logo

కల్వర్టులకు కోత.. రాకపోకలకు వెత

జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసం అయ్యాయి. కల్వర్టుల వద్ద కోతకు గురై ప్రమాదకరంగా మారాయి. తాండూరు నుంచి మొరంగపల్లి వరకు రోడ్డును రూ.48 కోట్లతో రెండు వరుసల రహదారిగా

Published : 07 Dec 2021 01:22 IST

సల్బత్తాపూరు వాగు వద్ద దుస్థితి

 న్యూస్‌టుడే , పెద్దేముల్‌: జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసం అయ్యాయి. కల్వర్టుల వద్ద కోతకు గురై ప్రమాదకరంగా మారాయి. తాండూరు నుంచి మొరంగపల్లి వరకు రోడ్డును రూ.48 కోట్లతో రెండు వరుసల రహదారిగా మార్చారు. ఈ మార్గం 65వ జాతీయ రహదారికి అనుసంధానంగా కొనసాగుతోంది. వికారాబాద్‌ జిల్లాతోపాటు సంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలకు ఇది ప్రధాన రహదారి. నిత్యం వేల సంఖ్యలో వాహనాలు ప్రయాణించే ఈ దారిలో అనేక చోట్ల గుంతలు పడ్డాయి.
రెండు చోట్ల ప్రమాదకరం..: తాండూరు నుంచి సంగారెడ్డి వెళ్లే మార్గంలో ఓగులాపూరు పోతులవాడుక వద్ద కల్వర్టు ప్రమాదకరంగా మారింది. వర్షాలతో రోడ్డు సగభాగం కోతకు గురైంది. కింది భాగంలో మట్టి కొట్టుకుపోయి గుంత ఏర్పడింది. కొత్తగా వేసిన తారు సైతం కోతకు గురైంది. భారీ వాహనాల రాకపోకలతో రోడ్డు కిందికి దిగబడింది. వరద  ఉద్ధృతికి కల్వర్టు పైపులు బయటికి తేలాయి. ఇక సల్బత్తాపూరు సమీపంలోని వాగు వద్ద కల్వర్టు శిథిలమైంది. కింది భాగంలో గండిపడి ప్రమాదకరంగా మారింది. సిమెంటు, కంకర, మట్టి కొట్టుకుపోయి ఎప్పుడు కూలిపోతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కల్వర్టు రెండు చోట్ల ధ్వంసమై కూలిపోయే స్థితికి చేరింది.

ఓగులాపూరు సమీపంలో..

ఇదే ప్రధాన మార్గం: తాండూరు ప్రాంతంలోని సిమెంటు, నాపరాయి, సుద్ద పరిశ్రమల నుంచి లారీలు హైదరాబాద్‌, ముంబయి, పుణె పట్టణాలకు చేరుకోవడానికి ఇదే ప్రధాన మార్గం. 40 నుంచి 60 టన్నులకు పైగా సామర్థ్యమున్న లారీలు రాకపోకలు సాగిస్తున్నాయి. మొరంగపల్లి వద్ద రైల్వే వంతెన పనులు సాగడం వల్ల ఆ దారిలో వాహనాలు వెళ్లడంలేదు.  ప్రస్తుతం బంట్వారం, మర్పల్లి మార్గమే ఆధారమైంది. శిథిల కల్వర్టులతో ప్రమాదకర స్థితిలో ప్రయాణం చేయాల్సి వస్తోందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు