logo

నెట్టింట పిలుపు.. నట్టింట పనులు

నగర జీవనం అంటేనే ఉరుకులు పరుగులతో కూడుకున్నది. అలాంటిది భార్యాభర్తలు ఉద్యోగులు, వ్యాపారులు అయితే చిన్నా, చితకా పనులు చేసుకునేందుకు సమయం వెచ్చించలేని పరిస్థితి. దీన్నే వ్యాపార

Published : 05 Dec 2021 01:50 IST

ఇల్లు శుభ్రం మొదలు పలు రకాల సేవలు

ఐటీకారిడార్‌లో పెరుగుతున్న ఆదరణ

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌

నగర జీవనం అంటేనే ఉరుకులు పరుగులతో కూడుకున్నది. అలాంటిది భార్యాభర్తలు ఉద్యోగులు, వ్యాపారులు అయితే చిన్నా, చితకా పనులు చేసుకునేందుకు సమయం వెచ్చించలేని పరిస్థితి. దీన్నే వ్యాపార మార్గంగా మలచుకుంటున్న అనేక సంస్థలు క్రమంగా తమ సేవలను విస్తరిస్తున్నాయి. మీట నొక్కగానే మేమున్నామంటూ ఇంటికి వచ్చి కావాల్సిన పనులు చేస్తున్నాయి. దీంతో సెలవు రోజుల్లో కుటుంబంతో మాత్రమే గడిపేలా పలువురు ఇలాంటి యాప్‌ ఆధారిత సంస్థలను ఆశ్రయిస్తున్నారు. ఉదయం పాలు వేసే దగ్గర నుంచి క్షవరం, లాండ్రీ, ఇల్లు శుభ్రం చేసుకోవడం, దుస్తులు కుట్టడం వంటి వాటికి ఇంటి ముంగిట వాలిపోతున్నారు.


ఆన్‌లైన్‌ దర్జీలు..

పురుషులకు అవసరమైన సూట్‌లు, మహిళల, చిన్నారుల దుస్తులు, మగ్గం వర్క్‌తో పాటు ఇతర డిజైన్లను ప్రత్యేకంగా చేయించాలనుకునేవారు ఈ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. అపాయింట్‌మెంట్‌ బుక్‌ చేసుకుంటే సంస్థ ప్రతినిధి షెడ్యూల్‌ సమయంలో వచ్చి కొలతలు తీసుకుంటారు. అనంతరం డిజైనర్‌ వీడియో లేదా ఆడియోకాల్‌లో మాట్లాడి నచ్చిన విధంగా దుస్తులను కుట్టి డెలివరీ చేస్తారు. మార్పులు, చేర్పులు అవసరమైతే మరోసారి తీసుకెళ్లి రీడెలివరీ చేస్తారు. క్లౌడ్‌ టేలర్‌, టేలర్‌మోబ్‌, టేలర్‌జంక్షన్‌ తదితర సంస్థలు అందుబాటులో ఉన్నాయి. రూ.650 నుంచి మొదలుకొని లక్షలాది రూపాయల విలువైన దుస్తులకు ఆర్డర్లు ఇస్తున్నారు.

ఉపాధి పొందుతున్న వారు: 2వేలు


లాండ్రీయాప్‌..

వినియోగదారు నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చిన వెంటనే సిబ్బంది ఇంటికొచ్చి దుస్తులు తీసుకెళ్తారు. ప్రతిదానికీ ఓ ట్యాగ్‌ తగిలిస్తారు. ఆ దుస్తుల్ని ఎలా ఉతకాలో ఆ ట్యాగ్‌ వివరిస్తుంది. దీంతో ఒకరివి మరొకరికి మారడం ఉండదు. ఖరీదైన దుస్తులు పాడైపోతాయన్న దిగులు ఉండదు. వీటిని వివిధ రకాలుగా విభజించి ఉతికి, వాటిని ఇస్త్రీ చేసి ఇంటికి చేరుస్తారు. ఇదీ లాండ్రీయాప్‌లు పని తీరు. కొన్ని సంస్థలు 1.5కేజీల బరువు ఉంటే రూ.400, 4.5 కేజీలు ఉంటే రూ.300 చెల్లించేలా ప్రత్యేక ప్యాకేజీలు అందిస్తున్నాయి. నగరంలో 6లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉండగా..ఇందులో 1.80లక్షల మంది ఈ సేవలను పొందుతున్నారు. వీటితోపాటు హోటళ్లు, లాడ్జీలు, వీటి సేవలను ఉపయోగించుకుంటున్నాయి. హెలోవాష్‌, ది లాండ్రీ బాస్కెట్‌, పర్ల్‌ వాష్‌ లాండ్రీ, వాష్‌హబ్‌ ఆన్‌లైన్‌ తదితర సంస్థలు అందుబాటులో ఉన్నాయి.

ఉపాధి పొందుతున్న వారు: 7వేలు


సౌందర్యానికి మెరుగులు

బ్యూటీ సర్వీసెస్‌, హోమ్‌ సెలూన్‌, అర్బన్‌ క్లాప్‌ వంటి పేర్లతో అనేక సంస్థలు ఈ సేవలను అందిస్తున్నాయి. మహిళలు బ్యూటీపార్లర్‌కు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి వీటిని పొందుతున్నారు. హెయిర్‌ కేర్‌తోపాటు స్టైలింగ్‌, ఫేషియల్‌, క్లీనప్‌, బ్లీచ్‌, మేకప్‌ తదితర సేవలున్నాయి. పురుషులకు హెయిర్‌ కట్‌, క్లీనింగ్‌, ఫేస్‌బ్లీచ్‌ తదితర సేవలు అందిస్తున్నారు. యాప్‌లో బుక్‌ చేయగానే ఇంటికొచ్చిన ప్రతినిధి రేటింగ్‌, చేసే పని ఆధారంగా నిముషానికి రూ.6 నుంచి రూ.15 వరకు ఛార్జీ చేస్తున్నాయి. మరికొన్ని సంస్థలు హెయిర్‌స్టైల్‌ ఆధారంగా రూ.200 నుంచి రూ.2,500 వరకు వసూలు చేస్తున్నాయి.

ఉపాధి పొందుతున్న వారు: 2వేలు


వారే ఊడుస్తారు..

ఇంటిని శుభ్రం చేయడం ఇప్పుడు అత్యంత డిమాండ్‌ ఉన్న సేవల్లో ఒకటిగా మారింది. నగరంలో చాలా కాలం నుంచి ఈ సేవలను అనేక సంస్థలు అందిస్తున్నాయి. డీప్‌ క్లీనింగ్‌, కిచెన్‌ క్లీనింగ్‌ను ఎక్కువ మంది నగరవాసులు కోరుకుంటున్నారు. విదేశాల్లో ఉంటున్నవారు, కొవిడ్‌తో నగరం వదిలి సొంత ఊళ్లకు వెళ్లినవారు ఇళ్లను శుభ్రం చేయాలని కోరుతున్నారు. ముఖ్యంగా మాదాపూర్‌, కొండాపూర్‌, ఖాజాగూడ, గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, కోకాపేట, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో ఈ సేవలకు డిమాండ్‌ ఉంది. ఐటీ ఉద్యోగులు, ఆకాశహర్మ్యాల్లోని ఫ్లాట్లు, విల్లాల నుంచి ఎక్కువగా బుకింగ్‌ వస్తున్నాయని ఆయా సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు.

ఉపాధి పొందుతున్న వారు: 5వేలు


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని