logo

ఆర్థిక సాయం... అన్నదాతకు ప్రయోజనం

సాధారణంగా అందరి దగ్గర డెబిట్‌ కార్డు ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు, ఆర్థిక పరపతి ఉన్నవారికి బ్యాంకులు ముందస్తుగా ఖర్చుచేసుకుని తరువాత చెల్లించే వెసులుబాటు కల్పిస్తూ ‘క్రెడిట్‌ కార్డు’లను

Published : 05 Dec 2021 00:36 IST

అండగా నిలిచే ‘కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు’

న్యూస్‌టుడే, వికారాబాద్‌

సాధారణంగా అందరి దగ్గర డెబిట్‌ కార్డు ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు, ఆర్థిక పరపతి ఉన్నవారికి బ్యాంకులు ముందస్తుగా ఖర్చుచేసుకుని తరువాత చెల్లించే వెసులుబాటు కల్పిస్తూ ‘క్రెడిట్‌ కార్డు’లను మంజూరు చేస్తున్నాయి. ఇదే తరహాలో రైతుకు కూడా అవసరానికి ఉపయోగపడేలా కేంద్రం ‘కిసాన్‌ క్రెడిట్‌ కార్డు’ (కెసిసి)ను గతంలోనే ప్రవేశపెట్టింది. దీని గురించి సరైన అవగాహన లేక అధిక శాతం సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. ఈ విషయాన్ని గ్రహించి కార్డు మార్గదరకాలను, ప్రయోజనాలపై విస్తృత అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక మీదట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందే సాయాన్ని లబ్ధిదారుడు ఎప్పుడైనా పొందేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ‘న్యూస్‌టుడే’ కథనం.

అవసరమున్నప్పుడు తీసుకునేలా..

కేంద్రం కిసాన్‌ సమ్మాన్‌నిధి కింద ఏటా మూడుసార్లు రూ.2 వేల చొప్పున అర్హత ఉన్న ప్రతి రైతుకు ఆర్థిక సాయమందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుబంధు కింద ఎకరానికి రూ.5 వేల చొప్పున ఇస్తోంది. ఏడాదికి రెండుసార్లు ఈ మొత్తం బ్యాంకుల ద్వారా చేతికందుతోంది. ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం కూడా మంజూరవుతోంది. దీనినీ బ్యాంకు నుంచే చెల్లిస్తున్నారు. అయితే రైతు తనకు అవసరమున్నప్పుడే నగదు తీసుకొని వాడుకునేలా 1998లోనే ‘కిసాన్‌ క్రెడిట్‌ కార్డు’లను ప్రవేశపెట్టింది. ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల కొనుగోలుకు ముందస్తుగా తీసుకునేందుకు వారికున్న పరిమితి మేర ఈ కార్డు చెల్లుబాటయ్యే వీలు కల్పించారు.

ఇప్పటికి 50 వేల మందికి జారీ

జిల్లాలో మొత్తం 2.39 లక్షల మంది రైతులున్నారు. ఇందులో అన్ని అర్హతలుండి వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా 1.9 లక్షల మంది ప్రయోజనాలు పొందుతున్నారు. ఈ పాటికే 50 వేల వరకు రూపే కార్డులు, కేసీసీ కార్డులను పంపిణీ చేశారు. ఇంకా సుమారు 1.5 లక్షల మంది రైతులకు ఇచ్చేందుకు బ్యాంకులు సన్నద్ధమవుతున్నాయి. అన్ని జాతీయ, వాణిజ్య, ప్రైవేటు, గ్రామీణ, సహకార బ్యాంకులు క్రెడిట్‌ కార్డులను అందించేలా యంత్రాంగం చర్యలు చేపడుతోంది. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ ప్రయోజనాలు వర్తించే వారికి మొదటి ప్రాధాన్యం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

ఐదేళ్ల కాలపరిమితి..

భూమి ఉండి 18 నుంచి 70 ఏళ్ల వయసు ఉన్న రైతులు ఈ కార్డు పొందే వీలుంది. తమ దగ్గరలో ఖాతా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకును సంప్రదించొచ్ఛు ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపుకార్డుతో పాటు (ఆధార్‌, ఓటరు, డ్రైవింగ్‌ లైసెన్సు.. తదితర ఏదైనా) భూమి పాసుపుస్తకాన్ని తీసుకెళ్లి బ్యాంకులో దరఖాస్తు చేసుకోవాలి. మీ సేవ కేంద్రాల్లోనూ కిసాన్‌ క్రెడిట్‌ కార్డు దరఖాస్తు పత్రాలు పొందొచ్ఛు వివరాలన్నీ సరిచూసుకుని సంబంధిత బ్యాంకులు ఐదేళ్ల కాల పరిమితితో కూడిన ఈ కార్డులను మంజూరు చేస్తాయి. వ్యక్తిగత రహస్య కోడ్‌ను అందిస్తారు.

అధిక వడ్డీ బాధలు ఉండవు: గోపాల్‌, జిల్లా వ్యవసాయాధికారి

రైతులకు పంట సాయం సకాలంలో చేతికందని పరిస్థితుల్లో కేసీసీ ఎంతో ఉపయోగపడుతుంది. ప్రైవేటు వ్యాపారుల దగ్గర అధిక వడ్డీకి అప్పు తెచ్చుకునే పరిస్థితి రాకుండా ఉంటుంది. అర్హత ఉన్న రైతులందరికీ దశల వారీగా ఈ కార్డులు చేరేలా చూస్తాం. బ్యాంకు అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షించి పంపిణీ ప్రక్రియ వేగవంతం చేస్తాం. ఇప్పటికే లబ్ధిదారుల జాబితా ఆయా బ్యాంకులకు చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు