logo

ఊపుతెచ్చిన ఉప్పల్‌ భగాయత్‌

మూడో దశ ఈ-వేలంలో ఉప్పల్‌ భగాయత్‌ భూములకు ఊహించని విధంగా భారీ ధర పలకడం హైదరాబాద్‌ మహానగర అభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ)కు ఊపునిచ్చింది. అంచనాకు మించి అదనంగా తొలిసారి రికార్డు స్థాయి పాటొచ్చింది.

Updated : 06 Dec 2021 11:18 IST

మరిన్ని లేఅవుట్ల విక్రయానికి సిద్ధమవుతున్న హెచ్‌ఎండీఏ!  

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: మూడో దశ ఈ-వేలంలో ఉప్పల్‌ భగాయత్‌ భూములకు ఊహించని విధంగా భారీ ధర పలకడం హైదరాబాద్‌ మహానగర అభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ)కు ఊపునిచ్చింది. అంచనాకు మించి అదనంగా తొలిసారి రికార్డు స్థాయి పాటొచ్చింది. మూసీ సమీప ప్లాట్లపై తొలుత కొనుగోలుదారుల్లో కాస్త సంశయం కనిపించినా.. ఆవైపు ఉన్న ప్లాట్లే ఏకంగా చదరపు గజానికి రూ.1.01 లక్ష పలికి రికార్డు సృష్టించాయి. మూడో దశలో అభివృద్ధి చేసినవి; ఒకటి, రెండు దశల్లో మిగిలిన 44 ప్లాట్లు వేలం వేయగా అందులో 39 ప్లాట్లు అమ్ముడుపోయి రూ.474.61 కోట్లు హెచ్‌ఎండీఏ ఖజానాలోకి చేరాయి. మిగిలిన 50,000 చదరపు గజాల భూమిని ఈ రెండు నెలల్లో అమ్మేందుకు యోచిస్తున్నారు. ఇదే ఊపులో మహానగర వ్యాప్తంగా మరిన్ని లేఅవుట్లకు వేలం వేద్దామని పలువురు ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు సమాచారం.

ఆక్రమణలు ఆపి.. ఖజానా నింపి!

హెచ్‌ఎండీఏకు రాజధాని చుట్టుపక్కల దాదాపు 8,200 ఎకరాల భూ బ్యాంకు ఉంది. ఇప్పటికే 3,886 ఎకరాల భూమిని అభివృద్ధి చేస్తోంది. అత్యధికంగా 3,553 ఎకరాలు రంగారెడ్డి జిల్లాలో ఉండగా 211 ఎకరాలు హైదరాబాద్‌లో, 121 ఎకరాలు మెదక్‌ జిల్లాలో విస్తరించి ఉన్నాయి. కోకాపేటలో 200 ఎకరాలు విక్రయిస్తే రూ.5 వేల కోట్లు సమకూరుతాయని అంచనా వేస్తే కేవలం 49.949 ఎకరాలతోనే రూ.2 వేల కోట్లు సమీకరించారు. తెల్లాపూర్‌లో 200 ఎకరాలు, మియాపూర్‌లో 50, మోకిలాలో 40 ఎకరాలు, మూసాపేటలో కొంత.. ఇలా పలు చోట్ల భూములున్నాయి. వీటిలో కొన్ని అన్యాక్రాంతమవుతున్నాయి. కొంత భూమిని అభివృద్ధి చేసి వేలం వేస్తే అన్యాక్రాంతానికి అడ్డుకట్ట పడడంతోపాటు ఖజానా నిండుతుందని యోచిస్తున్నట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లాలో పలు భూములపై వివాదాలు ఉండడంతో పరిష్కారానికి ప్రత్యేకాధికారులు రోజూ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.


భూముల ధరకు రెక్కలు!

ప్పల్‌ భగాయత్‌ భూముల్లో మొదటి, రెండో దశల్లో గరిష్ఠంగా చదరపు గజానికి రూ.79 వేలు పలకగా.. ఈ ఏడాది అనూహ్యంగా రూ.లక్ష దాటింది. 2018లో నిర్వహించిన వేలంలో చ.గజం కనీస ధర రూ.20 వేలు నిర్ణయించగా.. అత్యధికంగా అత్తాపూర్‌లో రూ.1.53 లక్షలు పలికింది. ఆ తర్వాత మాదాపూర్‌లో గజం రూ.1.52 లక్షలు, షేక్‌పేట్‌లో రూ.1.20 లక్షలు కోట్‌ చేశారు. కొవిడ్‌ తర్వాత ఈ రంగానికి నష్టమొస్తుందని భావిస్తే, ఆ తర్వాత వేలం వేసిన కోకాపేట భూముల్లో ఎకరానికి రూ.60.20 కోట్లు పలకగా.. గత రెండు రోజుల్లో ఉప్పల్‌లో అనూహ్య రీతిలో 84,966 చదరపు గజాలకు ఏకంగా రూ.474.61 కోట్లు తెచ్చిపెట్టింది. 222 గజాలు, 386 గజాలున్న ఓ రెండు ప్లాట్లలో చ.గజానికి రూ.1.01 లక్ష పలకగా అది ఇక్కడి భూముల ధరల్ని నిర్దేశించే స్థాయికి చేరిందనే చర్చ జరుగుతోంది. మొదటి దశలో సగటున ఓ ప్లాటు రూ.51 వేలు పలకగా రెండో దశలో రూ.52,800, మూడో దశలో రూ.55,859 పలికింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని