logo

సంక్షిప్త వార్తలు

బలవంతంగా కెన్యా రాజధాని నైరోబీకి తీసుకెళుతున్నారని ఓ మహిళా ప్రయాణికురాలు భద్రతాధికారులను ఆశ్రయించిన సంఘటన శంషాబాద్‌ విమానాశ్రయంలో మంగళవారం చోటు చేసుకుంది. విమానాశ్రయం అధికారులు

Published : 08 Dec 2021 03:07 IST

బలవంతంగా కెన్యాకు తరలిస్తున్నారంటూ ఫిర్యాదు

శంషాబాద్‌, న్యూస్‌టుడే: బలవంతంగా కెన్యా రాజధాని నైరోబీకి తీసుకెళుతున్నారని ఓ మహిళా ప్రయాణికురాలు భద్రతాధికారులను ఆశ్రయించిన సంఘటన శంషాబాద్‌ విమానాశ్రయంలో మంగళవారం చోటు చేసుకుంది. విమానాశ్రయం అధికారులు తెలిపిన కథనం ప్రకారం..నేపాల్‌కు చెందిన తమాంగ్‌ను ఓ వ్యక్తి బలవంతంగా నైరోబీకి తరలిస్తున్నాడు. ఈ నేపథ్యంలో విమానాశ్రయానికి వచ్చిన ఆమె భద్రతాధికారులను ఆశ్రయించింది. ఆమె ప్రవర్తనను గమనించిన సదరు వ్యక్తి పరారయ్యాడు. ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


ఫ్యాన్సీ నంబర్లకు క్రేజ్‌

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: ఫ్యాన్సీ నంబర్లు రవాణాశాఖకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. మంగళవారం నిర్వహించిన ఆన్‌లైన్‌ టెండర్‌ ప్రక్రియలో టీఎస్‌09 ఎఫ్‌టీ 9999 నంబరును రూ.20.10లక్షలు చెల్లించి కీస్టోన్‌ ఇన్‌ఫ్రా సంస్థ సొంతం చేసుకుంది. కొత్త సిరీస్‌లో టీఎస్‌09 ఎఫ్‌యూ 0009 నంబరుకు ఎపిటోమ్‌ ప్రాజెక్ట్స్‌ రూ.7.95 లక్షలు చెల్లించగా, 0001 నంబరును రాధికరెడ్డి పెరటి రూ.3.08లక్షలు చెల్లించి దక్కించుకున్నారు. హైదరాబాద్‌ జిల్లా రవాణా శాఖకు రూ.46,14,824 ఆదాయం చేకూరిందని జేటీసీ పాండురంగ నాయక్‌ తెలిపారు.


తాగునీటి ట్యాంకులో కుళ్లిన మృతదేహం

రాంనగర్‌, న్యూస్‌టుడే: రాంనగర్‌ డివిజన్‌ ఎస్సార్కేనగర్‌ ప్రాంతంలోని జలమండలికి చెందిన 50 అడుగుల ఎత్తులో ఉన్న వాటర్‌ ట్యాంకులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం(25) ఉన్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముషీరాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ జహంగీర్‌యాదవ్‌ తెలిపిన వివరాల ప్రకారం...మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు జలమండలి సిబ్బంది ట్యాంకును శుభ్రం చేసేందుకు ఆరుగురు కూలీలను ట్యాంకుపైకి పంపించారు. కూలీలు ట్యాంకుపై ఉన్న మూతను తొలగించి లోపలికి దిగుతుండగా కుళ్లిపోయిన వ్యక్తి మృతదేహం కనిపించింది. వారు భయంతో కిందికి వచ్చి విషయాన్ని సిబ్బందికి చెప్పారు. వెంటనే జలమండలి సిబ్బంది ముషీరాబాద్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఇన్‌స్పెక్టర్‌ జహంగీర్‌యాదవ్‌, డీఐ వెంకన్న, సెక్టార్‌ ఎస్సై శ్రీనివాస్‌ సంఘటన స్థలానికి చేరుకుని జీహెచ్‌ఎంసీ అత్యవసర విభాగం డీఆర్‌ఎఫ్‌ సహాయంతో సాయంత్రం 6 గంటలకు మృతదేహాన్ని బయటకు తీశారు. సుమారు వారం, పది రోజుల క్రితం మృతి చెంది ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతదేహం కుళ్లిపోయి అస్తిపంజరంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

హత్య.. ఆత్మహత్య

వాటర్‌ ట్యాంకు లోపలికి వెళ్లడానికి రెండు ద్వారాలు ఉన్నాయి. వాటికి మూతలు వేసి ఉన్నాయని ట్యాంకును శుభ్రం చేయడానికి వెళ్లిన కూలీలు తెలిపారు. రెండు ద్వారాలకు మూతలు వేసి ఉండటంతో మృతుడితోపాటు మరొకరు వచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదవశాత్తు ట్యాంకులో పడి ఉంటే మూతలు ఎలా పెట్టి ఉంటాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ట్యాంకుపై జత చెప్పులు ఉన్నాయి. కేసు దర్యాప్తులో అవి కీలకంగా మారనున్నాయని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, ఎమ్మెన్‌ శ్రీనివాస్‌, కార్పొరేటర్‌ రవిచారి, మాజీ కార్పొరేటర్‌ వి.శ్రీనివాస్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను అడిగి తెలుసుకున్నారు.


మందుబాబులపై 65వేల కేసులు

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, రాయదుర్గం: మోతాదు మించి మద్యం తాగుతూ వాహనాలు నడుపుతున్న వారిపై మూడు పోలీస్‌ కమిషనరేట్లలో ఈ ఏడాది జనవరి నుంచి నవంబరు నెలాఖరు వరకు 65 వేల కేసులు నమోదు చేశారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోనే అత్యధికంగా 36 వేలకు పైగా కేసులు నమోదు చేశామని పోలీస్‌ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర రహదారి భద్రతపై మంగళవారం ట్రాఫిక్‌ అధికారులతో సమీక్షించారు. జీహెచ్‌ఎంసీ, విద్యుత్‌, జలమండలి, ఎక్సైజ్‌ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మాదాపూర్‌ జోన్‌ పరిధిలోనే ఎక్కువగా ప్రమాదాలు నమోదవుతున్నందున ఆ జోన్‌లో ప్రమాదాలు తగ్గించేందుకు దృష్టి కేంద్రీకరించాలన్నారు. మోటార్‌ వాహన చట్టం ప్రకారం లైసెన్సులు రద్దు చేయించేందుకు రవాణా శాఖ అధికారులో ఎప్పటికప్పుడు సంప్రదించాలని తెలిపారు. ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలతో పాటు, రాత్రివేళల్లో ప్రమాదాలు జరిగే అవకాశాలున్న హాట్‌స్పాట్‌లను గుర్తించి అక్కడ తగిన జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు.


మహిళ స్నానం చేస్తుండగా వీడియో చిత్రీకరణ
నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగింత

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: బాత్‌రూంలో మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసిన ప్రబుద్ధుడు పోలీసులకు చిక్కాడు. బంజారాహిల్స్‌కు చెందిన మహిళ ఇంట్లో స్నానం చేస్తోంది. పక్కింటికి వచ్చిన ఇంటర్నెట్‌ కంపెనీ టెక్నీషియన్‌ ఆమెను చూసి బాత్‌రూం కిటికీనుంచి చరవాణిలో వీడియో తీయడం ప్రారంభించాడు. గమనించిన మహిళ వెంటనే కుమారుడికి తెలియజేయడంతో అతడు సదరు వ్యక్తిని పట్టుకొని బంజారాహిల్స్‌ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చి నిందితుడిని అదుపులోకి విచారించారు. మల్లేపల్లి ఇందిరానగర్‌కు చెందిన ఓ ఇంటర్నెట్‌ కంపెనీ టెక్నీషియన్‌ మార్టిన్‌(19)గా గుర్తించారు. బాధితురాలి భర్త పిర్యాదుతో కేసు నమోదుచేశారు.


‘లక్ష యువగళ గీతార్చన’ 14న

సుల్తాన్‌బజార్‌, న్యూస్‌టుడే: వైకుంఠ ఏకాదశి, గీతా జయంతిని పురస్కరించుకొని ఈ నెల 14న ఎల్బీస్టేడియంలో ‘లక్ష యువగళ గీతార్చన’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విశ్వహిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రామరాజు తెలిపారు. మంగళవారం కోఠిలోని వీహెచ్‌పీ కార్యాలయంలో కార్యదర్శి బండారి రమేష్‌, గీతార్చన కార్యక్రమం కన్వీనర్‌ వెంకటేశ్వరరాజు, భజరంగ్‌దళ్‌ రాష్ట్ర కన్వీనర్‌ సుభాష్‌చందర్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. కార్యక్రమానికి శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ కోశాధికారి గోవింద్‌గిరి, కార్యదర్శి చంపత్‌రాయ్‌, త్రిదండి చినజీయర్‌స్వామి, పెజావర్‌ మఠ్‌కు చెందిన విష్యప్రసన్న తీర్థ్‌ మహారాజ్‌, వీహెచ్‌పీ జాతీయ ప్రధాన కార్యదర్శి మిలింద్‌ పరాండే హాజరవుతారన్నారు.


న్యాయవాదుల సారథి సునీల్‌గౌడ్‌  

ఈనాడు, హైదరాబాద్‌: అఖిల భారత న్యాయవాదుల క్రికెట్‌ టోర్నీలో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర హైకోర్టు లాయర్ల సంఘం జట్టుకు సునీల్‌గౌడ్‌ సారథ్యం వహించనున్నాడు. ఈనెల 23 నుంచి 28 వరకు కటక్‌లో టోర్నీ జరుగుతుంది. జట్టు: సునీల్‌గౌడ్‌ (కెప్టెన్‌), రాజగోపాల్‌రెడ్డి, రఘువీరారెడ్డి, గోవింద్‌రెడ్డి, సయ్యద్‌ మన్సూర్‌, పవన్‌కుమార్‌ ఆదిత్య, సుమన్‌గౌడ్‌, సంచిత్‌ భంగ్‌, కహిలిద్‌ బిన్‌ సయీద్‌, ఉన్నం కృష్ణ, రాహుల్‌ తపాడియా, సాయిచంద్‌, అబ్దుల్‌ మతిన్‌ ఖురేషి, స్వామి, మనోహర్‌, హరిందర్‌, బాల గోపేందర్‌నాథ్‌ (మేనేజర్‌), ప్రవీణ్‌ (కోచ్‌).

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని