logo

ఉన్నతికి నోచని బాలకేంద్రం

జిల్లా కేంద్రంలో 1979లో బాల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడే చాలా మంది నృత్యం, తబలా, చిత్రలేఖనం నేర్చుకుని ఆయా రంగాల్లో ప్రావీణ్యం సాధించారు. వీరిలో కొందరు విదేశాల్లో స్థిరపడ్డారు.

Published : 08 Dec 2021 00:51 IST

మంత్రి దృష్టి సారిస్తే ప్రయోజనం

న్యూస్‌టుడే, వికారాబాద్‌ మున్సిపాలిటీ: జిల్లా కేంద్రంలో 1979లో బాల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడే చాలా మంది నృత్యం, తబలా, చిత్రలేఖనం నేర్చుకుని ఆయా రంగాల్లో ప్రావీణ్యం సాధించారు. వీరిలో కొందరు విదేశాల్లో స్థిరపడ్డారు. ఎంతో మంది భవితకు బాటలు వేసిన కేంద్రం అభ్యున్నతికి నోచుకోవడంలేదు. వివిధ సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారిస్తే పురోగతి సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ కథనం..

రాష్ట్రంలో మూడు బాల కేంద్రాలను బాలభవన్‌గా అప్‌గ్రేడ్‌ చేస్తూ ఇటీవల విద్యాశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. సూర్యాపేట, వనపర్తి, కరీంనగర్‌లో ఉన్నవాటికి అవకాశం దక్కింది. ఈ జాబితాలో వికారాబాద్‌ ఉంటుందని జిల్లా ప్రజలు ఆశించినా, నిరాశే మిగిలింది. వికారాబాద్‌ కేంద్రాన్ని బాల భవన్‌గా మార్చాలన్న డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. ఇక్కడి ప్రజలు, కళాకారులు ఇదే విషయమై కొన్నేళ్లుగా కోరుతున్నారు. ఈ కేంద్రానికి సొంత భవనం, సుమారుగా 1,100 గజాల స్థలం ఉంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన మంత్రి సబితారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ఆనంద్‌ చొరవ తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

వివిధ అంశాల్లో శిక్షణ: కేంద్రంలో ఏటా కనీసం 200 మంది విద్యార్థులు నృత్యం, చిత్రలేఖనం, కుట్టుపనుల్లో శిక్షణ పొందుతున్నారు. వీరంతా జాతీయ, రాష్ట్ర స్థాయి నృత్య పోటీల్లో పాల్గొని బహుమతులు అందుకున్నారు. పట్టణంలో తరచుగా జరిగే కార్యక్రమాల్లో పాల్గొని ప్రదర్శన ఇస్తుంటారు. చిత్రలేఖనంలో తర్ఫీదు పొందిన విద్యార్థులు మనసుకు హత్తుకునే విధంగా చిత్రాలను గీయగలరు.

మారితే ప్రయోజనం: కేంద్రం బాలభవన్‌గా మారితే ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తారు. తద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చు. శిక్షకులు 12 మంది వరకు ఉంటారు. విద్యా సంస్థ మాదిరిగా పనివేళలు ఉంటాయి. సిబ్బందికి పేస్కేల్‌ వర్తిస్తుంది.

విద్యుత్తు సౌకర్యం లేక: కేంద్రానికి నాలుగు సంవత్సరాలుగా విద్యుత్తు సౌకర్యం లేదు. బిల్లులు చెల్లించకపోవడంతో  సరఫరా నిలిపివేశారు. రూ.25 వేలు చెల్లించాల్సి ఉంది. ఖాళీగా ఉన్న లలిత సంగీతం ఉపాధ్యాయురాలు, సూపరింటెండెంట్‌, కాపలాదారు పోస్టులు భర్తీ చేయాలి.


ఎన్నో సార్లు వినతిపత్రాలను ఇచ్చాం
శ్రీకాంత్‌, ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌

కేంద్రాన్ని బాలభవన్‌గా మార్చాలని ఎన్నో సార్లు ఉన్నతాధికారులకు వినతిపత్రాలను అందజేశాం. ప్రజాప్రతినిధులను కోరాం. అయినా ఫలితం లేకుండా పోయింది. కనీసం ఖాళీలన్నా భర్తీ చేయాలి. ప్రస్తుతం విద్యార్థులకు ప్రవేశాలు ప్రారంభమయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని