logo

వేధిస్తే.. తాటతీస్తాం!

పోకిరీల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. యువతులు, విద్యార్థినులు, మహిళలను ఏవిధమైన ఇబ్బందులకు గురిచేసినా.. మనోవేదన కలిగించినా పోకిరీలు.. ఈవ్‌టీజర్ల తాటతీస్తున్నారు పోలీసులు.

Updated : 06 Dec 2021 14:03 IST
యువతుల ఫిర్యాదుల ఆధారంగా పోకిరీలపై కేసులు
తీవ్రత పెరిగితే జైలు.. మారకుంటే పీడీ యాక్ట్‌
ఈనాడు, హైదరాబాద్‌: పోకిరీల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. యువతులు, విద్యార్థినులు, మహిళలను ఏవిధమైన ఇబ్బందులకు గురిచేసినా.. మనోవేదన కలిగించినా పోకిరీలు.. ఈవ్‌టీజర్ల తాటతీస్తున్నారు పోలీసులు. పలు కేసుల్లో బాధితులు, వారి పరిచయస్తులు, బంధువులు, మిత్రుల మెయిల్‌ ఐడీ, ఫేస్‌బుక్‌ ఖాతాల వివరాలు తెలుసుకుంటున్న అపరిచితులు వారిని పదేపదే వేధించడంతో పాటు అశ్లీల దృశ్యాలు పంపించి వారి పరువుకు భంగం కలిగించేలా ప్రవరిస్తున్నారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో మూడు నెలల్లో ఇటువంటి కేసులు 63 నమోదయ్యాయి. సామాజిక మాధ్యమాలు, ఫోన్ల ద్వారా తీవ్ర ఇబ్బందులు పడుతున్న బాధితుల ఆవేదనను పరిగణనలోకి తీసుకున్న ‘షి’ బృందం... పోకిరీలు, ఈవ్‌టీజర్లపై నిర్భయ, ఐటీ చట్టాల కింద కేసులు నమోదు చేస్తున్నారు. ప్రారంభ దశలోనే తమకు ఫిర్యాదు చేస్తే నిందితులను జైలుకు పంపించడంతో పాటు మరోసారి వేధించకుండా చర్యలు తీసుకుంటామంటూ అభయమిస్తున్నారు.

ఒక్కసారి పట్టుబడినా కటకటాలకే

బాధితులను వేధిస్తున్న పోకిరీలు, ఈవ్‌టీజర్లు ఒక్కసారి పట్టుబడినా పోలీసులు వారిని జైలుకు పంపుతున్నారు. సెల్‌ఫోన్‌ రికార్డులు, ఫేస్‌బుక్‌, ట్విటర్‌, వాట్సాప్‌లలో వారి వివరాలుండటంతో వాటిని సాంకేతిక ఆధారాలుగా పరిగణిస్తున్నారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఈ రెండు నెలల్లో 45 రికార్డులను సేకరించారు. వీటి సాయంతో నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నారు. ఐటీ చట్టంలోని 66, 67 సెక్షన్లను ఆ కేసులకు జోడిస్తున్నారు. తీవ్రత ఉన్న ప్రతి కేసులో ఐపీసీ 509, 506 సెక్షన్లను అదనంగా జతచేసి జైలుకు పంపుతున్నారు.

ఖాతాలు సంగ్రహించి..

కొన్ని కళాశాలలు ఇంకా ఆన్‌లైన్‌ ద్వారా బోధన కొనసాగిస్తుండటంతో కొందరు విద్యార్థులు సహ విద్యార్థినులతో పరిచయం పెంచుకొని ప్రేమిస్తున్నాం అంటూ కొందరు చెబుతున్నారు. వారి ప్రతిపాదనను తిరస్కరించగానే వేధింపులు ప్రారంభిస్తున్నారు. ఇక ప్రైవేటు కంపెనీలు, సంస్థల్లో పనిచేస్తున్న యువతులు.. నేరస్థుల స్వభావాన్ని గ్రహించక స్నేహితులన్న భావనతో వారితో కలిసి బయటకు వెళ్తున్నారు. సరిగ్గా వీటిని నేరస్థులు అవకాశాలుగా మార్చుకుంటున్నారు. ఆ ఫొటోలను మార్ఫింగ్‌ చేసి ఫేఫస్‌బుక్‌లో ఉంచుతున్నారు. వేధింపులు మొదలుపెడుతున్నారు. ఇంతేకాదు.. సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో పనిచేస్తున్న యువతులను లక్ష్యంగా చేసుకొని వారిని ఫోన్లలో వెంటాడుతున్నారు. ‘షి’ బృందాలకు వస్తున్న ఫిర్యాదుల్లో 70 శాతం మంది బాధితులకు ఫోన్‌ వేధింపులే ఉంటున్నాయి.

ధైర్యంగా ముందుకు రండి..- శిఖా గోయల్‌, అదనపు డీజీపీ

వేధింపులు ఎదుర్కొంటున్న యువతులు, విద్యార్థినులు మౌనంగా ఉండొద్ధు మీ ఫిర్యాదుకు చాలా శక్తి ఉంది. పోకిరీలు పదేపదే వేధిస్తే జైలుకు పంపుతాం. బయటకు వచ్చాక కూడా మళ్లీ వేధిస్తే పీడీ చట్టం ప్రయోగిస్తున్నాం. ఈ ఏడాది ఇద్దరిపై పీడీ చట్టం ప్రయోగించాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని