Real Estate: హైదరాబాద్‌ రియల్‌.. 16 శాతం వృద్ధి

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ జోరు కొనసాగుతోంది. ఈ ఏడాది మొదటి 11 నెలల్లో 21,988 ఇళ్ల విక్రయాలు జరిగాయని స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా మంగళవారం వెల్లడించిన నివేదికలో పేర్కొంది.

Updated : 08 Dec 2021 07:01 IST

నైట్‌ఫ్రాంక్‌ ఇండియా నివేదికలో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ జోరు కొనసాగుతోంది. ఈ ఏడాది మొదటి 11 నెలల్లో 21,988 ఇళ్ల విక్రయాలు జరిగాయని స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా మంగళవారం వెల్లడించిన నివేదికలో పేర్కొంది. వార్షిక వృద్ధి 16 శాతమని పేర్కొంది. ముఖ్యంగా  హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల్లో రూ.11,164 కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లు వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే ఇళ్ల ధరలు సగటున 6 శాతం పెరిగాయి.

* కొవిడ్‌తో గత ఏడాది ఆరంభంలో ఇళ్ల విక్రయాలు మందగించినా.. ఆఖరులో పుంజుకున్నాయి. 2020 జనవరి నుంచి నవంబరు వరకు 18,888 ఇళ్లు, ఈ ఏడాది 16 శాతం వృద్ధితో 21,988 ఇళ్ల విక్రయాలు పూర్తయ్యాయి. సంవత్సరం ముగియడానికి మరో నెల గడువు మిగిలి ఉన్నా.. హైదరాబాద్‌ మార్కెట్‌లో విక్రయాలు ఎక్కువగా మొదటి అర్ధ సంవత్సరంలో జరుగుతున్నాయి.  

రూ.50 లక్షల లోపే అధికం.. : విక్రయించిన వాటిలో రూ.50 లక్షల లోపున్న ఇళ్ల వాటా 66 శాతంగా ఉందని నివేదిక స్పష్టం చేస్తోంది.  రూ.25లక్షల- రూ.50 లక్షల మధ్య విక్రయాలే 34 శాతం ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ విభాగం వాటా 3 శాతం పెరిగింది. అదే రూ.25 లక్షల లోపు ఇళ్ల వాటా 35 నుంచి 32 శాతానికి పడిపోయింది. రూ.75 లక్షల నుంచి రూ.2 కోట్లపైన విలువ ఉన్న ఇళ్ల విక్రయాల వాటా స్థిరంగా ఉంది. కొవిడ్‌ కారణంగా గత ఏడాది ధరలు స్థిరంగా ఉండగా, ఆ తర్వాత ఏడాది గడిచేసరికి 5.8 శాతం పెరిగాయి.


ధరలు పెరగడంతో కొంటున్నారు..

తెలంగాణలో స్టాంప్‌ డ్యూటీలో తగ్గింపు ఇవ్వకపోయినా.. స్థిరాస్తి ధరలు క్రమంగా వృద్ధి చెందుతుండటతో   ఆకర్షణీయ కొనుగోలు మార్కెట్లల్లో ఒకటిగా కొనసాగుతోంది. భవనాల ఎత్తుపై ఎఫ్‌ఎస్‌ఐపై  ఆంక్షలు లేకపోవడంతో మౌలిక వసతులపై భారం పడుతుందనే ఆందోళనలు ఉన్నప్పటికీ.. మూలాలు బలంగా ఉండటంతో ఆకర్షిస్తూనే ఉంది.

-శిశిర్‌బజార్‌, సీఎండీ, నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని