Crime News: అక్రమాల బాటలో ఆలుమగల తప్పటడుగులు
ఈనాడు, హైదరాబాద్
అతడి పేరు భాస్కర్ ఫైనాన్స్ సంస్థల నుంచి అప్పులు తీసుకుని ఆటోలు కొన్నాడు. నిర్వహణ లోపంతో వాయిదాలు చెల్లించలేక అప్పులపాలయ్యాడు. ముగ్గురు పిల్లల పోషణ కష్టమైంది. ఇన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు తన ఖాతా ఉన్న బ్యాంకులో చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. సీసీ కెమెరాల పనితీరుపై అవగాహన ఉండటంతో ఏమార్చవచ్చనే అంచనాకు వచ్చాడు. భార్య భవానితో కలసి అర్ధరాత్రి దాటాక బ్యాంకులో చోరీ చేసేందుకు వెళ్లారు. ప్రయత్నం ఫలించక ఇంటికి చేరారు. సీసీ ఫుటేజ్ పరిశీలించిన రాయదుర్గం పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు.
శిల్పాచౌదరి, శ్రీనివాస్ ప్రసాద్ దంపతులు. ప్రముఖులతో స్నేహాలు. సినీ, స్థిరాస్తి వ్యాపారం. సమాజంలో గుర్తింపు ఉన్న కుటుంబం. అవతలి వారి బలహీనతను సొమ్ము చేసుకోవాలనే ఆలోచనతో కిట్టీపార్టీల ఏర్పాటు చేశారు. సంపన్న వర్గాలకు చెందిన మహిళలకు డబ్బు ఆశచూపి వ్యాపారం చేద్దామంటూ ముగ్గులోకి లాగారు. భార్యాభర్తల ఆర్భాటం చూసిన మహిళలు అప్పులు చేసి, నగలు తాకట్టుపెట్టి మరీ అడిగినంత వారి చేతికిచ్చారు. చివరకు మోసపోయినట్టు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిలాడీ దంపతులను అరెస్ట్ చేయించారు.
భార్యాభర్తలిద్దరిలో ఏ ఒక్కరు తప్పుచేసినా మరొకరు సన్మార్గంలో తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తారు. ఆ ప్రభావం కడుపున పుట్టిన బిడ్డలపై పడుతుందనే కలవరపాటుకు గురవుతారు. ఇందుకు భిన్నంగా.. చిన్న దొంగతనాల నుంచి.. పెద్ద కుంభకోణాల వరకూ ఆలుమగలు కలిసే తప్పుటడుగులు వేస్తున్నారు. ఒకర్నిమించి మరొకరు ప్రణాళికలు రచిస్తూ నేరాల బాట పడుతున్నారు. తేలికమార్గంలో కాసులు కూడబెట్టాలనే యావతో కొందరు హద్దుమీరుతున్నారు. పిల్లలనూ తమ తప్పిదాల్లో భాగస్వామ్యం చేస్తున్నారు. ఇటీవల వెలుగుచూస్తున్న ఘటనల్లో ఆలుమగలు.. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు కలిసే నేరాలు చేయటం పోలీసులకూ విస్మయాన్ని కలిగిస్తుంది. ఉప్పల్‌కు చెందిన దంపతులు నకిలీ పత్రాలతో ఏకంగా బ్యాంకులను బురిడీ కొట్టించి రూ.కోటికి పైగా రుణం పొందారు.
మంచోళ్లనుకుంటే.. ముంచేశారు
దిల్‌సుఖ్‌నగర్‌లో 10 ఏళ్లుగా ఉంటున్న దంపతులు స్థానికులకు బాగా పరిచయస్తులు. ఎవరికి ఏ అవసరమొచ్చినా ఆర్థిక సాయం చేసేవారు. ఫైనాన్స్ సంస్థ స్థాపించి తక్కువ వడ్డీకి అప్పులిచ్చేవారు. క్రమంగా చిట్టీల వ్యాపారం ప్రారంభించి.. రూ.20 కోట్ల వరకూ సేకరించారు. రాత్రికి రాత్రే సామాను సర్దుకుని ఉడాయించారు. నాలుగేళ్ల క్రితం హైటెక్ పద్ధతిలో యూపీఎస్సీ మెయిన్స్ పరీక్ష రాస్తున్న భర్తకు సాంకేతిక సాయంతో సహకరించిందో భార్య. ఇన్విజిలేటర్లకు అనుమానం వచ్చి పరిశీలించగా మోసం వెలుగుచూసింది. ఇద్దరూ ఉన్నత విద్యావంతులు. పరీక్షరాసే యువకుడు అప్పటికే ఐపీఎస్ శిక్షణలో ఉండటం విశేషం. దుకాణాలు, చిట్టీపాటలు, ఫైనాన్స్, తాకట్టు వంటి వ్యాపారాలను నిర్వహిస్తూ వారిపై ఉన్న సానుకూలతను అవకాశంగా మలచుకుని మోసాలకు తెగబడుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.