Crime News: తప్పిన సబ్జెక్ట్‌లు రాయడంలో ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
సాయికృష్ణ
కేపీహెచ్‌బీకాలనీ, న్యూస్‌టుడే: డిగ్రీ చదువుతూ ప్రైవేటుగా ఉద్యోగం చేస్తున్నాడు. డిగ్రీలో తప్పిన సబ్జెక్ట్‌లు రాయడంలో ఒత్తిడికి గురై కేపీహెచ్బీలో బలవన్మరణానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. సీఐ లక్ష్మీనారాయణ వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం విస్సాకోడేరు గ్రామానికి చెందిన కన్నాజీ సాయికృష్ణ మయాంక్(22) కేపీహెచ్‌బీలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. కాలనీ తొమ్మిదోఫేజ్లో తన మిత్రులు ముగ్గురితో కలిసి గది తీసుకుని ఉంటున్నాడు. వీరందరూ ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. శనివారం సాయికృష్ణ గదిలోనే ఉన్నాడు. మధ్యాహ్నం సమయంలో కళాశాల మిత్రులు డిగ్రీ తప్పిన సబ్జెక్ట్‌లు రాయటానికి రా అని సాయికృష్ణకు ఫోన్ చేయడంతో వారికి రానని చెప్పాడు. మరో మిత్రుడికి ఫోన్ చేసి తనకు రూ.2 వేలు కావాలని అడిగాడు. లేవని చెప్పడంతో సాయికృష్ణ ఫోన్ ఆపేశాడు. సాయంత్రం మిత్రుడు వచ్చి గది తలుపు తడితే స్పందన లేదు. తలుపుపై వెంటిలేటర్లో నుంచి చూడగా సాయికృష్ణ ఉరేసుకొని కనిపించాడు. తోటి మిత్రులకు విషయం చెప్పి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.