Shilpa Chowdary: ఆస్పత్రి ఎక్కడ? రూ.కోట్ల జాడెక్కడ?

అధిక వడ్డీలు, స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడిన గండిపేట్‌ సిగ్నేచర్‌ విల్లాస్‌కు చెందిన శిల్పాచౌదరి కేసు పోలీసులకు సవాలుగా మారింది. బాధితుల నుంచి ఫిర్యాదులు అందగానే రంగంలోకి దిగే పోలీసులు

Updated : 06 Dec 2021 13:38 IST

ఫోన్‌కాల్‌ జాబితా ఆధారంగా పోలీసుల కూపీ

పలువురికి నోటీసులు జారీ

ఈనాడు, హైదరాబాద్‌: అధిక వడ్డీలు, స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడిన గండిపేట్‌ సిగ్నేచర్‌ విల్లాస్‌కు చెందిన శిల్పాచౌదరి కేసు పోలీసులకు సవాలుగా మారింది. బాధితుల నుంచి ఫిర్యాదులు అందగానే రంగంలోకి దిగే పోలీసులు ఈ కేసులో జాప్యం చేశారనే ఆరోపణలున్నాయి. శిల్పాచౌదరి తన వద్ద రూ.1.50 కోట్లు అప్పు తీసుకుని తిరిగి అడిగితే బెదిరిస్తున్నట్టు నవంబరు 13న దివ్యారెడ్డి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే నెల 26న శిల్పాచౌదరి దంపతులను అరెస్ట్‌ చేసి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు, ఆధారాల సేకరణకు సమయం ఎక్కువ తీసుకున్నారనే ప్రశ్నకు పోలీసుల నుంచి సమాధానం కరవైంది. ఆమెను రెండ్రోజుల కస్టడీకి తీసుకున్నా పూర్తి ఆధారాలు సేకరించలేకపోయారు. నిందితురాలి రెండు చరవాణుల్లో లభించిన ఫోన్‌ నంబర్ల ఆధారంగా సమాచారం సేకరిస్తున్నారు. బాధితుల జాబితాలో ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల కుటుంబాలకు చెందిన వారున్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాకపోవటంతో సోమవారం పోలీసుల ఎదుట హాజరు కావాలంటూ కొందరికి నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.

ఆసుపత్రి ఎక్కడ.. కోట్ల జాడెక్కడ...

శిల్ప పక్కా పథకం ప్రకారమే మోసాలకు పాల్పడినట్టు పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రముఖ నటుడు మహేష్‌బాబు సోదరి ప్రియదర్శిని వద్ద తీసుకున్న రూ.2.90 కోట్లకు చెల్లని చెక్కులు, నకిలీ బంగారు ఆభరణాలను ఇచ్చినట్టు ఫిర్యాదు చేశారు. చెక్‌లను మార్చుకునేందుకు ప్రయత్నించినపుడు సంబంధిత బ్యాంకు ఖాతా ఎప్పుడో రద్దయినట్టు బ్యాంకు అధికారులు చెప్పారు. అప్పటికి కానీ తాను మోసపోయినట్టు గ్రహించలేకపోయానంటూ ప్రియదర్శిని ఫిర్యాదులో పేర్కొన్నారు. శిల్పాచౌదరి బ్యాంకు ఖాతాల్లో రూ.వేలల్లో మాత్రమే నగదు నిల్వలున్నాయి. బాధితులు ఒక్కొకరు రూ.కోట్లలో ఇచ్చినట్టు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇంత పెద్దమొత్తంలో సొమ్ము చేతులు మారేటపుడు ఆదాయపన్ను శాఖ గుర్తించే వీలుంది. ఈ కేసులో మాత్రం బ్యాంకు ద్వారా ఆర్ధిక లావాదేవీలు జరిగినట్టు ఆధారాలు లభించలేదని సమాచారం. నిందితురాలు చెప్పినట్టు ఆసుపత్రి నిర్మాణం ఎక్కడ చేపట్టారు. ఎక్కడ భూములు కొనుగోలు చేశారనేది ప్రశ్నార్థకంగా మారింది. విచారణకు హాజరయ్యేవారి ద్వారా సేకరించే ఆధారాలు ఈ కేసులో ముందుకెళ్లేందుకు కీలకం కానున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని