logo

తిలాపాపం తలా పిడికెడు

రాజధానిలో మందుబాబుల వీరంగానికి పోలీసులు నిర్లక్ష్యం ఎంతుందో రవాణా శాఖ నిర్లక్ష్యంగా కూడా అంతే ఉంది. సాధారణంగా అతిగా మద్యం తాగి వాహనాలను నడిపిన వారి లైసెన్సులు రద్దు చేయమని పోలీసులు

Published : 07 Dec 2021 02:38 IST

వాహనదారుల లైసెన్సుల రద్దులో రవాణాశాఖ జాప్యం

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: రాజధానిలో మందుబాబుల వీరంగానికి పోలీసులు నిర్లక్ష్యం ఎంతుందో రవాణా శాఖ నిర్లక్ష్యంగా కూడా అంతే ఉంది. సాధారణంగా అతిగా మద్యం తాగి వాహనాలను నడిపిన వారి లైసెన్సులు రద్దు చేయమని పోలీసులు రవాణా శాఖ అధికారులకు జాబితాను పంపిస్తున్నారు. దాని ఆధారంగా రవాణా శాఖ అధికారులు వెంటనే డ్రైవింగ్‌ లైసెన్సును మూడు నెలలపాటు రద్దు చేయాల్సిందే. ఏడాదిగా ఒక్క సైబరాబాద్‌ పరిధిలోనే మద్యం తాగి వాహనాలను నడిపిన దాదాపు 35 వేలమందిపై కేసులు నమోదు చేశారు. అలాగే హైదరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో మరో 70 వేలమందిపై కేసులు నమోదు చేశారు. వేలాది పేర్లను రవాణా శాఖకు పోలీసు అధికారులు పంపించారు. 40 వేలమంది లైసెన్సులను రద్దు చేయాల్సి ఉండగా కేవలం ఆరేడువేల మంది లైసెన్సులు మాత్రమే తాత్కాలికంగా రద్దు చేశారు.  

పబ్బులపై పట్టింపేది
మహానగరంలో చిన్నా పెద్దా పబ్బులు 150 వరకు ఉంటాయి. ఇందులో అధికశాతం వాటిలో నిబంధనలు పాటించడం లేదు. అనేకమంది యువకులు తెల్లవారుజాము వరకు తాగి స్పృహలేని స్థితిలో డ్రైవింగ్‌ సీట్లో కూర్చొని మరణాలకు కారణం అవుతున్నారు. ఇంత జరుగుతున్నా కూడా ఒక్క పబ్‌ మీద కూడా ఎక్సైజ్‌ అధికారులు చర్యలు తీసుకోలేదు. దీనికి కారణం ఒక్కో పబ్‌కు ఒక పలుకుబడి గల ప్రజాప్రతినిధి అండ ఉండటమే కారణమని చెబుతున్నారు.  

కేసులు పరిష్కారం తక్కువే!
హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించేవారి కేసులు విచారించడానికి ప్రత్యేకంగా రెండు కోర్టులు ఉన్నాయి. అదే సైబరాబాద్‌, రాచకొండలో రెగ్యులర్‌ కోర్టుల్లోనే విచారణ జరుగుతోంది. సాధారణ కేసులే చాలా అధికంగా ఉంటుండడంతో ట్రాఫిక్‌ కేసులు చాలా వరకు వాయిదా పడుతున్నాయి. గత ఏడాది మద్యం తాగి వాహనాలను నడిపిన 35 వేలమందిపై కేసులు నమోదు చేస్తే ఇప్పటి వరకు అయిదువేల కేసుల్లో మాత్రమే శిక్షపడింది.  

పబ్‌లకు నోటీసులు ఇచ్చాం
- విజయ్‌కుమార్‌, ట్రాఫిక్‌ విభాగం డీసీపీ, సైబరాబాద్‌

కమిషనరేట్‌ పరిధిలో అన్ని పబ్‌లకు ఇటీవలే నోటీసులు ఇచ్చాం. కిరాయి డ్రైవర్లు, కార్లను ఏర్పాటు చేసుకోమంటూ నోటీసుల్లో పేర్కొన్నాం. లేని పక్షంలో సంబంధిత పబ్‌ మీద వెంటనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించాం. మద్యంతాగి పట్టుబడిన వారిని వివరాలను రవాణా శాఖకు పంపిస్తున్నాం. లైసెన్సు సస్పెండ్‌ చేస్తే ఫలితం ఉంటుంది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని