logo

కేంద్ర ప్రభుత్వం రుణాలిస్తోందని మోసం

కేంద్ర ప్రభుత్వం నిరుపేదలకు పూచీకత్తు లేకుండా రుణాలిస్తోందంటూ మోసాలకు పాల్పడుతున్న నిందితుడు కె.గురుప్రసాద్‌ను సీసీఎస్‌ పోలీసులు సోమవారం జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు. రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లో ప్రచారం

Published : 07 Dec 2021 02:38 IST

నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం నిరుపేదలకు పూచీకత్తు లేకుండా రుణాలిస్తోందంటూ మోసాలకు పాల్పడుతున్న నిందితుడు కె.గురుప్రసాద్‌ను సీసీఎస్‌ పోలీసులు సోమవారం జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు. రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లో ప్రచారం నిర్వహించిన గురుప్రసాద్‌ ఏడాది వ్యవధిలో రూ.2.5 కోట్లు వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కదలికలపై నిఘా ఉంచారు. తిరుపతిలో ఉన్నట్లు తెలుసుకొని ఏసీపీ కె.శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో వెళ్లి అరెస్టు చేశారు.
నమ్మించేందుకు సొంత డబ్బులిచ్చి..  నెల్లూరు జిల్లాకు చెందిన గురుప్రసాద్‌ మూడేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చాడు. నల్లకుంటలో మార్గదర్శి పూరెస్ట్‌ ఆఫ్‌ పూర్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ పేరుతో ఓ కార్యాలయాన్ని ప్రారంభించాడు. నగర శివార్లలోని మహేశ్వరం, కందుకూరు, శంషాబాద్‌ ప్రాంతాలకు వెళ్లి.. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా చెప్పుకున్నాడు. రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ కేంద్ర ప్రభుత్వం వంద శాతం రాయితీతో రుణాలిస్తుందని ప్రచారం చేసుకున్నాడు. బాధితులను నమ్మించేందుకు తన సొంత డబ్బును కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రుణంగా ఇచ్చాడు. తర్వాత రుణం పొందేందుకు రుసుం ఇవ్వాలంటూ రూ.వేలు, రూ.లక్షలు వసూలు చేశాడు. అలా ఏడాదిన్నర వ్యవధిలో రూ.2.5 కోట్లు వసూలు చేసి, గతేడాది డిసెంబరులో కార్యాలయాన్ని మూసేసి పరారయ్యాడు. బాధితులు నాలుగైదు నెలలు అతడి కోసం వెతికినా ఫలితం లేకపోవడంతో సీసీఎస్‌ పోలీసులను ఆశ్రయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని