logo

Crime News: వేధిస్తున్నాడని బావపై అక్కాతమ్ముడి దాడి

మద్యం మత్తులో ఇంటికి వచ్చి నిత్యం వేధిస్తున్నాడని బావ(అక్క భర్త)ను అక్క, తమ్ముడు తలపై కొట్టడంతో తీవ్ర గాయాలపాలై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. రాత్రి మొత్తం అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయం ఆసుపత్రికి

Published : 07 Dec 2021 07:25 IST

చికిత్స పొందుతూ మృతి, ఇద్దరి రిమాండ్‌

నిందితులు శ్రీను, సరోజ

బాలాపూర్‌, న్యూస్‌టుడే: మద్యం మత్తులో ఇంటికి వచ్చి నిత్యం వేధిస్తున్నాడని బావ(అక్క భర్త)ను అక్క, తమ్ముడు తలపై కొట్టడంతో తీవ్ర గాయాలపాలై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. రాత్రి మొత్తం అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయం ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మీర్‌పేట ఠాణాపరిధిలో సోమవారం వెలుగు చూసింది. ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ జిల్లా తలకొండపల్లి మండలం వెదిలిపతగుట్ట తండాకు చెందిన సాంబావత్‌ సరోజ(30), మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండలం వేములకు చెందిన జరుప్లావత్‌ శ్రీను(21) అక్కాతమ్ముళ్లు. భర్త చనిపోవడంతో సరోజ తమ్ముడితో పాటు టైల్స్‌ పనిచేసుకుంటూ మీర్‌పేట కార్పొరేషన్‌ పరిధిలో జిల్లెలగూడ సత్యసాయినగర్‌ కాలనీలో ఉంటుంది. వీరి అక్క లక్ష్మీకి ఉప్పుగూడ వినాయక్‌నగర్‌కు చెందిన కొడావత్‌ రెడ్యా(45)తో వివాహం జరిగింది. అతనూ టైల్స్‌ పనిచేస్తుంటాడు. రెడ్యా అప్పుడప్పుడు మద్యం తాగి జిల్లెలగూడలోని సరోజ ఇంటికి వచ్చి ఆమెతో వాగ్వాదానికి దిగేవాడు. ఈ నెల 2వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో రెడ్యా తాగి సరోజ ఇంటికి వెళ్లి ఆమెతో వాగ్వాదానికి దిగాడు. అక్కా తమ్ముడు అతన్ని చంపేయాలని ఇంట్లో ఉన్న రొట్టెలు చేసే పరికరంతో అతని తలపై బలంగా కొట్టారు. తీవ్ర గాయాలై అధిక రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. రాత్రి అంతా అలాగే ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం వారు హస్తినాపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులు అక్కాతమ్ముడిని ఆదివారం రాత్రి అరెస్టు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని