ ఫీజు తదితర పేర్లతో దఫాల వారీగా దరఖాస్తుదారుల నుంచి డబ్బు తమ ఖాతాల్లో జమచేయించుకునేవారు. అలా నగదు చేరగానే నితిన్‌కుమార్‌ విత్‌డ్రా చేసేవాడు. టెలీకాలర్లకు జీతాలు, భాగస్వాములు వాటాలు వేసుకుని పంచుకునేవారు.

27 కేసులు.. ముఠాపై ఇప్పటి వరకు 27 కేసులు నమోదయ్యాయి. అక్టోబరు 17న నగరానికి చెందిన ఓ బాధితుడు రూ.5లక్షల రుణం కోసం వివిధ ఛార్జీలుగా రూ.2,17,366 జమ చేసినట్టు సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించి.. ముఠాలోని రాజేంద్రకుమార్‌, బ్రిజేష్‌కుమార్‌ ఠాకూర్‌, ఆకాశ్‌భాటి, నితిన్‌కుమార్‌, హేమలత, హేమంత్‌ రావత్‌, రాధికా యాదవ్‌, సాధనాకుమారి, సరస్వతి హల్దార్‌, కాజల్‌ సింగ్‌, నిషా వరుణ్‌, కాంచన్‌ సింగ్‌, పుతాన్‌లను అరెస్ట్‌ చేశారు. ల్యాప్‌ట్యాప్‌లు 3, స్మార్ట్‌ఫోన్లు 17, బేసిక్‌ పోన్లు 20, సిమ్‌కార్డులు 5, ఏటీఎం కార్డులు 3 స్వాధీనం చేసుకున్నారు.  సూత్రదారి అభిషేక్‌ మిశ్రా, దిలీప్‌కుమార్‌ పరారీలో ఉన్నారు. సమావేశంలో డీసీపీలు రోహిణి ప్రియదర్శిని, లావణ్య, సైబర్‌క్రైమ్‌ ఏసీపీ జి.శ్రీధర్‌, ఇన్‌స్పెక్టర్లు డి.ఆశిష్‌రెడ్డి, పి.నరేష్‌, ఎస్‌ఐలు బి.సతీష్‌, సాయిప్రసాద్‌, హెడ్‌కానిస్టేబుల్‌ మహిపాల్‌రెడ్డి, కానిస్టేబుళ్లు ఫయూమ్‌మియా, లక్ష్మారావు, నరేందర్‌, రాములు, కొమురయ్య, నాగరాజు, ఎన్‌.రాజ్‌కుమార్‌, మహిళా కానిస్టేబుల్‌ మౌనిక పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని